Jasprit Bumrah : వందేళ్లకు ఒక్కడు..భారత క్రికెట్ లో కోహినూర్ డైమండ్
Jasprit Bumrah : జస్ప్రీత్ బుమ్రా తన అసాధారణ నైపుణ్యంతో టీమిండియాను మరోసారి ప్రపంచ విజేతగా నిలబెట్టాడు
Jasprit Bumrah
టీ20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్లదే ఆధిపత్యం.. పైగా ఉపఖండపు పిచ్‌లలో ఎక్కువ శాతం బ్యాటింగ్ కే అనుకూలిస్తుంటాయి. అభిమానులు కూడా వికెట్లు తీసే బౌలర్ల కంటే భారీ సిక్సర్లు బాదే బ్యాటర్ల ఇన్నింగ్స్ లనే ఆస్వాదిస్తున్నారు.. అందుకే 20 ఓవర్లకు స్కోర్లు 200 పైగా స్కోర్లు సర్వసాధారణంగా మారిపోయాయి.
అదే సమయంలో బౌలర్లకు కొన్ని సందర్భాల్లో రక్త కన్నీరు కనిపిస్తోంది. అయితే భారత జట్టులో ఒక బౌలర్ మాత్రం ప్రత్యర్థి బ్యాటర్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాడు. తన మ్యాజిక్ స్పెల్స్ తో అవతలి జట్టు నుంచి విజయాలను లాగేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రత్యర్థి బ్యాటర్లు అతని స్పెల్ 4 ఓవర్లను మైనస్ చేసి 16 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించాలన్న ఆలోచనకు వచ్చేశారు.
కెప్టెన్ సూర్యకుమార్ సైతం క్లిష్ట పరిస్థితుల్లో అతనివైపే చూస్తాడు.. ఎందుకంటే బంతిని అందుకున్నాడంటే కచ్చితంగా డాట్ బాల్స్ వేస్తాడు.. లేకుంటే వికెట్లు తీస్తాడు..అతనెవరో ఈ పాటికే మీకు అర్థమైపోయుంటుంది.. అవును భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రానే(Jasprit Bumrah).. బ్యాటర్లు చెలరేగిపోతున్న టీ20 ఫార్మాట్ లో మోస్ట్ ఎకానమికల్ బౌలర్ గా బుమ్రాకు పేరుంది.
టీ20 ఫార్మాట్ లో వికెట్లు తీయడం కంటే కూడా తక్కువ పరుగులు ఇవ్వడం గొప్ప ప్రదర్శనగా చెబుతారు.. సాధారణంగా ఏ బౌలర్ అయినా తాను వేసే 4 ఓవర్ల స్పెల్ లో సగటున 30 పరుగులు ఇవ్వడం సహజమే. అంతకంటే ఎక్కువ ఇచ్చే సందర్భాలే ఎక్కువగా చూస్తుంటాం. బుమ్రా(Jasprit Bumrah) మాత్రం అలా కాదు. బంతికో పరుగు కూడా ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లకు కొరకరాని కొయ్యలా మారిపోయాడు.
టీ20ల్లో డాట్ బాల్స్ ఆడిన బ్యాటర్ ను విలన్ గానే చూస్తారు. అదే సమయంలో డాట్ బాల్స్ వేసే బౌలర్ కచ్చితంగా హీరోనే అవుతాడు. బుమ్రా తన కెరీర్ లో ఎన్నోసార్లు ఇలా హీరో అయ్యాడు. ఈ ప్రపంచకప్ లోనూ అతని నుంచి మ్యాచ్ విన్నింగ్స్ స్పెల్స్ చూసాం. ముఖ్యంగా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథల్ వీరవిహారంతో మ్యాచ్ ఓడిపోయినట్టే అనుకున్నారు. అలాంటి సందర్భంలో బంతిని అందుకుని 16,18వ ఓవర్లను అద్భుతంగా బౌలింగ్ చేసిన ఘనత బుమ్రాదే. ఒకవేళ బుమ్రా లేకుంటే కచ్చితంగా ఇండియా ఇంటిదారి పట్టేది.

అంతకుముందు వెస్టిండీస్ తో నాకౌట్ మ్యాచ్ లోనూ బుమ్రా అదరగొట్టేశాడు. కీలక సమయంలో హెట్ మెయిర్, ఛేజ్ లను ఔట్ చేసి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు. మిగిలిన మ్యాచ్ లలోనూ పరుగులు ఇవ్వడంలో పిసినారిగా నిలిచాడు. టైటిల్ పోరులో సైతం రచిన్ రవీంద్రతో పాటు మిఛెల్ శాంట్నర్ , జిమ్మీ నీషమ్ లను పెవిలియన్ కు పంపాడు.
ఫైనల్లో కేవలం 15 పరుగులే ఇచ్చిన బుమ్రా(Jasprit Bumrah) 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్ గా పరుగుల వరద పారిన ఈ టీ20 ప్రపంచకప్ లో కేవలం 6.21 ఎకానమీతో బౌలింగ్ చేసాడంటే బుమ్రా సత్తాపై ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. అందుకే కాబోలు గవాస్కర్ లాంటి దిగ్గజాలు బుమ్రాను వందేళ్లకు ఒక్కడుగా చెబుతుంటారు. ఫైనల్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ ఈ స్టార్ పేసర్ పై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా మన జాతీయ సంపద అంటూ కితాబిచ్చాడు.





