Gautam Gambhir : ప్రయోగాలు ఆపేయ్… గంభీర్‌పై ఫ్యాన్స్ ఫైర్
Gautam Gambhir : మెగాటోర్నీ కీలక సమయంలో పనికిమాలిన ప్రయోగాలు చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా తుది జట్టు కూర్పులో గంభీర్ వ్యూహాలు బెడిసికొట్టాయి
Gautam Gambhir
ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భారత్ సీన్ రివర్స్ అయింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో సొంతగడ్డపై ఆడుతుండడంతో మరోసారి టైటిల్ గెలిచే సత్తా ఉందన్న అంచనాలున్నాయి. లీగ్ స్టేజ్ ను ఘనంగా ముగించిన భారత్ సూపర్ 8 స్టేజ్ ను మాత్రం ఓటమితో ఆరంభించింది. ఈ ఒక్క పరాజయం భారత్ సెమీస్ అవకాశాలపై గట్టిగానే దెబ్బకొట్టింది. ఏదో సాధారణంగా ఓడిపోతే అంత ఇబ్బంది ఉండేది కాదు. కానీ 76 పరుగుల తేడాతో ఓటమి పాలవడం రన్ రేట్ పై (-0.3780)పై గట్టిగానే దెబ్బపడింది.
దీనివల్ల సెమీఫైనల్ అవకాశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచ్ లు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. గెలిచినా ఇతర జట్ల సమీకరణాలు కూడా కొద్దిగా కలిసిరావాల్సిన పరిస్థితి. అసలు ఈ పరిస్థితికి కారణం కోచ్ గౌతమ్ గంభీరే(Gautam Gambhir) అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మెగాటోర్నీ కీలక సమయంలో పనికిమాలిన ప్రయోగాలు చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా తుది జట్టు కూర్పులో గౌతమ్ గంభీర్(Gautam Gambhir) వ్యూహాలు బెడిసికొట్టాయి. అక్షర్ పటేల్ ను బెంచ్ కే పరిమితం చేసి వాషింగ్టన్ సుందర్ ను కొనసాగించడం వెనుక గంభీర్ వ్యూహం ఏంటనేది ఎవ్వరికీ అర్థం కాలేదు.
అలాగే ఛేజింగ్ సమయంలో గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా విమర్శలకు దారితీసాయి. వరుసగా వికెట్లు పడినప్పుడు రింకూ సింగ్, శివమ్ దూబే వంటి స్పెషలిస్ట్ హిట్టర్లు ఉండగా.. వాషింగ్టన్ సుందర్‌ను బ్యాటింగ్ ఆర్డర్ లో ఎందుకు ప్రమోట్ చేసాడనేది చర్చనీయాంశంగా మారింది. ఒత్తిడి సమయంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై నమ్మకం ఉంచకపోవడం విమర్శలకు దారితీసింది. అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టి సుందర్‌ను తీసుకోవడం కూడా తప్పుడు నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. భయం లేని క్రికెట్ ఆడాలనే ప్రయత్నంలో, వికెట్లు పడుతున్నా భారత్ ఏ దశలోనూ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేయలేదని విమర్శిస్తున్నారు.

నిజానికి సౌతాఫ్రికాది కూడా పవర్ ప్లేలో దాదాపు అదే పరిస్థితి. మూడు కీలక వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. అయితే మిల్లర్ , బ్రెవిస్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వికెట్లు పడిన తర్వాత వేగంగా ఆడకుండా ముందు కొంచెం పార్టనర్ షిప్ నెలకొల్పే ఆలోచన కూడా లేకపోవడం ఆశ్చర్యపరిచింది. డ్రింక్స్ బ్రేక్ సమయంలోనూ గంభీర్ ఇలాంటి సూచనలు కూడా చేసినట్టు కనిపించలేదని పలువురు మాజీలు విమర్శిస్తున్నారు. నిజానికి బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు మెగాటోర్నీకి ముందు చేసుకోవాలే తప్ప టోర్నీ జరుగుతుండగా అది కూడా కీలకమైన సూపర్ 8 స్టేజ్ లో ఇలాంటివి చేయకూడదన్నది మాజీల అభిప్రాయం.
మ్యాచ్ మ్యాచ్ కూ కీలక బ్యాటర్ల స్థానాలు మారుతూ ఉంటే సహజంగానే వారి ఆటపై ప్రభావం పడుతుంది. వాషింగ్టన్ సుందర్ ను బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోట్ చేయడం కూడా ఇక్కడ ఓటమికి కారణమైందన్నది పలువురి అభిప్రాయం. ఇప్పుడు ఒక్క ఓటమితో మిగిలిన రెండు మ్యాచ్ లూ డూ ఆర్ డై గా మారిపోయాయి. ఫలితంగా తర్వాత మ్యాచ్ లలో వెస్టిండీస్ ,జింబాబ్వేలపై గౌతమ్ గంభీర్(Gautam Gambhir) వ్యూహాలు మార్చుకోకుంటే భారత్ సెమీఫైనల్ చేరడం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు



