Womens Team : క్రికెట్ మక్కాలో సరికొత్త చరిత్ర.. లార్డ్స్‌లో భారత మహిళల జట్టు గ్రాండ్ విక్టరీ..
Womens Team: మహిళల క్రికెట్లో టెస్ట్ మ్యాచ్‌లు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందులోనూ భారత్, ఇంగ్లాండ్ వంటి అగ్రశ్రేణి జట్లు ఆడుతుంటే సహజంగానే క్రేజ్ ఏర్పడుతోంది.
Womens Team
భారత మహిళల క్రికెట్ జట్టు(Womens Team) చరిత్ర సృష్టించింది. చారిత్రక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. ఈ ఏకైక టెస్టులో ఆతిథ్య జట్టును 270 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీని ద్వారా ఇటీవల ప్రపంచకప్‌లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన బాధను తాజా విజయంతో మరిచిపోయేలా చేసింది.
మహిళల క్రికెట్లో టెస్ట్ మ్యాచ్‌లు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందులోనూ భారత్, ఇంగ్లాండ్ వంటి అగ్రశ్రేణి జట్లు ఆడుతుంటే సహజంగానే క్రేజ్ ఏర్పడుతోంది. చాలా రోజుల తర్వాత రెండు జట్ల మధ్య జరిగిన ఈ టెస్టులో ఆద్యంతం భారత మహిళలదే ఆధిపత్యంగా నిలిచింది. అటు బ్యాటింగ్‌లోనే కాకుండా ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ దుమ్మురేపింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌట్ అయింది. స్మృతి మంధాన (83), హర్మన్ ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) పరుగులతో రాణించారు.
తర్వాత బౌలింగ్‌లోనూ భారత జట్టు(Womens Team) అదరగొట్టింది. ముఖ్యంగా యువ పేసర్ క్రాంతి గౌడ్ దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఐదు వికెట్లతో క్రాంతి గౌడ్ ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. దీంతో ఇంగ్లీష్ టీమ్ కేవలం 170 పరుగులకే కుప్పకూలింది. లార్డ్స్ గ్రౌండ్లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి మహిళా బౌలర్‌గా క్రాంతి చరిత్ర సృష్టించింది. అలాగే ఆమె పేరు లార్డ్స్ హానర్స్ బోర్డులో లిఖించారు.
తర్వాత భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మరోసారి సత్తా చాటింది. స్మృతి మంధాన(70) మరోసారి హాఫ్ సెంచరీతో మెరిస్తే షెఫాలీ వర్మ (33) కూడా రాణించింది. తర్వాత యాస్తిక భాటియా సెంచరీతో కదం తొక్కింది. లార్డ్స్ గ్రౌండ్లో శతకం చేసిన తొలి మహిళా బ్యాటర్‌గా రికార్డులకెక్కింది. ఆమెతో పాటు రిఛా ఘోష్ హాఫ్ సెంచరీతో రాణించింది.

దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 341 పరుగులకు డిక్లేర్ చేసింది. తర్వాత మూడోరోజు ఆటముగిసే సరికే ఇంగ్లాండ్ ఓటమి ఖాయమైపోయింది. భారత బౌలర్ల దెబ్బకు ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ నాలుగోరోజు తొలి సెషన్లోనే 186 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ మహిళల జట్టు క్రికెట్ మక్కాలో చారిత్రక విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 5 , రెండో ఇన్సింగ్స్ లో 2 వికెట్లు తీసిన క్రాంతి గౌడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.





