Just SpiritualLatest News

SriKrishna Janmashtami : కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు ఇష్టమైన ప్రసాదాలను ఇలా చేయండి..

SriKrishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కేవలం టేస్ట్ కోసం మాత్రమే కాకుండా, ఆ శ్రీకృష్ణుడిపై ఉన్న అపారమైన భక్తితో ఈ అటుకుల ప్రసాదాలను సమర్పించండి.

SriKrishna Janmashtami

బుల్లి కృష్ణుడి చిలిపి అల్లరిని, యశోదమ్మ మురిపాలను తలచుకోగానే ఎలాంటివారికి అయినా అమృతతుల్యమైన వాత్సల్యంతో మనసంతా నిండిపోతుంది. మేడలు, మిద్దెలు, రాజభోగాల కంటే కూడా నిరుపేద కుచేలుడు అందించిన గుప్పెడు అటుకులే అమృతంతో సమానమని..తనను నమ్మే భక్తుల ప్రేమే ఎక్కువని చాటిచెప్పాడు ఆ శ్రీకృష్ణుడు.

భక్తి ఉంటే చాలు పరమాత్మ పొంగిపోయి భక్తులకు లొంగిపోతాడని నిరూపించే కృష్ణతత్వానికి, అటుకుల నైవేద్యం ఒక దివ్యమైన ప్రతీకగా భాగవతం చెబుతుంది. సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి(SriKrishna Janmashtami) రోజు ఆ బాల గోపాలుడిని మురిపించి ఆశీస్సులు పొందడానికి పాలు, నెయ్యి, బెల్లంతో కూడిన కమ్మని అటుకుల ప్రసాదం, అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

బెల్లం అటుకుల ప్రసాదం తయారీ కోసం ఒక కప్పు అటుకులు, అర కప్పు తురిమిన బెల్లం, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, కొంచెం స్పూన్ల నెయ్యి, యాలకుల పొడి, అలాగే సరిపడా జీడిపప్పు, కిస్మిస్‌లు రెడీ చేసుకోవాలి.

అటుకులను శుభ్రంగా కడిగి నీళ్లన్నీ వార్చి.. ఓ 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఒక బాణలిలో స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌లను కాస్త వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక గిన్నెలో బెల్లం, కొన్ని నీళ్లు పోసి కరిగే వరకు వేడి చేయాలి.. దీనికి పెద్దగా పాకం రానక్కర్లేదు.

బెల్లం కరిగాక దానిలో పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి ఒక్క నిమిషం ఉడికించాలి. ఇప్పుడు అటుకులను, మిగిలిన నెయ్యి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌లు వేసి బాగా కలిపి.. చిన్న మంటపై కాసేపు ఉంచి దించేస్తే కమ్మని బెల్లం అటుకుల ప్రసాదం రెడీ అవుతుంది

ఇక నోరూరించే అటుకుల పాయసానికి.. కప్పు అటుకులు, 3 కప్పుల పాలు, అర కప్పు బెల్లం లేదా పంచదార, 2,3 స్పూన్ల నెయ్యి, యాలకుల పొడి, సరిపడా జీడిపప్పు, బాదం, కిస్మిస్ అవసరమవుతాయి.

కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్‌లను వేయించి పక్కన ఉంచాలి. మిగిలిన నెయ్యిలో అటుకులను వేసి చిన్న ఫ్లేమ్‌పై మంచి వాసన వచ్చేంత వరకూ వేయించాలి. మరో పాత్రలో పాలను మరిగించి పొంగు వచ్చాక వేయించిన అటుకులను దానిలో వేసి చిన్న ఫ్లేమ్‌పై ఉడికించాలి.

SriKrishna Janmashtami
SriKrishna Janmashtami

అటుకులు త్వరగానే ఉడుకుతాయి కాబట్టి వాటిని కలుపుతూ.. అటుకులు ఉడికిన తర్వాత యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.వేడిగా ఉన్నప్పుడు బెల్లాన్ని కలిపితే పాలు విరిగిపోతాయి కాబట్టి .. పాయసం కాస్త చల్లారిన తర్వాతే కరిగించిన బెల్లాన్ని కలపాలి. ఒకవేళ పంచదార వాడితే మాత్రం స్టవ్ ఆఫ్ చేసే ముందే కలుపుకోవచ్చు. ఆఖరు వేయించిన జీడిపప్పు, కిస్మిస్ అందులో వేస్తే కన్నయ్యకు ఎంతో ఇష్టమైన నైవేద్యం సిద్ధమవుతుంది.

శ్రీకృష్ణ జన్మాష్టమి(SriKrishna Janmashtami) రోజు కేవలం టేస్ట్ కోసం మాత్రమే కాకుండా, ఆ శ్రీకృష్ణుడిపై ఉన్న అపారమైన భక్తితో ఈ అటుకుల ప్రసాదాలను సమర్పించండి. ఆ కన్నయ్య చూపించే చల్లని అనుగ్రహాన్ని, సకల ఐశ్వర్యాలను సొంతం చేసుకోండి.

Babymoon : హనీమూన్,బడ్డీమూన్ తెలుసు.. మరి సమంత చెప్పిన బేబీమూన్ గురించి తెలుసా?

Related Articles

Back to top button