Mangli : డబ్బు ఇవ్వనందుకే నాపై ఆరోపణలు…మైక్రోఫైనాన్స్ స్కాంతో సంబంధం లేదన్న మంగ్లీ
Mangli : ప్రముఖ సింగర్ మంగ్లీ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు
Mangli
ప్రముఖ సింగర్ మంగ్లీ(Mangli) తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. దాదాపు 150 మంది నుంచి డబ్బులు వసూలు చేసారన్న అంశంలో నిలదీసినందుకు తనను చంపేస్తానని బెదిరించారంటూ మంగ్లీపై న్యాయవాది సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగ్లీతో పాటు ఆమె సోదరుడిపై క్రిమినల్ కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో గత రెండురోజులుగా మంగ్లీ(Mangli) హాట్ టాపిక్ అయ్యారు. గతంలోనూ పలు వివాదాలు తలెత్తడంతో తాజా కేసుకు సంబంధించి పలు రకాల వార్తలు షికారు చేశాయి. దీంతో స్పందించిన మంగ్లీ తన లాయర్ తో కలిసి పంజాగుట్ట పోలీసులకు న్యాయవాది సుబ్బారావుపై ఫిర్యాదు చేశారు.
తనను డబ్బులు డిమాండ్ చేసాడని, ఇవ్వనందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సుబ్బారావుపై మంగ్లీ మండిపడ్డారు. కేవలం ఫేమ్ అవ్వడం కోసమే తనపై ఆయన కేసు పెట్టారని చెప్పారు. బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిలో భాగంగానే తనపై తప్పుడు ఆరోపణలు చేసి ఫేమ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారన్నారు.
తనపై దుష్ప్రచారం చేస్తున్న సుబ్బు పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. 10 లక్షలు డిమాండ్ చేస్తే..ఇవ్వలేదనే అక్కసుతో మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సుబ్బారావు ఫిర్యాదు చేయగా. కేసు నమోదైంది.
మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ రూ.10 కోట్లు మోసం చేసారని, బాధితులను, తనను బెదిరిస్తున్నారంటూ సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె సోదరుడు యాక్సిడెంట్ చేసి తనను చంపేస్తానని బెదిరించారని , రక్షణ కల్పించాలని కోరుతూ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఆరోపణలపై స్పందించిన మంగ్లీ నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనూ, ఇవాళ పంజాగుట్ట పీఎస్ లోనూ ఫిర్యాదు చేశారు.

తనకు డబ్బు ముఖ్యంకాదనీ, వ్యక్తిత్వమే ముఖ్యమని మంగ్లీ చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో రాజకీయాల్లో ప్రచారం చేయాలని పలు పార్టీలు కోట్లాది రూపాయలు ఆఫర్ చేసినా తాను వెళ్లలేదన్నారు. ఎవరినో చూపించి తన తమ్ముడని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ కేసులో తన ప్రమేయం ఉందని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు.
మైక్రో ఫైనాన్స్ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనతో ఎంతో మంది ఫోటోలు దిగుతారని వారంతా తనకు చెందిన వారిగా ఎలా చెబుతారన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాను పోరాడతానన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటానని మంగ్లీ చెప్పారు.
Iran – America : ఇరాన్, అమెరికా చర్చలు విఫలం…మళ్ళీ యుద్ధం తప్పదా ?





