Tamilnadu : తమిళనాడులో గెలిచేదెవరు ?…ఉత్కంఠ రేపుతున్న ప్రీ పోల్ సర్వేలు
Tamilnadu : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రీ పోల్ సర్వేల హడావుడి నడుస్తోంది. నిజానికి తమిళనాడులో ఎప్పుడూ రెండు స్థానిక పార్టీల మధ్యనే పోటీ నడుస్తుంటుంది
Tamilnadu
ఎన్నికల షెడ్యూల్ వచ్చిందంటే చాలు ప్రీ పోల్ సర్వేలపై ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఏ పార్టీ గెలుస్తుంది.. ప్రజలు ఏమనుకుంటున్నారు.. కింగ్ మేకర్ ఎవరు.. ఇలాంటి వాటిపై అటు రాజకీయ పార్టీల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఎక్కడలేని ఉత్కంఠ కనిపిస్తుంది. ఇక పెద్ద రాష్ట్రాల్లో అయితే ప్రజానాడిని పట్టుకోవడం చాలా కష్టం. చాలా సందర్భాల్లో ఈ సర్వేలు బోల్తా కొట్టడం చూశాం.
ప్రస్తుతం తమిళనాడు(Tamilnadu) అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రీ పోల్ సర్వేల హడావుడి నడుస్తోంది. నిజానికి తమిళనాడులో ఎప్పుడూ రెండు స్థానిక పార్టీల మధ్యనే పోటీ నడుస్తుంటుంది. ఈ సారి మాత్రం త్రిముఖ పోటీగా మారింది.
ఇంకా పొత్తుల సంగతి తేలని నేపథ్యంలో డీఎంకే, ఏఐడీఎంకేతో పాటు ఈ సారి నటుడు విజయ్ టీవీకే పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో పోటీ రసవత్తరంగా మారింది. మొన్నటి వరకూ అధికార డీఏంకే పార్టీకి తిరుగులేదన్న అంచనాలు వినిపించాయి. అయితే గత రెండు మూడు నెలలుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చినట్టు చెబుతున్నారు.
తాజాగా విడుదలైన రెండు మూడు ప్రీ పోల్ సర్వేల్లో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. న్యూస్ 18 నిర్వహించిన సర్వేలో అధికార డీఎంకే పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చింది.ప్రభుత్వ పనితీరు బాగుందని 32.8 శాతం మంది చెబితే.. 18.9 శాతం మంది బాగాలేదన్నారు. తమిళనాడులో తర్వాతి ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. స్టాలిన్ ను 41.2 శాతం మంది కోరుకుంటే, పళనిస్వామిని 37.5 శాతం మంది, విజయ్ ను 14.9 శాతం మంది సీఎంగా కోరుకున్నారు.
ఇదిలా ఉంటే మరో సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను సాధించేందుకు డీఎంకే శ్రమిస్తుందని అంచనా వేసారు. డీఎంకే కూటమికి 114 స్థానాల వరకూ రావొచ్చని ఆ సంస్థ అంచనా వేసింది. అన్నాడీఎంకే,బీజేపీ కూటమికి 127 స్థానాలు దక్కే అవకాశముందని వెల్లడించింది.

అయితే విజయ్ టీవీకే పార్టీ 15 శాతం ఓట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అన్నాడీఎంకేకు కాకుండా విజయ్ పార్టీకే పడతాయని భావిస్తున్నారు. దీంతో డీఏంకే చాలా నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో సీట్లు కోల్పోయే పరిస్థితులు ఉంటాయని తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే విజయ్ కింగ్ మేకర్ అవుతారన్న అంచనాలు కొందరు వెల్లడిస్తున్నారు.
ప్రస్తుతం విజయ్ మాత్రం ఒంటరిగానే పోటీ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఎన్డీఏ పెద్దలు విజయ్ ను కలుపుకుని వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఆ పార్టీ నేతలతో చర్చలు కూడా జరిపి కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద తమిళనాడు(Tamilnadu) పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ మరిన్ని సర్వేలు వెలువడే అవకాశముంది.





