Just NationalJust PoliticalLatest News

Nitish Kumar : వచ్చే వారమే నితీశ్ రాజీనామా…బీహార్ కొత్త సీఎం ఎవరంటే ?

Nitish Kumar : సుదీర్ఘకాలంగా బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీఎం నితీశ్ కుమార్ ఇక కేంద్రంలో కీలకపాత్ర పోషించబోతున్నారు

Nitish Kumar

సుదీర్ఘకాలంగా బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఇక కేంద్రంలో కీలకపాత్ర పోషించబోతున్నారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన ఆయన శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన నితీశ్ వచ్చే వారం బీహార్ సీఏం పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 14న పాట్నాలో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్న నితీశ్(Nitish Kumar) తన రాజీనామాను ప్రకటించబోతున్నారు.

అయితే నితీశ్ తర్వాత బీహార్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. బీహార్ లో తొలిసారి బీజేపీ నేత సీఏం కాబోతున్నారు. నితీశ్ స్థానాన్ని కాషాయ పార్టీలో కీలక నేతగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి భర్తీ చేస్తారని సమాచారం.

నితీశ్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బీజేపీ పెద్దల సమావేశానికి హాజరవుతారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు బీహార్ కు చెందిన పలువురు ముఖ్యనేతలు ఈ మీటింగ్ లో పాల్గొంటారు. ఇక్కడే బీహార్ కొత్త సీఎం పేరు అధికారికంగా నిర్ణయించి ప్రకటించబోతున్నారు.

Nitish Kumar
Nitish Kumar

ప్రస్తుతం బీహార్ బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం సామ్రాట్ చౌదరితో పాటు మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో సామ్రాట్ చౌదరి రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకున్నా దాదాపుగా ఆయన పేరే ఖరారైనట్టు సమాచారం.

సామ్రాట్ చౌదరి సీఎం అయితే తమ సపోర్ట్ ఉంటుందని ఇప్పటికే జనశక్తి జనతా దళ్‌ (జేజేడీ) చీఫ్‌ తేజ్ ప్రతాప్ యాదవ్ స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీలో జరిగే బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో సామ్రాట్ చౌదరి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బీహార్ సీఎంగా బీజేపీ నేత బాధ్యతలు చేపట్టనుండడం ఇదే తొలిసారి. కాగా 243 సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో 89 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటు జేడీయూ 85 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బీహార్ లో 202 సీట్లతో ఘనవిజయాన్ని అందుకుంది.

David Miller : సింగిల్ తీయని మిల్లర్…మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా ?

Related Articles

Back to top button