Fatty Liver: ఫ్యాటీ లివర్‌లో ఎన్ని స్టేజ్‌లు ఉంటాయి ? ఏ దశలో ఏ లక్షణాలుంటాయి?
Fatty Liver :మూడో దశలో కాలేయం తన సహజమైన మెత్తదనాన్ని కోల్పోయి గట్టిపడటం స్టార్టవుతుంది. విపరీతమైన నీరసం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Fatty Liver
ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య. కాలేయంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ శాతం కొవ్వు పేరుకుపోవడాన్నే ఫ్యాటీ లివర్(Fatty Liver) అంటారు. సరైన సమయంలో గుర్తిస్తే దీనిని పూర్తిగా నయం చేసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్(Fatty Liver )సమస్య ఒకేసారి ఎప్పుడూ తీవ్రం కాదు, ఇది నాలుగు మెయిన్ స్టేజ్లలో మారుతూ వస్తుంది. మొదటి స్టేజ్‌లో కేవలం కాలేయ కణాల చుట్టూ ఫ్యాట్ చేరుతుంది, దీనిని స్టెటోసిస్ అంటారు. ఈ దశలో పెద్దగా లక్షణాలేమీ కనిపించవు, కానీ లోపల మాత్రం కాలేయం బరువు పెరుగుతూ ఉంటుంది.
రెండవ స్టేజ్‌ను నాన్-ఆల్కహాలిక్ స్టెటో హెపటైటిస్ (NASH) అంటారు. ఇక్కడ ఫ్యాట్ పేరుకుపోవడమే కాకుండా లివర్‌లో వాపు (Inflammation) కూడా మొదలవుతుంది. దీనివల్ల కడుపులో కుడి వైపు పైభాగంలో చిన్నపాటి నొప్పి లేదా అసౌకర్యం కలిగినట్లు అన్పిస్తూ ఉంటుంది.
మూడో స్టేజ్‌ను ఫైబ్రోసిస్ అంటారు. లివర్‌లోని వాపు వల్ల అక్కడ మచ్చలు (Scar tissue) ఏర్పడతాయి. మూడో దశలో కాలేయం తన సహజమైన మెత్తదనాన్ని కోల్పోయి గట్టిపడటం స్టార్టవుతుంది. ఈ దశలో విపరీతమైన నీరసం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇక చివరిది , నాల్గవ స్టేజ్ సిర్రోసిస్ అత్యంత ప్రమాదకరమైనది. ఇక్కడ లివర్ తీవ్రంగా దెబ్బతిని తన పనితీరును కోల్పోతుంది. చర్మంతో పాటు కళ్లు కూడా పసుపు రంగులోకి మారడం (కామెర్లు), కడుపులో నీరు చేరడం, కాళ్ల వాపులు వంటి తీవ్రమైన లక్షణాలు ఈ దశలో కనిపిస్తుంటాయి.
ఫ్యాటీ లివర్ రావడానికి మెయిన్ రీజన్ మన లైఫ్ స్టైల్ అలాగే ఆహారపు అలవాట్లు కూడా అని డాక్టర్లు చెబుతున్నారు. ఎక్కువ సేపు కూర్చుని చేసే జాబ్‌ల వల్ల ఈ వ్యాధిన పడేవారి సంఖ్య పెరుగుతుంది. అలాగే అధిక బరువు (Obesity), ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉండటం దీనికి మెయిన్ రీజన్‌గా ఉంటుందట. అలాగే టైప్-2 డయాబెటిస్ (Diabetes), రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల కాలేయం కొవ్వును ప్రాసెస్ చేయలేక స్టాక్ ఉంచుకుంటుంది.
అయితే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చేది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అయితే,ఆల్కహాల్ అలవాటు లేకపోయినా స్వీట్స్, వైట్ కలర్ ఆహారాలు అంటే రైస్, మైదా, షుగర్ వంటివి ఎక్కువగా తీసుకోవడంతో పాటు మారిన లైఫ్ స్టైల్ వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వస్తుంది .
ఇది రివర్సబుల్ నా అంటే మళ్లీ మామూలుగా మారుతుందా? అన్న ప్రశ్నకు అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య మొదటి మూడు దశల్లో ఉన్నప్పుడు కచ్చితంగా ఇది రివర్సబుల్ అంటున్నారు డాక్టర్లు.
అంటే దీని గురించి మనం మొదటిలోనే సరైన జాగ్రత్తలు తీసుకుంటే కాలేయం తిరిగి ఆరోగ్యకరంగా తన పూర్వ స్థితికి చేరుకుంటుంది. ఎందుకంటే కాలేయానికి తనను తాను స్వయంగా బాగుచేసుకునే (Regenerative) పవర్ ఉంటుంది.
అయితే సిర్రోసిస్ అనే నాలుగో దశకు చేరుకున్నాక దానిని పూర్తిగా నయం చేయడం కష్టం, కేవలం మరింత దెబ్బతినకుండా జాగ్రత్తలు మాత్రమే తీసుకోగలం. కాబట్టి ప్రారంభ దశలోనే ఆహార నియమాలు పాటించడం చాలా చాలా ఇంపార్టెంట్.
లివర్‌ను క్లీన్ చేయడంలో ఆకుకూరలు , కూరగాయలు బాగా పని చేస్తాయి. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ వాపును బాగా తగ్గిస్తాయి. ఓట్స్, తృణధాన్యాలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. యాపిల్ కూడా ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుంది.
చేపలు (ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం), వాల్నట్స్, బాదం వంటి నట్స్ కూడా తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల లివర్ చుట్టూ ఉన్న కొవ్వు త్వరగా కరుగుతుంది. గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ తాగడం వల్ల కూడా కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.

చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, సోడాలు , స్వీట్లకు పూర్తి దూరంగా ఉండాలి. మైదాతో చేసిన బ్రెడ్, పిజ్జా, పాస్తా వంటి వైట్ ఫుడ్స్ కాలేయానికి మొదటి శత్రువులు. ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, పకోడా వంటి వేయించిన స్నాక్ ఐటెమ్‌తో పాటు ప్రాసెస్ చేసిన మాంసాన్ని పూర్తిగా మానేయాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.ఆల్కహాల్ అలవాటు ఉంటే దానిని వెంటనే ఆపేయాలి. ఎందుకంటే అది కాలేయాన్ని చాలా వేగంగా దెబ్బతీస్తుంది.
ప్రతిరోజూ కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు ఎక్సర్సైజులు చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా ఫ్యాటీ లివర్ ప్రాబ్లెమ్‌ను ఈజీగా జయించవచ్చు.
Mrunal Thakur : తెలుగింటి కోడలు అయిపో…మృణాల్ ను దీవించిన అల్లు అరవింద్





