KKR vs RR : కోల్ ”ఖాతా” తెరిచేనా ?..రాజస్థాన్ తో డూ ఆర్ డై
KKR vs RR : ఐపీఎల్ 19వ సీజన్ మొదలై మూడు వారాలు దాటింది. కోల్ కతా నైట్ రైడర్స్ తప్ప మిగిలిన అన్ని జట్లు విజయాన్ని రుచి చూసాయి.
KKR vs RR
ఐపీఎల్ 19వ సీజన్ మొదలై మూడు వారాలు దాటింది. కోల్ కతా నైట్ రైడర్స్ తప్ప మిగిలిన అన్ని జట్లు విజయాన్ని రుచి చూసాయి. కేకేఆర్ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. వర్షంతో ఒక మ్యాచ్ రద్దవడంతో పాయింట్ల ఖాతా తెరిచినా గెలుపు ఖాతా మాత్రం తెరవలేకపోయింది.
ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడిన కోల్ కతా నాలుగింటిలో పరాజయం పాలై పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. ఈ సీజన్ లోనూ అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కోల్ కతాకు(KKR vs RR)ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఎందుకంటే వరుస పరాజయాలతో డీలా పడిన కేకేఆర్ ప్లే ఆఫ్ కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ లలో గెలవాల్సిందే.
కనీసం 7 మ్యాచ్ లు గెలిచినా రేసులో ఉంటారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎక్కడా కూడా స్థాయికి తగినట్టు ఆడలేకపోతోంది. రహానే, సిఫెర్ట్ ఓపెనర్లుగా వస్తున్నా సరైన ఆరంభాన్నివ్వలేకపోతున్నారు. రఘువంశీ ఇప్పటి వరకూ మెరుపులు మెరిపించింది లేదు. రూ.25 కోట్ల ప్లేయర్ కామెరూన్ గ్రీన్ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. పావెల్ కూడా రాణిస్తున్నా.. రింకూ సింగ్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు.
లోయర్ ఆర్డర్ లో రమణ్ దీప్ సింగ్ సైతం ఫెయిలవుతుండడం కూడా ఇబ్బందిగా మారింది. బ్యాటర్లు గాడిన పడితే తప్ప కోల్ కతాకు విజయం కష్టమే. అటు బౌలింగ్ లోనూ ఇంకా కుదురుకోలేదు.
వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ లాంటి యంగ్ బౌలర్లున్నా మ్యాచ్ ను గెలిపించే స్పెల్స్ వేయలేకపోతున్నారు. స్పిన్నర్ సునీల్ నరైన్ తో పాటు వరుణ్ చక్రవర్తి ప్రభావం చూపించలేకపోతున్నారు. వరుణ్ చక్రవర్తి అయితే వికెట్లు తీయడమే మరిచిపోయినట్టుగా కనిపిస్తోంది. హోంగ్రౌండ్ లో ఎంతవరకూ కోల్ కతా మెరుగైన ప్రదర్శన చేస్తుందనేది చూడాలి.

పతిరణ జట్టుతో చేరనుండడం ఆ జట్టుకు ఊరటగా చెప్పొచ్చు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కాన్ఫిడెంట్ గా ఉంది. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయినా సరే బ్యాటింగ్ పరంగా ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ తో పాటు జురెల్, ఫెరీరా, జడేజా ఫామ్ లో ఉన్నారు. అటు బౌలింగ్ లో ఆర్చర్ అదరగొడుతున్నాడు.
అతనితో పాటు బర్గర్, సందీప్ శర్మ రాణిస్తున్నారు. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్ రాజస్థాన్ మ్యాచ్ విన్నర్ గా ఉన్నాడు. గత రికార్డులను చూస్తే రాజస్థాన్ పై కోల్ కతాదే పైచేయిగా ఉంది. 31 మ్యాచ్ లలో 16 సార్లు కేకేఆర్, 12 సార్లు రాజస్థాన్ గెలిచాయి. అటు ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్ కు కాస్త అనుకూలించినా మ్యాచ్ సాగేకొద్దీ బ్యాటర్లకు సహకరిస్తుంది.
Zombie Reddy :మన దేశంలోనూ జాంబీ రెడ్డి సీన్లు ఎందుకు? ఈ వింత ప్రవర్తనలు ఆగవా ?





