Karur Stampede : సీఎం విజయ్ ప్రభుత్వానికి షాక్..కరూర్ బాధితులకు ఉద్యోగాల ఉత్తర్వులు రద్దు
Karur Stampede : ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన సభకు వచ్చి తొక్కిసలాటలో చనిపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇచ్చేస్తారని కొంతమంది ప్రశ్నించారు.
Karur Stampede
తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు భారీ షాకిచ్చింది. కరూర్ తొక్కిసలాట(Karur Stamped) ఘటనలో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ విజయ్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది.
ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పంచిపెట్టేది కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు కావాలంటే ఆర్థిక సాయం చేయాలని సూచించింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. గతేడాది కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో 41 మంది చనిపోయారు.
అప్పట్లో ఈ తొక్కిసలాటకు సంబంధించి అప్పటి ప్రభుత్వంపై టీవీకే పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. అనంతరం ఘటనపై విచారణ సైతం సీబీఐకి అప్పగించారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బాధిత కుటుంబాలను కలిసిన సీఎం విజయ్ 41 కుటుంబాలకు చెందిన ఒక్కో వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా అందజేశారు.
అయితే అప్పట్లోనే దీనిపై విమర్శలు వచ్చాయి. ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన సభకు వచ్చి తొక్కిసలాటలో చనిపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇచ్చేస్తారని కొంతమంది ప్రశ్నించారు. అది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి శిక్షణ తీసుకుంటున్న వారికి అన్యాయం చేసినట్టేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది.
అదే సమయంలో ఈ ఉద్యోగాలు ఇవ్వడంపైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయం బాధితుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక భద్రత కల్పిస్తుందని ఒక వర్గం సమర్థిస్తుంటే, ఇది నిబంధనలకు విరుద్ధమని , తప్పుడు సంప్రదాయానికి తెరలేపుతుందని మరో వర్గం వ్యతిరేకించింది.
కుటుంబంలో ప్రధాన సంపాదన కోల్పోయిన బాధిత కుటుంబాలకు సంక్షేమ రాష్ట్రంగా అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని టీవీకే పార్టీ నేతలు, విజయ్ అభిమానులు చెబుతున్నారు. మానవతా దృక్పథంతో బాధితులకు అండగా నిలబడటానికి ఈ నిర్ణయం దోహద పడుతుందని అంటున్నారు.

అయితే రాజకీయ పార్టీల సమావేశాల్లో జరిగే ఇలాంటి ప్రమాదాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కారుణ్య నియామక నిబంధనలకు విరుద్ధమని సీపీఐ, సీపీఎం వంటి వామపక్ష పార్టీలు, ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పాయి. నిరుద్యోగ యువతకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అర్హులైన లక్షలాది మందికి ఇది తీవ్ర నష్టం చేకూరుస్తుందని, సమాన అవకాశాల నిబంధనను ఉల్లంఘిస్తుందని వాదించాయి.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీనిపై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ తుది తీర్పు వెలువరించింది.
Ranganath : హైడ్రా చీఫ్‌గా రంగనాథ్‌ను తొలగించండి..తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు





