Supreme Court :పనిమనిషిని కాదు, ప్రాణసఖిని గౌరవించండి..సుప్రీం మొట్టికాయలతో అయినా భర్తలు మారతారా?
Supreme Court :ఇద్దరూ చదువుకున్న వారు పైగా ఉద్యోగస్తులు అయినా, భార్య వంట చేయడం లేదనే కారణాన్ని క్రూరత్వం కింద చూపిస్తూ భర్త డైవోర్స్ అడగడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
Supreme Court
పెళ్లి అనేది వేరు వేరు కుటుంబాల నుంచి ఇద్దరు వ్యక్తులు కలిసి సాగించే ఒక ప్రయాణం. కానీ మన సొసైటీలో పెళ్లి అనగానే పురుషుడు ఒక యజమానిలా, స్త్రీ ఒక సేవకురాలిలా ఉండాలనే ఫీలింగ్ ఇప్పటికీ ఉండిపోయింది. తాజాగా అత్యుత్తమ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఇప్పటి వరకూ ఉన్న ఇలాంటి ఆలోచనలను మరోసారి చర్చనీయాంశం చేసింది.
భార్య వంట చేయడం లేదని, ఇంటి పనులు సరిగ్గా నిర్వహించడం లేదని డైవోర్స్ కోరడంపై సుప్రీంకోర్టు(Supreme Court) చీవాట్లు వేసింది. భార్య వంట వండటం లేదని, సరిగ్గా ఉండటం లేదని డైవోర్స్ కోరుతూ ఒక భర్త వేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం, మగవారి ఆలోచనా తీరుపై చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
పురుషుడు పెళ్లి చేసుకోవడం అంటే తన ఇంటి పనులు చేయడానికి ఒక పనిమనిషిని కాదు, తన జీవితాన్ని పంచుకోవడానికి ఒక భార్య అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు కాలం మారిపోయిందని, వంట చేయడం, ఇల్లు క్లీన్ చేయడం, బట్టలుతకడం వంటి పనులు కేవలం భార్య బాధ్యత మాత్రమే కాదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ పనుల్లో భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా పాలుపంచుకోవాలని క్లాస్ పీకింది.
అయితే ఈ కేసులో భర్త ఒక ప్రభుత్వ టీచరు కాగా.. భార్య లెక్చరర్. వీరిలో ఇద్దరూ చదువుకున్న వారు పైగా ఉద్యోగస్తులు అయినా, భార్య వంట చేయడం లేదనే కారణాన్ని క్రూరత్వం కింద చూపిస్తూ భర్త డైవోర్స్ అడగడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు భార్య వంట చేయకపోవడం క్రూరత్వమెలా అవుతుందని ప్రశ్నించింది. భార్య కూడా ఉద్యోగం చేస్తూ ఇంటి బాధ్యతలు మోస్తున్నప్పుడు, భర్త కూడా ఇంట్లో సమానంగా పని చేయాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది.
నిజానికి దీనిని సైకాలజీ ప్రకారం చూస్తే ఒక పురుషుడు తన భార్యను కేవలం వంట చేసే మనిషిలాగో, ఇల్లు శుభ్రం చేసే యంత్రంలాగా చూస్తున్నాడంటే, అక్కడ ప్రేమ కంటే ఆధిపత్యమే ఎక్కువగా ఉందని అర్థం అవుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైనప్పుడు, బాధ్యతలు కూడా సమానంగా పంచుకోవాలి.
నిజానికి, మనిషి ఎంత చదువుకున్నా కూడా ఇలాంటి మనస్తత్వం మారకపోవడానికి కారణం పితృస్వామ్య వ్యవస్థలో పెరగడమే. చిన్నప్పటి నుంచి ఇంట్లో తండ్రి ఏ పని చేయకుండా రిలాక్స్ అవడం, తల్లి మాత్రమే పనులన్నీ చేయడం చూసి పెరిగిన అబ్బాయిలు.. తాము పెళ్లి చేసుకున్నాక కూడా భార్య నుంచి కూడా అదే ఆశిస్తారు.

కానీ ఇప్పుడు కాలం మారింది. తనతో పాటు భార్య కూడా సమానంగా సంపాదిస్తోంది, ఇంటా బయట కూడా కుటుంబ బాధ్యతలు మోస్తోంది. అటువంటప్పుడు ఇంటికి రాగానే ఆమె ఒక్కర్తే వంటింట్లోకి వెళ్లాలని కోరుకోవడం ఇంకా వారి ఆధిపత్యధోరణికి నిదర్శనమే. దంపతుల మధ్య మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే ఒకరి శ్రమను ఒకరు గుర్తించకపోతే , ఆ బంధంలో గొడవలు మొదలవుతాయి. నిజానికి ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేయడం వల్ల వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అంతేకాకుండా భార్యను గౌరవించే భర్త ఉన్న ఇంట్లో పిల్లలు కూడా తండ్రి నుంచి అది నేర్చుకుని మంచి సంస్కారంతో పెరుగుతారు.
తాజాగా సుప్రీంకోర్టు(Supreme Court) చేసిన ఇలాంటి వ్యాఖ్యలు కేవలం ఈ ఒక్క కేసుకే పరిమితం కాదన్న విషయాన్ని మగవాళ్లు గుర్తించాలి. ఇంటి పని కేవలం ఆడవారి బాధ్యత మాత్రమే కాదని.., అది ఆ ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుసుకోవాలి. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఉంటాయి.
Mirror Neurons:ఒకరిని చూసి ఒకరం ఎందుకు మారతాం? ఏంటీ మిర్రర్ న్యూరాన్స్?





