Gautam Gambhir : గంభీర్ కు అసలు పరీక్ష.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం సవాలే
Gautam Gambhir : రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత జట్టు హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న గౌతమ్ గంభీర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మంచి విజయాలను అందుకున్నా...టెస్ట్ ఫార్మాట్ లో మాత్రం ఘోర పరాజయాలను చవిచూసాడు
Gautam Gambhir
రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత జట్టు హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న గౌతమ్ గంభీర్(Gautam Gambhir) పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మంచి విజయాలను అందుకున్నా…టెస్ట్ ఫార్మాట్ లో మాత్రం ఘోర పరాజయాలను చవిచూసాడు.గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత, భారత్ చరిత్రలో మొదటిసారిగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్‌కు గురైంది.
ఇక ఇటీవలే దక్షిణాఫ్రికా కూడా భారత్‌ను స్వదేశంలో 0-2తో టెస్ట్ సిరీస్‌లో ఓడించింది. విదేశాల్లో సిరీస్ గెలవడం మాట పక్కన పెడితే, టీమిండియా స్వదేశంలో కూడా సిరీస్‌లను కాపాడుకోలేకపోతోంది.
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా కేవలం బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి జట్లపై మాత్రమే టెస్టు విజయాలను అందుకుంది.దీంతో గంభీర్‌ను టెస్ట్ కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ వినిపించింది. ఈ వరుస ఓటములతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఏకంగా ఆరో స్థానానికి పడిపోయింది.
స్వదేశంలో సౌతాఫ్రికా చేతుల్లో క్లీన్ స్వీప్ అయిన భారత జట్టు, ఇంగ్లాండ్ టూర్లో టెస్టు సిరీస్‌ని డ్రా చేసుకుంది. ఈ సీజన్లో 48.15 శాతం విజయాలతో భారత జట్టు పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంటే.. పాకిస్తాన్ 50 శాతం విజయాలతో టాప్ 5లో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా , శ్రీలంక జట్లు వరుస స్థానాల్లో ఉన్నాయి. భారత్ చేతుల్లో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు, ప్రస్తుతం ఏడో పొజిషన్లో ఉంది.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే మిగిలిన 9 టెస్టుల్లో కనీసం 7 మ్యాచులు గెలవాల్సి ఉంటుంది. 2026 ఆగస్టులో శ్రీలంకతో రెండు టెస్టులు ఆడుతుంది. తర్వాత న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా జట్లతో సిరీస్ లు ఉన్నాయి.అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న గంభీర్ డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడమే తర్వాతి టార్గెట్ గా పెట్టుకున్నాడు.

దాని కంటే ముందు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడంపై ఫోకస్ పెట్టినట్టు వెల్లడించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ తో పోలిస్తే టెస్ట్ క్రికెట్ తన హృదయానికి దగ్గరగా ఉంటుందన్నాడు. రెడ్ బాల్ క్రికెట్ లో సాధించిన విజయాలు ప్రత్యేకంగా ఉంటాయన్న గంభీర్ ఒక జట్టు సత్తా తెలిసేది టెస్ట్ ఫార్మాట్ తో మాత్రమేనని చెప్పుకొచ్చాడు.
అయితే గంభీర్(Gautam Gambhir) చెప్పేది జరగాలంటే ముందు భారత్ కీలక సిరీస్ ను గెలవాల్సిందే.భారత జట్టు అక్టోబర్ 2026లో న్యూజిలాండ్‌తో 2 టెస్టులు ఆడనుంది.ఇక 2027 జనవరిలో ఆస్ట్రేలియా, భారత పర్యటనకి రానుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా ఇండియాలో ఐదు టెస్టులు ఆడుతుంది.ఎలా చూసినా మిగిలిన 9 టెస్టుల్లో 7 విజయాలు అందుకోవడం భారత జట్టుకి అంత ఈజీ కాదు. ఒకవేళ ఈ టార్గెట్ కూడా అందుకుంటే మాత్రం కోచ్ గా గంభీర్ కు ఇక తిరుగు లేదు.





