Just SportsLatest News

PAK vs SL : గెలిచినా ఇంటికే..లంకపై గెలిచినా సెమీస్ చేరని పాక్

PAK vs SL : టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ కథ సూపర్ 8లోనే ముగిసింది. శ్రీలంకపై(PAK vs SL) చివరి మ్యాచ్ లో గెలిచినా కూడా సెమీఫైనల్ చేరలేకపోయింది

PAK vs SL

టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ కథ సూపర్ 8లోనే ముగిసింది. శ్రీలంకపై(PAK vs SL) చివరి మ్యాచ్ లో గెలిచినా కూడా సెమీఫైనల్ చేరలేకపోయింది. ఈ మ్యాచ్ లో 65 పరుగుల తేడాతో గెలిచి ఉంటే పాక్ సెమీస్ లో అడుగుపెట్టేది. అయితే లంకను 147 పరుగుల లోపు కట్టడి చేయడంలో పాక్ విఫలమైంది. కేవలం 5 పరుగుల తేడాతో గెలిచిన పాకిస్తాన్ మూడో స్థానానికే పరిమితవగా.. ఆ జట్టు కంటే మెరుగైన రన్ రేట్ ఉన్న న్యూజిలాండ్ ముందంజ వేసింది.

కాగా సెమీఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు సర్వశక్తులూ ఒడ్డింది. మొదట బ్యాటింగ్ కు దిగి భారీస్కోరు సాధించడమే లక్ష్యంగా ఆడింది. ఓపెనర్లు ఫర్హాన్, ఫకర్ జమాన్ తొలి వికెట్ కు రికార్డు స్థాయిలో పార్టనర్ షిప్ నెలకొల్పారు. 15.5 ఓవర్లలో ఏకంగా 176 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఫకర్ జమాన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 రన్స్ కు ఔటవగా.. ఫర్హాన్ మాత్రం సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మెగాటోర్నీలో అతనికిది రెండో సెంచరీ.

అంతకుముందు లీగ్ స్టేజ్ లో నమీబియాపైనా ఫర్హాన్ శతక్కొట్టాడు. ఈ క్రమంలో ప్రపంచకప్ ఒక ఎడిషన్ లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును సైతం బద్దలుకొట్టాడు. అలాగే వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు(2) చేసిన ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. అయితే చివర్లో పాక్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్కోర్ వేగం తగ్గింది. చివరికి పాకిస్థాన్ 8 వికెట్లకు 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది.

PAK vs SL
PAK vs SL

ఛేజింగ్ లో శ్రీలంక అనుకున్నంత వేగంగా ఆడలేకపోయింది. త్వరగానే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది.33 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా…అసలంక (25) , పవన్ రత్నానాయకే(58) పరుగులతో రాణించారు. అయితే 147 పరుగుల లోపే కట్టడి చేసేందుకు శతవిధాలా ప్రయత్నించినా పాక్ సక్సెస్ కాలేకపోయింది.

మరోవైపు చివర్లో ఒక్కసారిగా మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. కెప్టెన్ దసున్ శనక భారీ సిక్సర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 31 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో విజయం కోసం 28 పరుగులు చేయాల్సి ఉండగా.. వరుసగా 4 , 6 , 6 ,6 బాదాడు. ఈ దశలో చివరి 2 బంతులునూ షాహీన్ అఫ్రిది డాట్ బాల్స్ వేయడంతో లంక చారిత్రక విజయాన్ని అందుకోలేకపోయింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button