Trust Issues :ఎదుటివారు మంచివారే కానీ నమ్మలేని స్థితి.. ఇలాంటి ట్రస్ట్ ఇష్యూస్ వల్ల జరిగేదేంటి?
Trust Issues : ఒకప్పుడు తన జీవితంలో అందరినీ ఏమాత్రం ఆలోచించకుండా నమ్మిన వ్యక్తి.. రాను రాను ఎవరినీ నమ్మలేని పరిస్థితికి చేరుకుంటాడు.
Trust Issues
మనుషుల మనస్తత్వాలు కొన్నిసార్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక వ్యక్తి మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారని తెలిసినా కూడా.. మనసులో ఏదో తెలీని అనుమానం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు తనతో బాగానే ఉన్నారు కానీ, రేపు వీరు కూడా తనను వదిలేసి వెళ్లిపోతారనే భయం ఎప్పుడూ వెంటాడుతుంది.
తమ పార్టనర్ ఏ తప్పూ చేయకపోయినా సరే..చిన్న చిన్న విషయాలకీ అనుమానించే ఈ అలవాటును సైకాలజీలో ట్రస్ట్ ఇష్యూస్ ఆర్ బిట్రాయల్ ట్రామా అంటారు. ఈ లోకంలో ఎవరూ కూడా పుట్టడమే అనుమానపు బుద్ధితో పుట్టరు.
ఒకప్పుడు తన జీవితంలో అందరినీ ఏమాత్రం ఆలోచించకుండా నమ్మిన ఈ వ్యక్తే.. రాను రాను ఎవరినీ నమ్మలేని పరిస్థితికి చేరుకుంటాడు. దీనికి అసలు కారణం గతంలో వారు బాగా నమ్మిన వ్యక్తి నుంచి ఎదురైన పెద్ద మోసమే.
నిజానికి ఎప్పుడైనా సరే మనకు బాగా నచ్చిన వాళ్లు, మన జీవితమనుకున్న వాళ్లు మనల్ని నట్టేట ముంచినప్పుడు మన మనసుకు చాలా గట్టి దెబ్బే తగులుతుంది. ఆ సమయంలో మనం అనుభవించే బాధ ఎప్పటికీ మానని గాయంలా మిగిలిపోతుంది.
ఆ చేదు అనుభవం మనసుపై ఎంతలా ఎఫెక్ట్ చూపిస్తుందంటే, భవిష్యత్తులో అలాంటి బాధ మళ్లీ పడకూడదని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యి..తెలీకుండానే ఒక రక్షణ గోడను కట్టేసుకుంటుంది. ఆ గోడ పేరే అనుమానం.
సైకాలజీ ప్రకారం చూస్తే.. అలా అందరినీ అనుమానించే వ్యక్తి నిజానికి ఎదుటివారిని బాధపెట్టాలని అలా చేయడు. మరోసారి తనకు తాను గాయపడకుండా కాపాడుకోవడానికి మాత్రమే అలా చేస్తాడు. తాను ఎవరినీ నమ్మకపోతే తనను ఎవరూ మోసం చేయలేరు. అప్పుడు మాత్రమే తనకు బాధ కూడా ఉండదనే ఒక ఆలోచన వాళ్ల మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంది.
దీనివల్ల కొత్తగా వారి జీవితంలోకి ఎంత మంచి వ్యక్తి వచ్చినా, వారిని కూడా పాత కళ్లతోనే చూస్తారు. ఫోన్ బిజీగా వచ్చినా, కాస్త లేటుగా మాట్లాడినా.. గతంలో తనను మోసం చేసిన వ్యక్తి కూడా ఇలాగే చేసేవాడంటూ పాత చేదు జ్ఞాపకాలను, ఇప్పటి మంచి బంధానికి ముడిపెట్టుకుంటారు.
ఎవరూ ద్రోహం చేయకపోయినా సరే, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ మోసం చేసేవారే అంటూ బలంగా నమ్ముకుని బతికేస్తుంటారు. ఈ మైండ్ సెట్ వల్ల ఆ వ్యక్తి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేడు. ఎందుకంటే ఎప్పుడూ ఎదుటివారి ప్రతి కదలికను కూడా జాగ్రత్తగా గమనిస్తూ, లేని తప్పులను వెతుకుతూ మైండ్ అంతా టెన్షన్‌తో పాడు చేసుకుంటాడు.
అయితే మనల్ని నిజాయితీగా ప్రేమించే వ్యక్తిని ఇలా పదే పదే అనుమానిస్తే, ఒక రోజు వారు విసిగిపోయి శాశ్వతంగా దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఎవరినీ నమ్మలేకపోవడం వల్ల మెల్లమెల్లగా చుట్టూ మనుషులున్నా కూడా.. మనసు విప్పి మాట్లాడలేక ఒంటరివాడైపోతాడు.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే మొదట తన జీవితంలో జరిగిన విషయాలను ఇప్పుడున్న జీవితాన్ని వేరుగా చూడటం నేర్చుకోవాలి. గతంలో మోసం చేసిన వ్యక్తి వేరు, ఇప్పుడున్న వ్యక్తి వేరు అనే నిజాన్ని మనసుకు పదే పదే గుర్తుచేస్తూ ఉండాలి.

మనసులో ఏదైనా అనుమానం వస్తే, దాన్ని లోపలే దాచుకుని ఏవేవో ఊహించుకోవడం వంటివి చేయకుండా.. ఎదుటివారితో కూర్చుని ప్రశాంతంగా మాట్లాడి క్లారిటీ తెచ్చుకుంటే మంచిది.
తమ జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ నమ్మేయడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి, వారు చేస్తున్న చిన్న చిన్న పనులను జాగ్రత్తగా గమనిస్తూ ఎదుటివారిని నమ్మడం అలవాటు చేసుకోవాలి.
జీవితంలో ఒకసారి మోసం జరిగిందని, జీవితాంతం ఎవరినీ నమ్మకుండా ఉండటం చేయకూడదు. అది మనల్ని మనమే శిక్షించుకోవడమే అవుతుంది . గతాన్ని ఒక చేదు పాఠంగా భావించి వదిలేయాలి. అప్పుడే ప్రస్తుతం మనల్ని వెతుక్కుంటూ వచ్చే నిజమైన బంధాల విలువ తెలుస్తుంది.





