Just SpiritualLatest News

Sri Rama Navami : శ్రీరామ నవమి విశిష్టత…ఇలా చేస్తే ఇంట్లో సిరిసంపదలే

Sri Rama Navami : తెలుగువారి పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమున్న పండుగ శ్రీరామ నవమి.

Sri Rama Navami

తెలుగువారి పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమున్న పండుగ శ్రీరామ నవమి(Sri Rama Navami ).. భద్రాచలంలో రాములోరి కళ్యాణం… గ్రామగ్రామాన రాముల వారి ఆలయాల్లో కళ్యాణోత్సవం, శోభాయాత్రలతో ఆధ్యాత్మిక సౌరభం ఉట్టిపడుతుంటుంది. మరి ఇంతటి పవిత్రమైన రోజున ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి.. పూజా విధానం వంటి వివరాలు మీ కోసం…

శ్రీరాముడు సాక్షాత్తూ శ్రీమహా విష్ణువు అవతారం. శ్రీమహావిష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముడు జన్మించిన రోజుగా చైత్ర శుద్ధ నవమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. సీతారాములకు కల్యాణం జరిగిన రోజు కూడా ఇదే కావడం మరింత పవిత్రతను చేకూర్చింది. రావణుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన రోజుగా కూడా దీన్ని భావిస్తారు.

అందుకే శ్రీరామ నవమిని అత్యంత పవిత్రంగా చెబుతారు. ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి(Sri Rama Navami) నాడు ఆయనను భక్తి శ్రద్ధలతో, పూజిస్తే లక్ష్మీదేవి కరుణిస్తుందనేది నమ్మకం. అలాగే రాముని జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శం. ఆయనను భక్తితో స్మరిస్తే జీవితంలో ఉన్నతస్థానానికి మార్గం సుగమం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడిని ఆరాధిస్తే లక్ష్మీకటాక్షం సిద్ధించడం ఒక్కటే కాక ఆరోగ్యం మెరుగుపడడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి , సంతాన యోగం వంటివి తప్పకుండా జరుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.

శ్రీరామ నవమి(Sri Rama Navami ) రోజున తెల్లవారు ఝామునే నిద్ర లేచి, స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి మామిడి తోరణాలతో ఇంటి ప్రధాన ద్వారాన్ని, ఇంటిని అలంకరించుకోవాలి. సీతారాముల విగ్రహాలను లేక పటాలను పూలతో అలంకరించి, భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. ముఖ్యంగా రామాయణంలోని కొన్ని భాగాలను పారాయణం చేస్తే ఎంతో మంచిది. అలాగే ఉపవాసం ఉంటే రెట్టింపు శుభ ఫలితాలు కలుగుతాయి.

శ్రీరాముడు సీతా సమేతంగా కొలువై ఉన్న పట్టాభిషేకం చిత్రపటానికి పూజ చేయడం చాలా మంచిది. ఎందుకుంటే ఆ ఘట్టంలో లక్ష్మణ,భరత, శతృఘ్నులతో పాటు ఆంజనేయుడు, సకల దేవతలు కొలువై ఉంటారు. శ్రీరాముడికి నైవేద్యంగా ఆయనకు ఎంతో ఇష్టమైన వడపప్పు, పానకం, అటుకులను సమర్పించాలి. పూజ అనంతరం ప్రసాదాన్ని స్వీకరించాలి.

Sri Rama Navami 
Sri Rama Navami

శ్రీరామనవమి రోజున సీతారామ కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదా దగ్గరలోని ఆలయానికి వెళ్లి వీక్షించడం అత్యంత పుణ్యాన్ని ఇస్తుంది. కళ్యాణ ఘట్టాన్ని వీక్షించడం ద్వారా శ్రీరాముని అనుగ్రహం, మహావిష్ణువు, మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులవుతారని పండితులు చెబుతున్నారు. అలాగే రోజంతా రామ నామాన్ని జపిస్తూ రామాయణ పారాయణం, విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి.

ఆ రోజున ముఖ్యంగా రామ రక్షా స్తోత్రం చదవడం మంచిది. పేదలకు, సాధువులకు దానధర్మాలు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని కూడా చెబుతున్నారు. దగ్గరలో ఉండే ఆలయాల్లో సాయంత్రం జరిగే భజనవేడుకల్లో భాగమైతే మరింత మంచి జరుగుతుందని నమ్ముతారు.

సాధారణంగా రామ భక్తులు అదే రోజున రామకోటి రాయడం ప్రారంభిస్తారు. ఇక శ్రీరామ నవమి రోజున శ్రీరాముడికి, సీతాదేవికి పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు పువ్వులు సమర్పించడం శుభప్రదం. ఆ రోజు రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలను పారాయణం చేస్తే సాక్షాత్తూ శ్రీరాముడి గుణ గణాలను స్తుతించినట్టవుతుంది.

Ekamukhi Rudraksha : అసలైన ఏకముఖి రుద్రాక్ష ఎలా ఉంటుంది?. నకిలీల గుర్తింపు ఎలా?

Related Articles

Back to top button