Biophilic: నాలుగు గోడల మధ్య ప్రకృతిని సృష్టించుకోండి..బయోఫిలిక్ మంత్రం ఫాలో అయిపోండి..
Biophilic :ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలుతురులో వచ్చే మార్పులను మనం జాగ్రత్తగా గమనించగలిగితే ..మన ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Biophilic
మనమెంత అభివృద్ధి చెందినా మన మూలాలు మాత్రం ప్రకృతిలోనే ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు 90 శాతం ఇప్పుడు మనం మన సమయాన్ని నాలుగు గోడల మధ్యే గడుపుతున్నాం. దీనివల్ల తెలీకుండానే మనలో టెన్షన్, ఏకాగ్రత లోపించడం వల్ల సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి.
ఈ సమస్యలన్నింటికీ కూడా ఏకైక పరిష్కారం బయోఫిలిక్(Biophilic) డిజైన్ మాత్రమే అంటున్నారు మానసిక నిపుణులు. సరళంగా చెప్పాలంటే మన ఇంటిని లేదా ఆఫీసును ప్రకృతితో మమేకం చేయడమే ఈ డిజైన్ ముఖ్య ఉద్దేశ్యం. దీనిని ముఖ్యంగా 3 భాగాలుగా అర్థం చేసుకోవచ్చు.
బయోఫిలిక్(Biophilic) డిజైన్లో ప్రకృతితో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోవడం మొదటిది. ముఖ్యంగా ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా విండోస్‌ను అమర్చుకోవడం మెయిన్ స్టెప్. ఏసీల కంటే కిటికీల ద్వారా వచ్చే నేచురల్ గాలి మనిషిలో ఆలోచనా శక్తిని పెంచుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
అలాగే గదిలో స్నేక్ ప్లాంట్ వంటి ఆక్సిజన్ మొక్కలను పెంచడం వల్ల గాలి ప్యూర్‌గా అవ్వడమే కాకుండా మన కళ్లకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇంటి లోపల చిన్న ఫిష్ ట్యాంక్ లేదా నీళ్లు ప్రవహించే ఫౌంటెన్ ఏర్పాటు చేసుకుంటే, ఆ నీటి చప్పుడు విన్నప్పుడు ..మన మెదడులో ప్రశాంతతను ఇచ్చే తరంగాలు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల రక్తపోటు తగ్గి మనస్సు స్థిమితంగా ఉంటుంది.
నేరుగా ప్రకృతి కాకపోయినా, ప్రకృతిని గుర్తుచేసే వస్తువులను వాడటం దీనిలోని రెండో అంశం. ప్లాస్టిక్ , మెటల్ వస్తువుల కంటే వెదురు, చెక్క , రాయి వంటి సహజ వస్తువులతో ఫర్నిచర్ లేదా ఫ్లోరింగ్ చేయించుకోవడం వల్ల ఒక రకమైన నేచురల్ ఫీలింగ్ కలుగుతుంది.
అలాగే గోడల మీద ఆకులు, తరంగాలు , వంపులు తిరిగిన డిజైన్లను ఉపయోగించడం వల్ల అవి మనకు అడవిని లేదా సముద్రాన్ని గుర్తు చేస్తాయి. ప్రకృతిలో ఎక్కడా కూడా గీసినట్టుగా సరళరేఖలనేవి ఉండవు, అన్నీ వంపులు తిరిగి ఉంటాయి. అలాంటి డిజైన్లను ఈ ఇంటీరియర్లో వాడటం వల్ల మనకు తెలీకుండానే ప్రకృతికి దగ్గరగా ఉన్నామన్న భావన కలుగుతుంది.

ఇక ప్రకృతి అనుభూతిని ఇంటి లోపలికి తీసుకురావడమనేది మూడోది అండ్ ముఖ్యమయినది. పూర్వం మన ఇళ్ల మధ్యలో ప్రాంగణం ఉండేది. అది ఆకాశాన్ని చూస్తూ మనసును విశాలంగా ఉంచడంలో సాయం చేసేది. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ లో కూడా బాల్కనీలను కానీ టెర్రస్ గార్డెన్లను కానీ అదే విధంగా రూపొందించుకోవచ్చు. ముఖ్యంగా ఇంటి లోపల పడే సూర్యరశ్మి మన బాడీలోని నిద్ర చక్రాన్ని కూడా రెగ్యులైజ్ చేస్తుంది.
బయోఫిలిక్ డిజైన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలుతురులో వచ్చే మార్పులను మనం జాగ్రత్తగా గమనించగలిగితే ..మన ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే ఆసుపత్రుల్లో ఇలాంటి ప్రకృతితో కూడిన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల రోగులు 8.5 శాతం వేగంగా కోలుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. మొత్తానికి బయోఫిలిక్ డిజైన్ అనేది కేవలం ఒక ఫ్యాషన్ కాదు, అది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా చాలా అవసరం అని చాలామంది అర్ధం చేసుకుంటున్నారు.



