Plastic containers:మీకు తెలుసా ప్లాస్టిక్ డబ్బాలకూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందట..
Plastic containers: తక్కువ ధరలోనే ప్లాస్టిక్ కంటైనర్లు దొరకడం, తేలికగా ఉండటం వల్ల చాలామంది వీటిని ఏళ్ల తరబడి వాడేస్తూ ఉంటారు.
Plastic containers
మన కిచెన్‌లో పప్పులు, ఉప్పులు, నిన్నటి అన్నం లేదా కూరగాయలు ఇలా ఏది నిల్వ చేయాలన్నా కూడా ప్లాస్టిక్ డబ్బాలను వాడటం ఒక అలవాటుగా మార్చుకున్నారు అంతా. తక్కువ ధరలోనే ఇవి దొరకడం, తేలికగా ఉండటం వల్ల చాలామంది వీటిని ఏళ్ల తరబడి వాడేస్తూ ఉంటారు. అయితే, మనం కొనే ఆహార పదార్థాలకు ఎలా ఎక్స్పైరీ డేట్ ఉంటుందో,అదే విధంగా ప్లాస్టిక్ డబ్బాల(Plastic containers)కు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్న నిజాన్ని చాలామంది గమనించరు.
నిజానికి ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్(Plastic containers)ను నాలుగు నుంచి ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ పాతబడే కొద్దీ దాని లోపలి పొరలు క్షీణించిపోతాయట. దీంతో కంటికి కనిపించని సూక్ష్మ రంధ్రాలు ఆ ప్లాస్టిక్ డబ్బాలకు ఏర్పడతాయి.
ఈ రంధ్రాలలో మనం ఎంత కడిగినా పోని బ్యాక్టీరియా చేరి, మనం నిల్వ చేసే ఆహారాన్ని విషపూరితం చేసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ తయారీలో వాడే బిస్ఫెనాల్-ఏ (BPA) , ఫ్థాలేట్స్ వంటి రసాయనాలు మన బాడీలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇవి ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లపై ప్రభావం చూపి, దీర్ఘకాలంలో సంతానలేమి అలాగే పిల్లల ఎదుగుదల లోపాలకు ఇది కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే మీ కిచెన్‌లోని ప్లాస్టిక్ డబ్బాలను ఎప్పుడు మార్చాలో.. తెలుసుకోవడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. డబ్బాపై చిన్న చిన్న పగుళ్లు కనిపించినా, లేదా గీతలు పడిపోయినా వాటిని పక్కన పడేయాలి. అలాగే, కొన్ని డబ్బాలు హీట్ తగలడం వల్ల ఆకారం మారి వంకరగా అయిపోతుంటాయి. అలా జరిగిందంటే ఆ ప్లాస్టిక్ నిర్మాణం దెబ్బతిందని, అది రసాయనాలను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవాలి.

చాలా కాలం పచ్చళ్లు , మసాలాలు నిల్వ చేయడం వల్ల డబ్బాలకు రంగు మారిపోవడం, లేదా కడిగినా పోని మొండి వాసన రావడం వంటివి జరిగితే, ఆ ప్లాస్టిక్ లోపలికి ఆహార కణాలు చొచ్చుకుపోయాయని గ్రహించాలి. ఇలాంటి డబ్బాలలో మళ్లీ ఆహారం పెట్టడం వల్ల పాత బ్యాక్టీరియా దానిలోకి చేరుతుంది. మనం కొత్తగా డబ్బాలు కొనేటప్పుడు కనీసం అవి బీపీఏ ఫ్రీ (BPA Free) అని ఉన్నాయో లేదో చూసుకోవాలి.
వీలైనంత వరకు వేడి వేడి పదార్థాలను కొత్త ప్లాస్టిక్ పాత్రలలో పోయకూడదు. ఎందుకంటే వేడి వల్ల ప్లాస్టిక్ కొంచెం కొంచెం కరిగి ఆహారంలో కలిసే అవకాశం ఎక్కువ. అందుకే దీనికి బదులు స్టీల్, గాజు , మట్టి పాత్రలను వాడటం వల్ల మన కుటుంబాన్ని ఇలాంటి కెమికల్ ముప్పుల నుంచి కాపాడుకోవచ్చు. మొత్తంగా ప్లాస్టిక్ వాడకం సౌకర్యంగా ఉంటున్నా కూడా, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం మనందరి బాధ్యత అని తెలుసుకోవాలి.





