Just Andhra PradeshJust PoliticalLatest News

Vijayasai Reddy : విజయసాయిరెడ్డి ముందున్న పొలిటికల్ సవాళ్లు..2029 ఎన్నికల కోసం చేయాల్సిన గ్రౌండ్ వర్క్ ఏంటి?

Vijayasai Reddy : 2024 ఎన్నికల్లోనే కాకుండా స్థానిక సంస్థల్లో కూటమి ఏకపక్ష విజయాలు, వైసీపీ ఘోర పరాజయాల సమయంలో విజయసాయిరెడ్డి పరివర్తన రాజనీతి పార్టీ (PRP) పెట్టడం వరకూ ఓకే మరి.. 2029 లక్ష్యంగా ఆయన ఎదుర్కోబోయే సవాళ్లు ఏంటి?

Vijayasai Reddy

2024 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న ఊహించని ఘోర పరాజయం, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థలు, పుర పోరు ఎన్నికల్లో కూడా కూటమి సాధించిన ఏకపక్ష విజయాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పిక్చర్‌ను పూర్తిగా మార్చేశాయి. ఏపీలో వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోవడం, కాంగ్రెస్ పార్టీ ఉనికికి మాత్రమే పరిమితం కావడం వంటి పరిణామాల మధ్య విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) పేరుతో సరికొత్త రణరంగానికి తెర లేచింది.

ఏళ్ల తరబడి వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితంగా, వైసీపీకి వెన్నెముకగా నిలిచిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత దారి చూసుకోవడం ఒక ఎత్తైతే, 2029 టార్గెట్‌గా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పిన ఆయన.. కొత్త పార్టీని ముందుకు తీసుకెళ్లడం అతిపెద్ద సవాల్ అవుతుంది.

2029 ఎన్నికల రేసులో విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) ముందున్న ప్రధాన సవాళ్లు..ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఓటర్లపై పటిష్టమైన పట్టే సాధించిందనేది కాదనలేని నిజం. పురపోరు ఫలితాలు కూడా అవే ప్రూవ్ చేశాయి. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అధికార కూటమి కేడర్ అత్యంత ఉత్సాహంతో ఉంది. ఇలాంటి బలమైన అధికారిక వ్యవస్థను ఎదుర్కొని, ఆంధ్రప్రదేశ్ ఓటర్లను తనవైపు తిప్పుకోవడం సాయిరెడ్డికి మొదటి , అతిపెద్ద పరీక్ష.

ఏపీలో వైసీపీ ఓటు బ్యాంకు అయితే ఇంకా పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. కాకపోతే జగన్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న వైసీపీ కేడర్‌ను, అసమ్మతి నాయకులను తనవైపు తిప్పుకోవడమే విజయసాయి రెడ్డి మెయిన్ స్ట్రాటజీ కానుంది. అయితే జగన్ రూపంలో ఉన్న పటిష్టమైన కేడర్‌ను తన కొత్త పార్టీ వైపు తిప్పడం అనుకున్నంత ఈజీ ఏం కాదు.

అసెంబ్లీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి. పురపోరులో తన ఉనికిని చాటుకున్నా కూడా అదే పార్టీ ఎదగడానికి అవకాశం అని చెప్పలేం. వైఎస్ షర్మిల నాయకత్వం వహించినా కూడా కాంగ్రెస్ పెద్దగా పుంజుకోలేకపోయింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్‌కే దిక్కులేదు, ఇక కొత్త పార్టీ ఏం చేస్తుందనే ప్రజాభిప్రాయాన్ని సాయి రెడ్డి తన గ్రౌండ్ వ్యూహాలతో తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఉంది.

మెయిన్‌గా ఇన్నాళ్లూ వైసీపీలో నెంబర్-2 పాత్ర పోషించి ఆ పార్టీ నిర్ణయాల్లో పార్ట్‌నర్‌గా ఉన్న విజయసాయి రెడ్డి.. ఇప్పుడు కొత్త బాట పట్టి పార్టీ పెట్టడం వెనుకున్న ఉద్దేశం ఏంటనేది సగటు ఓటరుకు అర్థం అయ్యేలా వివరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో విశ్వసనీయత సాధించడమే ఆయన వేయాల్సిన మొదటి మెట్టు.

2029 టార్గెట్‌ను అందుకోవడానికి విజయసాయిరెడ్డి చేయాల్సిన గ్రౌండ్ వర్క్.. కేవలం వైసీపీని లేదా కూటమిని విమర్శించడమే మెయిన్ ఎజెండాగా కాకుండా, ఆంధ్రప్రదేశ్‌కు ఒక సరికొత్త విజన్ అందించే పార్టీగా అవతరించాలి. రాష్ట్రానికి ఐటీ, పరిశ్రమలు, 100 శాతం ఉద్యోగ అవకాశాలు, అమరావతి,విశాఖపట్నం వంటి కీలక ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపైన పూర్తి క్లారిటీతో .. స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి.

కూటమి వల్ల సీట్లు, పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న నేతలతో పాటు వైసీపీలో మూలనపడ్డ ద్వితీయ శ్రేణి నాయకులను పీఆర్పీలోకి ఆహ్వానించి.. గ్రామ , మండల స్థాయిలలో కేడర్‌ను బలోపేతం చేసుకోవాలి.

ప్రస్తుతం ఏపీలో పార్టీల పట్ల చాలా నిర్మొహమాటంగా ఉన్న న్యూట్రల్ ఓటర్లతో పాటు యువత (Gen-Z)ఈ కొత్త పార్టీకి చాలా కీలకం. విజయసాయిరెడ్డికి ఉన్న కార్పొరేట్, ఆర్థిక నిపుణుడి ఇమేజ్‌ను పూర్తిగా ఉపయోగించుకుని, అభివృద్ధి నమూనాను నమ్ముకునే వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించాలి.

సోషల్ మీడియా క్యాంపెయిన్, ప్రెస్ మీట్ల వాగ్ధానాలకే పరిమితం కాకుండా, ప్రజల్లోకి డైరెక్టుగా వెళ్లాలి. స్థానిక సమస్యలపై పోరాటాలు చేస్తూ, 2029 నాటికి ప్రతి నియోజకవర్గంలో పటిష్టమైన ఇన్‌ఛార్జ్‌లను రెడీ చేసుకోవాలి.

2029 నాటికి ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయ పార్టీగా నిలబడాలంటే విజయసాయిరెడ్డి(Vijayasai Reddy)..ఈ తక్కువ టైమ్‌లో సాధారణ స్థాయి కంటే పదిరెట్లు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మొత్తంగా వైసీపీ స్థానాన్ని రీప్లేస్ చేస్తారా లేదంటే కేవలం ఓట్లను చీల్చే చిన్న పాత్రకే పరిమితమవుతారా అనేది విజయసాయి రెడ్డి వేసే తొలి అడుగులు , ఆయన వేసే వ్యూహాలపైనే ఆధారపడి ఉంటుంది.

Sonia Gandhi Autobiography : సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్‌లో భావోద్వేగ జ్ఞాపకాలు..విల్లింగ్‌డన్‌ క్రెసెంట్‌ బంగ్లా నుంచి 10 జన్‌పథ్ వరకు..

Related Articles

Back to top button