ED: టాలీవుడ్ స్టార్స్‌కు ఈడీ ఉచ్చు..ఈరోజు ప్రకాష్ రాజు వంతు
ED : సెలబ్రిటీల ప్రమోషన్స్ దగ్గరి నుంచి మనీ లాండరింగ్ వ్యవహారాల వరకు ప్రతీ అంశంపైనా ఈడీ తమ పట్టు బిగిస్తోంది.

ED : ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్.. పేరుకు ఆట కానీ, వేల కుటుంబాలను నిండా ముంచి, ఎంతోమంది నిండు ప్రాణాలను బలిగొన్న ఓ భయంకరమైన ఉచ్చు. ఈ నల్లధనం వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తోంది. అక్రమ లావాదేవీల చిట్టా బయటపడుతుండటంతో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెనక్కి తగ్గడం లేదు. సెలబ్రిటీల ప్రమోషన్స్ దగ్గరి నుంచి మనీ లాండరింగ్ వ్యవహారాల వరకు ప్రతీ అంశంపైనా ఈడీ తమ పట్టు బిగిస్తోంది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్లే ఈడీ విచారణకు కీ రోల్ ప్లే చేస్తున్నాయి.
ED
బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోషన్స్, వాటి ద్వారా జరిగిన భారీ ఆర్థిక లావాదేవీలపై ఈడీ (ED)లోతుగా విచారణ జరుపుతోంది. దీనిలో భాగంగానే టాలీవుడ్ నుంచి పలువురు అగ్రశ్రేణి నటీనటులకు నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన మొదటి ప్రముఖులలో నటుడు ప్రకాష్ రాజ్( Prakash Raj) ఒకరు. పది రోజుల క్రితం నోటీసులు అందుకున్న ఆయన, ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో నటించినందుకు బుధవారం జులై 30 న ఈడీ ముందు హాజరయ్యారు.
అలాగే ఈ నెల 23న..ఈడీ విచారణకు హాజరు కావాలని దగ్గుబాటి రానాకు సమన్లు జారీ చేసింది. అయితే సినిమా షూటింగ్ షెడ్యూల్ వల్ల ఆయన ఆ రోజు హాజరు కాలేనని చెప్పడంతో.. రానాకు ఈడీ అధికారులు ఆగస్టు 11న కొత్త తేదీని ఇచ్చారు. అటు ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని మంచు లక్ష్మికి కూడా ఈడీ నోటీసులు అందాయి.
ఈ సెలబ్రిటీలందరినీ బెట్టింగ్ యాప్స్‌తో వారు చేసుకున్న అగ్రిమెంట్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు, వాటికి సంబంధించిన అన్ని పత్రాలతో సహా విచారణకు రావాలని ఈడీ కఠినంగా ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు 29 మంది నటీనటులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపైనా ఈడీ దృష్టి పెట్టింది. ఈ కేసులో పేర్లున్న మిగతా వారికి కూడా దశలవారీగా సమన్లు జారీ చేయనున్నట్లు ఈడీ వర్గాలు పరోక్షంగా హెచ్చరించాయి.
ఈడీ దర్యాప్తు కేవలం ప్రమోషన్లకే పరిమితం కావడం లేదు. బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు కీలకంగా మారాయి. తెలంగాణ పోలీసులు మొత్తం 36 బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన ప్రమోషన్స్‌పై సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, అలాగే విశాఖపట్నంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను ఈడీ లోతుగా అధ్యయనం చేస్తోంది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌ను అడ్డు అదుపు లేకుండా ప్రమోట్ చేయడంతో, అమాయక ప్రజలు ఈజీగా ఆకర్షితులయ్యారు. వీటిలో డబ్బులు పెట్టి, ఒక్క రాత్రిలోనే లక్షలాది రూపాయలు పోగొట్టుకుని వీధిన పడ్డారు. ఈ ఆర్థిక నష్టాలు ఎంతోమందిని నిరాశలోకి నెట్టి, చివరికి ఆత్మహత్యలకు దారి తీశాయి. ఈ పరిస్థితికి బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లకు కూడా బాధ్యత ఉందని ఈడీ బలంగా నమ్ముతోంది.
దీంతోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ అంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఇప్పుడు ఈ కేసులో ప్రకాశ్ రాజ్ హాజరవడంతో అతను ఈడీ ముందు ఏ విషయాలు చెబుతారా అనే ఆసక్తి నెలకొంది.