Shiva Temple: మన దేశంలో తొలి శివాలయం ఎక్కడ ఉందో తెలుసా?.. ఈ అద్భుత ఆలయాన్నిఎప్పుడైనా చూశారా?
Shiva Temple: తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు అత్యంత సమీపంలో.. స్వర్ణముఖి నది ఒడ్డున వెలిసిన శివ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది.
Shiva Temple
భారతదేశపు ఆధ్యాత్మిక చరిత్రలో ఎన్నో అద్భుతాలు కాలగర్భంలో కలిసిపోతే, మరెన్నో అద్భుతాలు శిలాశాసనాలై నిలిచిపోయాయి. అలాంటి ఒక అపురూప నిధి.. చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయంగా చెప్పుకుంటారు. తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు అత్యంత సమీపంలో.. స్వర్ణముఖి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది.
ఈ ఆలయం అక్షరాలా రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన, భారతదేశంలోనే అత్యంత పురాతనమైన శివాలయమని(Shiva Temple)చరిత్రకారులు పురావస్తు శాఖ ధృవీకరించారు. ఈ శివాలయానికి అడుగుపెట్టడం అంటే కేవలం ఒక ఆలయంలోకి వెళ్లడం కాదు, కాల యంత్రంలో (Time Machine) కూర్చుని వేల ఏళ్లనాటి కాలం వెనక్కి ప్రయాణించి మన పూర్వీకుల ఆదిమ సంస్కృతిని కనులారా వీక్షించడమే అంటారు .
మామూలుగా మనం చూసే శివాలయాల్లో లింగాలు మృదువుగా, ఒక నిర్దిష్టమైన ఆకృతిలో కనిపిస్తాయి. అయితే గుడిమల్లంలోని లింగం మాత్రం అసలు సిసలైన వేదకాలపు రుద్రుడిని తలపిస్తుంది. ముదురు గోధుమ రంగు రాతితో చెక్కబడిన ఐదు అడుగుల లింగంపై ఒక వేటగాడి రూపంలో సాక్షాత్తూ పరమశివుడు దర్శనమిస్తాడు.
ఒక మరుగుజ్జు యక్షుని భుజాలపై నిలబడి కుడి చేతిలో గొర్రెపిల్లను,ఎడమ చేతిలో గొడ్డలిని ధరించి ఉన్న ఈ శివుడి రూపం చూస్తుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఈ విగ్రహానికి యజ్ఞోపవీతం లేకపోవడాన్ని గమనిస్తే, ఇది ఆర్యుల రాకకు పూర్వమే మన దేశంలో ఉన్న దైవారాధన పద్ధతిని ప్రతిబింబించినట్లుగా అర్థమవుతుంది. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దానికి చెందిన ఈ అపురూప శిల్పం ఇప్పటికీ కంటిన్యూగా పూజలందుకుంటోంది.

ఈ ఆలయానికి పరశురామేశ్వరాలయం అని పేరు రావడం వెనుక మాత్రం ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. తన తండ్రి ఆజ్ఞతో తల్లిని సంహరించిన పరశురాముడు.. ఆ మాతృహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి ఈ స్వర్ణముఖి తీరానికి చేరుకున్నాడట. ఇక్కడి ఒక మేడి చెట్టు కింద ఉన్న పుట్టలో స్వయంభువుగా వెలిసిన ఈ అద్భుత శివ లింగాన్ని చూసి అక్కడే ఘోర తపస్సు చేశాడట.
పరశురాముని భక్తికి మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమై అతనికి పాపవిమోచనం కలిగించినట్లు స్థల పురాణం చెబుతోంది. వాస్తుపరంగా చూసినా కూడా ఈ శివాలయం(Shiva Temple) ఒక వింతే అంటారు . ఏనుగు వెనుక భాగంలా ఉండే గజపృష్ఠాకారంలో ఈ గర్భాలయం నిర్మించబడింది. పల్లవులు, చోళులు, విజయనగర రాజుల వరకు అందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములయ్యారట.





