bird suicide :పక్షుల ఆత్మహత్యల మిస్టరీ.. సైన్స్ vs నమ్మకం
bird suicide : దీని వెనుక ఎలాంటి శాస్త్రీయ కారణం లేదని, దుష్టశక్తే ఈ పక్షులను బలి తీసుకుంటోందని బలంగా నమ్ముతారు.

bird suicide : సాధారణంగా మనుషుల ఆత్మహత్యల గురించి వింటూ ఉంటాం. కానీ, పక్షులు కూడా ప్రాణాలు తీసుకుంటాయని ఎప్పుడైనా విన్నారా? అవును, మన దేశంలోని అస్సాం రాష్ట్రంలో ఒక వింత గ్రామంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో పక్షులు భవనాలను, చెట్లను ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. ఇది అరుదైన సంఘటన కాదు, ప్రతి ఏటా జరిగే ఒక అంతుచిక్కని మిస్టరీ.
bird suicide
అస్సాంలోని బోరెల్ కొండల (Borail Hills,) మధ్య ఉన్న జాతింగా అనే ఈ గిరిజన గ్రామాన్ని ‘సూసైడ్ పాయింట్ ఆఫ్ బర్డ్స్’ అని పిలుస్తారు. ఇక్కడి స్థానిక పక్షులే కాదు, సుదూర ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులు కూడా ఈ గ్రామంలోకి అడుగుపెడితే చాలు, వింతగా ప్రవర్తిస్తూ చనిపోవడం మొదలుపెడతాయి.
ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో, అది కూడా రాత్రి వేళల్లో ఈ పక్షుల ఎక్కువగా చనిపోతుంటాయి. పగటిపూట మాత్రం అవి మామూలుగానే ఎగురుతూ కనిపిస్తాయి.
ఈ సంఘటనలపై చాలా మంది పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ గ్రామంలోకి ప్రవేశించిన పక్షులు ఒక్కసారిగా వేగంగా ఎగరడం, చెట్లు లేదా భవనాలను ఢీకొని తీవ్రంగా గాయపడటం, చివరికి రోడ్లపైనే ప్రాణాలు కోల్పోవడం వంటివి గమనించారు.
పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. జాతింగా గ్రామానికి ఇతర ప్రాంతాలకు మధ్య దాదాపు తొమ్మిది నెలలు రోడ్డు సంబంధాలు తెగిపోతాయి. ఈ ప్రాంతంలో అధిక అయస్కాంత శక్తి ఉంటుంది. చలి కాలంలో దట్టమైన పొగ, మంచు వల్ల రాత్రి సమయంలో తీవ్రమైన చీకటి కమ్ముకుంటుంది. ఈ ప్రత్యేక పరిస్థితులే పక్షుల వింత ప్రవర్తనకు కారణమని చెబుతున్నారు.
దిశానిర్దేశం కోల్పోయి (disoriented), తమ సాధారణ వేగం కంటే ఎక్కువగా ఎగిరే ప్రయత్నంలో అవి చెట్లను, భవనాలను గుర్తించలేక ఢీకొని చనిపోతున్నాయని వారు భావించారు. ఒక రకంగా, ఇది ప్రకృతిపరమైన ‘దిశాభ్రమణం’ వల్ల జరిగే సంఘటన అని వారు విశ్లేషిస్తున్నారు.
అయితే, జాతింగా(Jatinga) గ్రామస్తుల నమ్మకాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. పరిశోధకుల అధ్యయనాన్ని అస్సలు నమ్మరు. తమ ఊర్లో ఏదో దుష్టశక్తి ఉందని, అదే పక్షులను ఇక్కడ బతకనివ్వడంలేదని వారు బలంగా నమ్ముతున్నారు.
రాత్రి సమయంలో తమ గ్రామంలో వింత సంఘటనలు జరుగుతుంటాయని, అందుకే చీకటి పడిన తర్వాత జాతింగా గ్రామంలోకి ఎవరినీ అనుమతించబోమని చెబుతూ ఉంటారు. దీని వెనుక ఎలాంటి శాస్త్రీయ కారణం లేదని, దుష్టశక్తే ఈ పక్షులను బలి తీసుకుంటోందని బలంగా నమ్ముతారు.
మొత్తంగా శాస్త్రానికి, నమ్మకాలకు మధ్య ఒక అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిన ఈ ‘జాతింగా’ పక్షుల ఆత్మహత్యల మిస్టరీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.