Nepal : అక్కడ మళ్లీ జెన్ జీ నిరసనలు..నేపాల్ ప్రధాని బాలెన్ షా కథ ముగిసినట్టేనా ?
Nepal : ఏ జెన్ జీ ఉద్యమంతో అధికారం చేపట్టారో ఆ బాలెన్ షాకు వ్యతిరేకంగానే .. ఇప్పుడు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Nepal
జెన్ జీ ఉద్యమం…నేపాల్(Nepal) దేశ రాజకీయాలను మార్చేసిన యువత తిరుగుబాటు. సోషల్ మీడియాపై ఆంక్షలకు వ్యతిరేకంగా మొదలైన ఈ జెన్ జీ ఉద్యమం ఏకంగా అక్కడి ప్రభుత్వం కూల్చివేతకు కారణమైంది. తర్వాత ర్యాపర్, యువ నేత బాలెన్ షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం వెనుక జెన్ జీ నిరసనలే కీలకపాత్ర పోషించాయి.
ఒకప్పుడు నేపాల్(Nepal) రాజకీయ ముఖచిత్రాన్నే మార్చిన ఈ జెన్ జీ నిరసనలు ఇప్పుడు అక్కడ మరోసారి చెలరేగాయి. ఏ జెన్ జీ ఉద్యమంతో అధికారం చేపట్టారో ఆ బాలెన్ షాకు వ్యతిరేకంగానే ఇప్పుడు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా భూమిలేని ఆక్రమణదారులపై బాలెన్ షా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఈ నిరసలకు కారణమైంది. ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించకుండా ఎన్నో ఏళ్లుగా ఉంటున్న పేదలను బలవంతంగా ఖాళీ చేయిస్తోంది. వరద ముప్పు తగ్గించడానికే అంటూ ఖాట్మండులో నదీతీరాల వెంబడి నివసిస్తున్న పేదలను బాలెన్ షా ప్రభుత్వం బలవంతంగా తరలిస్తోంది.
మూడు నెలలుగా ఈ ఆక్రమణ చర్యల్లో భాగంగా దాదాపు 3 వేల వరకూ ఇళ్లను కూల్చివేసింది. దీంతో 15 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వారంతా తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం అలా తలదాచుకుంటున్న 300కు పైగా కుటుంబాలను అక్కడ నుంచి బలవంతంగా పంపించేయడం తీవ్ర నిరసనలకు కారణమైంది.
ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారంతా అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. వారిపై దురుసుగా వ్యవహరిస్తున్న నేపాల్ పోలీసులు బలవంతంగా అక్కడ నుంచి వెళ్లగొడుతున్నారు. యువత మద్ధతుతోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బాలెన్ షా వారి కోసం ఎలాంటి ఉపాధి కల్పించకపోవడం , ఆదాయం పెంచడానికి బడ్జెట్లో సరైన ప్రణాళికలు లేకపోవడం యువత ఆగ్రహానికి కారణమైంది.

పోలీసులు బలవంతంగా ఖాళీ చేయిస్తుండడంతో కొంతమంది నిర్వాసితులు ఆత్మహత్యాయత్నం చేయడం కూడా నిరసనల ఉధృతి పెరగడానికి కారణమైంది. నిన్నటి వరకూ బాలెన్ షాకు మద్ధతు పలికిన యువత ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జెన్ జీ నిరసనలను ఉధృతం చేసింది. వారిపైన కూడా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో నిరసనకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
అటు ఈ నిరసనలపైనా, పోలీసుల తీరుపైనా ప్రధాని బాలెన్ షా స్పందించకపోవడం మరింత నిప్పు రాజేసింది. విపక్ష నేపాలీ కాంగ్రెస్ పార్టీ నేతలు యువతకు మద్ధతుగా నిరసనల్లో పాల్గొంటున్నారు. దీంతో నేపాల్లో మరోసారి జెన్ జీ ఉద్యమం టెన్షన్ పెంచుతోంది.





