Phone : రాత్రి నిద్రను చంపుకుని మరీ ఫోన్ చూస్తున్నారా? మీ మెదడు చేసే జిమ్మిక్కులో పడకండి..
Phone : గంటల తరబడి సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూనో, వెబ్ సిరీస్‌లు చూస్తూనో అర్థరాత్రి వరకు నిద్రకు దూరంగానే ఉంటున్నారు.
Phone
రోజంతా ఆఫీసు పనులతో సతమతమవుతూ.. ఇంట్లో బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ జీవితాలను వెళ్లదీస్తున్నారు. తీరా రాత్రి పక్క మీదకు చేరాక కళ్లు నిద్రతో భారంగా మారుతున్నా సరే.. మొండిగా ఫోన్‌ను మాత్రం వదలలేకుండా చూస్తుంటారు. గంటల తరబడి సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూనో, వెబ్ సిరీస్‌లు చూస్తూనో అర్థరాత్రి వరకు నిద్రకు దూరంగానే ఉంటున్నారు.
దీనిని సైకాలజీలో రివెంజ్ బెడ్‌టైమ్ ప్రోక్రాస్టినేషన్’ (Revenge Bedtime Procrastination) అని పిలుస్తారని సైకాలజిస్టులు చెబుతున్నారు. పేరు వినడానికి వింతగా ఉన్నా, ఇది మనపై మనం తీసుకుంటున్న ఒక రకమైన ప్రతీకారమని వారు వివరిస్తున్నారు..
ఈ పరిస్థితి వెనుకున్న మెయిన్ రీజన్ స్వయం నియంత్రణ లేదా సెల్ఫ్ కంట్రోల్ కోల్పోవడం అని మానసిక నిపుణులు అంటున్నారు. పగటిపూట మన సమయం ఎపుడూ మన చేతుల్లో ఉండదన్న విషయం తెలిసిందే. ఆఫీస్ పనులు, కుటుంబ అవసరాలు, ఇతరుల కోసం మనం కేటాయించే సమయం వల్ల మనకు నచ్చినట్లుండే స్వేచ్ఛ ఎవరికీ దొరకదు.
మనం గడిపిన రోజు మన కంట్రోల్‌లో లేదని మెదడు భావించినప్పుడు, ఆ కోల్పోయిన ఆ స్వేచ్ఛను రాత్రిపూట పొందాలని ప్రయత్నిస్తుందట. అంటే, రోజంతా మనపై పడ్డ పనులు, టైమ్ లేకపోవడం వంటి వాటితో కలిగే ఒత్తిడికి ప్రతీకారంగా (Revenge), రాత్రి నిద్రను త్యాగం చేసి మరీ ఆ సమయాన్ని తనకు నచ్చిన పనుల కోసం దొంగిలించేలా మన మెదడు ప్రేరేపిస్తుంది.
ఎందుకంటే మెదడు ఈ సమయంలో ఒక రకమైన భ్రమలో ఉండిపోతుంది. ఒకవేళ నిద్రపోతే మళ్లీ రేపు పొద్దునే నిద్రలేచి పాత బాధ్యతల్లోకి వెళ్లిపోవాలనే భయం మనకు తెలియకుండానే నిద్రకు దూరం చేస్తుంది. ఫోన్ చూడటం వల్ల లభించే టెంపరరీ ‘డోపమైన్’ రిలీజ్ అవడంతో మనకు ఆ క్షణంలో అంతులేని సంతోషాన్ని ఇస్తుంది.
అయితే అది దీర్ఘకాలంలో మానసిక అలసటను పెంచుతుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పగటిపూట తమ జీవితంపై తక్కువ కంట్రోల్ ఉన్నవారిలో ఈ ప్రవృత్తి చాలా ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఈ అలవాటు ..ఆరోగ్యం దెబ్బతినేలా చేయడమే కాకుండా, మర్నాడు పనిపైన ఏకాగ్రత తగ్గేలా చేస్తుంది. ఇది ఒక విషవలయంలా ఒక డేంజరస్ రొటీన్ చక్రంలా మారిపోతుంది. రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల పగలు ఒత్తిడి పెరుగుతుంది, ఆ ఒత్తిడి వల్ల మన మెదడు మళ్లీ రాత్రి రివెంజ్ తీర్చుకోవాలనిపించేలా మనల్ని ప్రేరేపిస్తుంది.
దీనిని ఓవర్ కమ్ చేయాలంటే పగటిపూట కనీసం కొంత సమయం అయినా సరే మనకు నచ్చిన పనుల కోసం కేటాయించాలి. రాత్రి పడుకునే ముందు ఒక నిర్ణీత సమయానికి ఫోన్‌ను దూరంగా ఉంచే అలవాటును స్ట్రిక్టుగా అమలు చేయాలి. మన సమయంపై మనకు పట్టు ఉన్నప్పుడే ఈ ప్రతీకార నిద్రలేమి నుంచి బయటపడగలం అని మానసిక నిపుణులు సూచిస్తున్నారు .
HCA T20 League : హెచ్ సీ ఎ టీజీ20 లీగ్ ఆవిష్కరణ..అత్యుత్తమ ఆటగాళ్లు వెలుగులోకి వస్తారన్న రాయుడు





