HILT Policy:హిల్ట్ పాలసీపై రాజుకున్న రాజకీయ రచ్చ.. ప్రతిపక్షాల ఆరోపణల నడుమే గైడ్‌లైన్స్ విడుదల
HILT Policy: భూముల మార్పిడి విధానం వెనుక చాలా పెద్ద కుంభకోణం దాగి ఉందంటూ ప్రతిపక్ష పార్టీలు.. బీఆర్ఎస్, బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి.
HILT Policy
భాగ్యనగర భవిష్యత్తును, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా మార్చేసే కొత్త విధానానికి తెలంగాణ సర్కార్ అధికారికంగా తెరలేపింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ( HILT Policy) అమలుకు సంబంధించిన.. పూర్తి విధివిధానాలను గవర్నమెంట్ ఆన్లైన్లో రిలీజ్ చేసింది.
ఈ సరికొత్త హిల్ట్ పాలసీ (HILT Policy)ద్వారా ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో విస్తరించి ఉన్న దాదపు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను ఇకపై మల్టీ-యూజ్ జోన్లుగా మార్చుకోవడానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నిజానికి ఐదు దశాబ్దాలుగా హైదరాబాద్ ఊహించని వేగంతో పెరిగిపోయింది. ఒకప్పుడు సిటీ బయట ఏకాంతంగా నిర్మాణాలు కొనసాగించిన బాలానగర్, సనత్‌నగర్, ఉప్పల్, జీడిమెట్ల, మల్లాపూర్ వంటి ఇండస్ట్రియల్ ఏరియాలు.. ఇప్పుడు జనసమ్మర్దమైన నివాస స్థలాలుగా మారిపోయాయి.
ఫ్యాక్టరీల పక్కనే అపార్ట్మెంట్లు, ఇళ్లు కట్టుకోవడం ప్రారంభించాక.. అక్కడి ప్రజలు తీవ్రమైన కాలుష్యం బారిన పడుతున్నారు. ఈ సమస్యకు ఒక పర్మినెంట్ పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతోనే, ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను సిటీ బయటకు పంపించి, అక్కడి స్థలాలను ప్రజలకు ఉపయోగపడేలా మార్చడమే ఈ కొత్త విధానం వెనుక ఉన్న అసలు లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది.
ఈ విధానం ప్రకారం చూస్తే పాత ఇండస్ట్రియల్ ల్యాండ్స్‌కు మల్టీ-యూజ్ హోదా లభించనుంది. దీనివల్ల ఆ స్థలాల్లో కేవలం ఫ్యాక్టరీలు మాత్రమే కాకుండా.. పెద్ద పెద్ద ఐటీ పార్కులు, అపార్ట్మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద ఆసుపత్రులు, అంతర్జాతీయ విద్యాసంస్థలను నిర్మించుకునే అవకాశం యజమానులకు లభిస్తుంది.
నగర పరిధి నుంచి తమ పరిశ్రమలను షిప్ట్ చేసే యజమానులకు.. నష్టపరిహారంగా ఓఆర్ఆర్ బయట ప్రత్యామ్నాయ భూములను ప్రభుత్వం ఇవ్వబోతోంది. దీనిపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు యజమానులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. త్వరలోనే ప్రజల నుంచి, వివిధ రంగాల నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

అయితే ఈ హిల్ట్ పాలసీ ప్రకటనతో తెలంగాణ పాలిటిక్స్‌లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ఈ భూముల మార్పిడి విధానం వెనుక చాలా పెద్ద కుంభకోణం దాగి ఉందంటూ ప్రతిపక్ష పార్టీలు.. బీఆర్ఎస్, బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇప్పటికే పారిశ్రామిక వాడల్లో పర్యటించి, ఈ ల్యాండ్ కన్వర్షన్‌కు తాము ఒప్పుకునేది లేదని చెబుతున్నారు.
అయినా సరే ప్రతిపక్షాల విమర్శలను పక్కనబెట్టి మరీ తెలంగాణ ప్రభుత్వం ఈ విధివిధానాలను సైలెంట్‌గా రిలీజ్ చేయడం మరోసారి హాట్ టాపిక్ అయింది. మొత్తానికి హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి సిటీగా మార్చే క్రమంలో ఈ హిల్ట్ పాలసీ చాలా కీలకమైనదిగా మారుతున్నా కూడా, రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.
Temple :గుడిలో గర్భగుడి వెనుక భాగాన్ని ముట్టుకోకూడదా? ఆలయ ఆవరణలో కాసేపైనా కూర్చోవాలా?





