Just BusinessJust NationalLatest News

RBI :మధ్యతరగతికి ఆర్బీఐ ఊరట…రెపో రేటు మార్చకపోవడానికి కారణాలివే

RBI : లోన్లు తీసుకుని ఠంచనుగా ఈఎంఐలు కట్టేవారిలో కోట్లాది మంది మధ్యతరగతి ప్రజలు.. దాని కంటే దిగువ ఉన్న వారే.. అలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది

RBI

లోన్లు తీసుకుని ఠంచనుగా ఈఎంఐలు కట్టేవారిలో కోట్లాది మంది మధ్యతరగతి ప్రజలు.. దాని కంటే దిగువ ఉన్న వారే.. అలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI )గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ద్వైమాసిక పరపతి సమీక్షలో ఆర్బీఐ(RBI )కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.

అమెరికా,ఇజ్రాయిల్- ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం భీకర స్థాయిలో నెలకొన్నప్పటికీ, దేశీయంగా రెపో రేటును మార్చకూడదని ఆర్బీఐ(RBI )నిర్ణయించింది. దీని ప్రకారం రెపో రేటు 5.25 శాతం వద్దే ఉండనుంది. ఆర్బీఐ నిర్ణయంతో హోమ్ లోన్, కార్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకున్న వారిపై అదనపు వడ్డీ భారం పడదు.

బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచే అవకాశం లేకపోవడంతో నెలవారీ వాయిదాలు చెల్లించే మొత్తాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. కాగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఆర్బీఐ ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గత ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో కూడా వడ్డీ రేట్లను 5.25 శాతం వద్దే ఉంచిన ఆర్బీఐ, ఈసారి కూడా అదే అనుసరించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరుగుతున్నప్పటికీ, మన దేశ ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని గవర్నర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా విదేశీ మారక నిల్వలు దాదాపు 697.1 బిలియన్ డాలర్ల వద్ద ఉండటం మన దేశ ఆర్థిక బలానికి నిదర్శనమని చెప్పారు. అయితే, యుద్ధ పరిస్థితుల కారణంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, భారత్ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆర్బీఐ అంచనాల ప్రకారం, 2027 ఆర్థిక సంవత్సరంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.9 శాతంగా ఉంటుందని భావిస్తున్నారు. యుద్ధ ప్రభావం కారణంగా ఎగుమతులపై ప్రభావం పడింది. ఈ కారణంగానే ఎగుమతులలో స్వల్ప స్థాయిలో అంటే 0.2 శాతం తగ్గుదల కనిపించినప్పటికీ, రాబోయే త్రైమాసికాల్లో దేశీయ వృద్ధి పుంజుకుంటుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

RBI
RBI

మొదటి రెండు త్రైమాసికాల్లో వృద్ధి కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ, మూడవ మరియు నాలుగవ త్రైమాసికాల్లో అది 7.2 శాతం వరకు చేరుకుంటుందని విశ్లేషించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూనే, సామాన్యుడిపై భారం పడకుండా చూడటమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఈ తరుణంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఉత్సాహం రానుంది. వడ్డీ రేట్లు పెరగకపోవడంతో కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పొచ్చు. అయితే, అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోనందున, రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలపై ఆర్బీఐ నిశితంగా దృష్టి సారిస్తోంది. ఏది ఏమైనా ఆర్థిక సంవత్సరం మొదట్లో, హోమ్ లోన్ కస్టమర్లకు మాత్రం ఈ ఏప్రిల్ నెల మంచి ఊరటనిచ్చింది.

Burps : భోజనం తర్వాత తేన్పులు రావడం సహజమా? లేక అనారోగ్యానికి సంకేతమా?

Related Articles

Back to top button