Africa Camels : ఆఫ్రికా ఒంటెలకు డేంజర్ బెల్స్ ..గ్లోబల్ వార్మింగ్‌తో మనుగడే ప్రశ్నార్థకం అయిందా?
Africa Camels : మితిమీరిన ఎండల వల్ల ఒంటెల కాళ్లకు బొబ్బలు రావడం, కళ్ల వెంట నీరు కారడం, చర్మం కాలిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి.
Africa Camels
పర్యావరణంలో మార్పులు మనుషులకే కాదు ఎవరికైనా ఎంత ప్రమాదమో మరోసారి రుజువైంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆఫ్రికా ఒంటెలు(Africa Camels) తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. భూతాపంతో ఎడారి ఓడలుగా పేరున్న ఒంటెల మనుగడే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆఫ్రికాలోని ఒంటెలు తీవ్రమైన వాతావరణ మార్పులు, మితిమీరిన వేడి తరంగాలు కారణంగా చనిపోతున్నాయని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
మునుపెన్నడూ లేని ఈ తీవ్రమైన వేడి ఒంటెల సహజ జీవక్రియలను దెబ్బతీస్తోంది. విపరీతంగా కాలిపోయే ఇసుక , నేల వల్ల ఒంటెల పాదాలకు తీవ్రమైన బొబ్బలు వస్తున్నాయి, దీనివల్ల అవి సరిగ్గా నడవలేక, కూర్చోలేక నరకం అనుభవిస్తున్నాయి. ఒంటెలు సాధారణంగా కఠినమైన వాతావరణాన్ని తట్టుకుంటాయి. ఒంటెలు నీరు లేకుండా చాలా రోజులు ఉండగలవు కానీ, ప్రస్తుతం ఉన్న తీవ్ర పరిస్థితుల వల్ల నీటి వనరులు పూర్తిగా ఎండిపోతున్నాయి.
నీటి కోసం ఇవి మైళ్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఇది వాటి శరీర బలాన్ని తగ్గించి, మరణాలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోతుండటంతో ఇవి కూడా తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నాయి. మితిమీరిన ఎండల వల్ల ఒంటెల కాళ్లకు బొబ్బలు రావడం, కళ్ల వెంట నీరు కారడం, చర్మం కాలిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే రోగనిరోధక శక్తి క్షీణిస్తోంది. ఉష్ణోగ్రత 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీలు దాటినప్పుడు వాటి కణాలు, తెల్లరక్తకణాలు దెబ్బతిని రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతోంది.
హీట్ స్ట్రెస్ వల్ల ఒంటెల జీవక్రియ మందగించి, అవి ఆహారం తీసుకోవడం మానేసి తీవ్ర అలసటకు లోనవుతున్నాయి. కెన్యా వంటి దేశాల్లో ఈ రెండేళ్లలో తీవ్రమైన వేడి వల్ల ఒంటెల మరణాలు 15 శాతానికి పైగా పెరిగాయి. సోమాలియాలో దాదాపు 46 శాతం ఒంటెలు పెంచే కుటుంబాలు కరవు కారణంగా తమ పశువులను కోల్పోయాయి. ఆహారం తినకపోవడం వల్ల ఒంటెల పాల దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఇది వాటిపై ఆధారపడే గిరిజన జాతుల జీవనోపాధిని దెబ్బతీస్తోంది.

పరిస్థితి తీవ్రమవ్వడంతో ఇథియోపియా వంటి దేశాల్లోని పశువుల కాపరులు తమ ఒంటెలను కాపాడుకోవడానికి ఉత్తర ప్రాంతాల నుంచి నీరు, నీడ దొరికే దక్షిణ ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిపోతున్నారు. ఆఫ్రికా ఒంటెల(Africa Camels) సంరక్షణ కోసం ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థలు ప్రత్యేక నీటి వసతి , అత్యవసర వైద్య సేవలను అందించాలని సూచిస్తున్నాయి. ఆఫ్రికా ఒంటెల సంరక్షణ కోసం నీటి వనరులను మెరుగుపరచడం, పచ్చిక బయళ్లను రక్షించడం ,అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Delhi Protest : వీధి పోరాటాలు, వేల కోట్ల నష్టాలు.. ఢిల్లీ ఆందోళనల వెనుక ఊహించని ఆర్థిక సంక్షోభం..





