Karnataka : కర్ణాటకలో మళ్లీ మొదలైన సీఎం సీటు లొల్లి..ఢిల్లీకి సిద్ధరామయ్య ..డీకేకు అందని ఆహ్వానం
Karnataka : అధిష్ఠానం పిలిస్తేనే తానిప్పుడు ఢిల్లీ వెళ్తున్నానని, కానీ అక్కడ చర్చించే అంశాలేంటో తనకు ముందుగా తెలియదని సిద్ధరామయ్య మీడియాకు వివరించారు.
Karnataka
కర్ణాటక రాజకీయాల్లో మళ్లీ ముసలం పుట్టింది. ఎప్పటినుంచో నలుగుతున్న కర్ణాటక సీఎం మార్పు వ్యవహారం కాస్తా ఇప్పుడు మరోసారి గట్టిగానే తెరపైకి వచ్చింది. తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో, ఇప్పుడు కర్ణాటక అంతర్గత విబేధాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి అత్యవసర పిలుపు రావడంతో ఆయన తన అనుచరులు, కేబినెట్ సహచరులను వెంటబెట్టుకుని ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ మార్పు తప్పదనే ప్రచారం స్పీడందుకుంది.
ఈ పర్యటనపై స్పందించిన సిద్ధరామయ్య .. అధిష్ఠానం పిలిస్తేనే తానిప్పుడు ఢిల్లీ వెళ్తున్నానని, కానీ అక్కడ చర్చించే అంశాలేంటో తనకు ముందుగా తెలియదని మీడియాకు వివరించారు. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు తమ సమావేశం ఉందని, రాజకీయాల్లో ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమేనని సిద్ధరామయ్య అన్నారు.
అయితే మరోవైపు ఈ ఢిల్లీ భేటీకి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మాత్రం ఎలాంటి పిలుపు అందకపోవడం హాట్ టాపిక్ అయింది. దీనిపై డీకే శివకుమార్ మాట్లాడుతూ.. హైకమాండ్ పిలిస్తేనే తాను హస్తినకు వెళ్తానని, కానీ దీనికి ముందు సీఎం మార్పు గురించి మాట్లాడటం తన పని కాదని దాటవేశారు. కాగా, కర్ణాటకకు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును ఈ ఏడాది జనవరిలోనే సిద్ధరామయ్య సొంతం చేసుకున్నారు.
నిజానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య అధికార పోరు ఇప్పటిది కాదు. కర్ణాటక(Karnataka)లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని 2025 నవంబరులోనే వీరిద్దరి మధ్య ఉన్న రచ్చ మొదటిసారి బయటపడింది.

అప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఒప్పందం ప్రకారం.. చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని మొదటి విడత సిద్ధరామయ్యకు అవకాశమిచ్చారు కాబట్టి ఇప్పుడు పదవిని డీకే శివకుమార్‌కు అప్పగించాలని అతని వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. నవంబరులో ఈ సంక్షోభం తలెత్తినప్పుడు అధిష్ఠానం ఇద్దరితో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లు పెట్టి టెంపరరీగా సర్దుబాటు చేసింది.
అయితే గురువారం నాయకత్వ మార్పు గురించి మీడియా ప్రశ్నించినప్పుడు, డీకే శివకుమార్ నర్మగర్భంగా స్పందిస్తూ త్వరలోనే మంచి రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. మే నెలాఖరులో జరిగే హైకమాండ్ సమావేశంలో కర్ణాటక కాంగ్రెస్‌లోని సమస్యలన్నింటికీ ఒక ముగింపు దొరికే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటన తర్వాత కర్ణాటక(Karnataka ) రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.
DWACRA :డ్వాక్రా మహిళలు ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.. గ్యారెంటీ లేకుండానే రూ.10 లక్షల వరకు లోన్





