Just NationalLatest News

Deependra Singh :విధిని ఎదిరించిన విక్రమార్కుడు దీపేంద్ర సింగ్..ఓ సైనికుడి గెలుపు పిలుపు

Deependra Singh : ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో పెరిగిన దీపేంద్ర సింగ్, సైనిక్ స్కూల్ రీవాలో చదువుకున్నారు.

Deependra Singh

భారతదేశ గడ్డపై పుట్టిన ఎందరో వీరుల కథలు చాలామందికి తెలియవు. అలాంటి వారిలో మేజర్ దీపేంద్ర సింగ్ సెంగార్ ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో పెరిగిన దీపేంద్ర సింగ్, సైనిక్ స్కూల్ రీవాలో చదువుకున్నారు. ఆ తర్వాత 1991లో భారత సైన్యంలోని పారాచూట్ రెజిమెంట్ స్పెషల్ ఫోర్సెస్ లో చేరారు.

దీపేంద్ర సింగ్ (Deependra Singh) వేగాన్ని చూసి తోటి సైనికులు రాకెట్ అని ప్రేమగా పిలిచేవారు. 1998లో గువహటిలో జరిగిన ఒక ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సమయంలో రెండు బుల్లెట్లు దీపేంద్ర సింగ్ పొట్టలోకి దూసుకుపోయాయి. కోలుకోవడానికి రెండేళ్లు పైనే పడుతుందని డాక్టర్లు చెప్పినా, తన పట్టుదలతో మొండిగా కేవలం ఏడాదిలోపే మళ్లీ విధుల్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇక్కడే అతని గురించి చిన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దీపేంద్ర సింగ్ (Deependra Singh) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో .. ఎవరికీ తెలియకుండా బయటకు రావడమే కాదు.. తన స్నేహితుడి పెళ్లి కోసం ఐదు గంటల ప్రయాణం చేశారు. దీనిని బట్టే ఆయన మనోధైర్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

కార్గిల్ యుద్ధం మొదలవ్వగానే గాయాలను కూడా లెక్కచేయకుండానే, మళ్లీ యుద్ధరంగంలోకి వెళ్లారు. ఆ యుద్ధంలోనే భారత సైన్యం స్వాధీనం చేసుకున్న అత్యధిక ఎత్తైన నీలం పోస్ట్‌ను తన టీమ్‌తో కలిసి జయించి చరిత్రను సృష్టించారు.

అయితే 1999లో జరిగిన మరో యుద్ధంలో ఒక తుపాకీ గుళ్ల వర్షం దీపేంద్ర సింగ్(Deependra Singh )తుంటి ఎముకను పూర్తిగా ఛిద్రం చేసేసింది. ఆ సమయంలో ఇక ఆయన బతకడమే కష్టమని, బతికినా ఎప్పటికీ నడవలేరని వైద్యులు తేల్చి చెప్పేశారు.

కానీ దీపేంద్ర సింగ్ సెంగార్ తన ఓటమిని మాత్రం ఒప్పుకోలేదు. ఆసుపత్రి బెడ్‌పై కదలలేని స్థితిలో ఉంటూ కూడా రోజుకు ఎనిమిది గంటల పాటు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేవారు. ఒక నర్సింగ్ అసిస్టెంట్ కొడుకు సహాయంతో లెక్కలు నేర్చుకుంటూ, 6 నెలల తర్వాత స్టిక్ సహాయంతో క్యాట్ (CAT) ఎగ్జామ్ రాశారు.

Deependra Singh
Deependra Singh

చివరకు దీపేంద్ర సింగ్ పట్టుదలకు ఫలితం దక్కినట్లు అయింది. దేశంలోని అగ్రశ్రేణి మేనేజ్మెంట్ కంపెనీల నుంచి పిలుపు రాగా, అలా ఐఐఎం అహ్మదాబాద్‌లో చేరారు. స్టిక్ సాయంతోనే ప్రతి క్లాసుకు హాజరై, టోక్యోలోని ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్ షిప్ చేసి అత్యుత్తమ మార్కులతో డిగ్రీ పొందారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల్లో ఉన్నత పదవులను చేపట్టారు.

ఎప్పటికీ నడవలేవన్న డాక్టర్లు చెప్పిన మాటలను.. పదేళ్ల తర్వాత తన నడకతోనే అది తప్పు అని నిరూపించిన దీపేంద్ర సింగ్ అందరితో శభాష్ అనిపించుకున్నారు. తన కెరీర్‌లో ఏకంగా 12 మెడల్స్ అందుకున్నారు.

సాధ్యం కాదన్న ప్రతి మాటను సుసాధ్యం చేసి చూపించిన మేజర్ సెంగార్ నిజమైన భారతరత్నం అనిపించుకున్నారు. అందుకే ఇలా ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన ఈ వీరుడి జీవిత కథ ఆధారంగా జీత్ కీ జిద్ అనే వెబ్ సిరీస్ కూడా వచ్చింది.

Birthday : వయసు పెరగడమంటే వెనకబడటం కాదు.. అనుభవాల మూటతో అంతరంగాన్ని గెలుచుకోవడం

Related Articles

Back to top button