SIR Survey : బీఎల్ఓల నిర్లక్ష్యం, ఈసీ కన్ఫ్యూజన్..ఎస్ఐఆర్ సర్వేలో ఓటరుకి అసలైన అగ్నిపరీక్ష..
SIR Survey : ఇటీవల బీఎల్ఓల నుంచి ప్రజలకు ఫోన్ రావడం ..మీకు నోటీస్ వచ్చింది, వచ్చి ప్రూఫ్‌లు ఇవ్వాలని చెప్పడంతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు.
SIR Survey
ప్రజాస్వామ్యంలో మన అందరికీ ఉన్న అతిపెద్ద ఆయుధం ఓటు అన్న విషయం తెలిసిందే. కానీ ఈసారి ఎన్నికల్లో ఓటు వేయగలమా అన్న ప్రశ్నే చాలా మందిని వేధిస్తుంది. సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్న తంతు చూస్తుంటే, సాధారణ ఓటరుకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
ఇటీవల బీఎల్ఓల నుంచి ప్రజలకు ఫోన్ రావడం ..మీకు నోటీస్ వచ్చింది, వచ్చి ప్రూఫ్‌లు ఇవ్వాలని చెప్పడంతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు. అధికారుల కమ్యూనికేషన్ గ్యాప్, సిబ్బంది నిర్లక్ష్యం, టెక్నికల్ గందరగోళం వల్ల ఓటు హక్కును కాపాడుకోవడం ఇప్పుడు ఒక పెద్ద పరీక్షలా తయారైంది.
ఈ సమస్యలన్నిటికి ప్రధాన విలన్ ఎన్యూమరేషన్ డ్రైవ్ సరిగ్గా జరగకపోవడమే అంటున్నారు విశ్లేషకులు. నిబంధనల ప్రకారం చూస్తే.. బీఎల్ఓలు ప్రతీ ఇంటీకీ స్వయంగా వెళ్లి ఓటర్ల వివరాలు చెక్ చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇది సరిగా అమలు కాలేదు. దీంతో ఏకంగా ఏకంగా 73.39 లక్షల ఓట్లు హోల్డ్‌లో పడిపోయాయి. దీనిలో 62 శాతానికి పైగా అంటే సుమారు 45 లక్షల మందిని ఎటువంటి సమాచారం లేకుండానే ‘షిఫ్టెడ్ కేటగిరీ’లోకి తోసేశారు.
ఈ గ్రౌండ్ లెవెల్ వైఫల్యానికి బీఎల్ఓలను కూడా తప్పు పట్టలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే బీఎల్ఓలుగా పనిచేసే వారిలో 90 శాతం మంది వరకూ టీచర్లు, అంగన్వాడీలు, విలేజ్ రెవెన్యూ ఉద్యోగులే ఉన్నారు. వీరంతా తమ సొంత జాబ్స్ చేస్తూనే, అతి తక్కువ పారితోషికంతో ఈ డ్యూటీని కూడా చేయడం విపరీతమైన భారంగా మారిపోయింది.
పైగా అతి తక్కువ టైమ్‌లోనే వందలాది ఇళ్లను కవర్ చేయాలని, ఫలానా తేదీకి వర్క్ పూర్తవ్వాలని అధికారులు పెట్టే డెడ్‌లైన్ ప్రెజర్ వల్ల వారు ఒత్తిడికి గురై రికార్డులు రాస్తున్నారు. కొత్త యాప్‌లపై వారికి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వకపోవడం, తరచుగా సర్వర్లు డౌన్ అవుతూ ఉండటం, సిటీల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లోకి సెక్యూరిటీ రానివ్వకపోవడం వల్ల .. ఫోన్లలోనే వివరాలు అడగడం లేదా షిఫ్టెడ్ అని రాసేయడం చేస్తున్నారు.
మరోవైపు టెక్నికల్ కోణంలో చూస్తే.. 2002 సంవత్సరం నాటి పాత ఎస్ఐఆర్ డేటాతో ఇప్పటి వివరాలు మ్యాచ్ కాకపోవడం.. అతి పెద్ద ప్రాబ్లెమ్ మారింది. పేరు, తండ్రి లేదా భర్త పేరు,వయసు లేదా అడ్రస్‌లలో చిన్న స్పేస్ లేదా స్పెల్లింగ్ తేడా ఉన్నా కూడా సాఫ్ట్వేర్ దాన్ని అనామలీస్ కేటగిరీ కింద లెక్కకట్టి నోటీస్‌లు జనరేట్ చేసేస్తోంది.
అలా తెలంగాణలోనే నో మ్యాపింగ్‌తో పాటు.. అనామలీస్ కేటగిరీలలో 92.88 లక్షలకు పైగా నోటీసులు జనరేట్ అయ్యాయి. అయితే తెలంగాణలో సీఈవో ఆఫీస్ టార్గెట్ ప్రకారం చూస్తే.. రోజుకు 2.32 లక్షల నోటీసులు జారీ చేయాలి. కానీ అధికారుల రిపోర్ట్ ప్రకారం 47.79 లక్షల మందికి నోటీసులు అందగా, ఏకంగా 32 లక్షల మంది నుంచి ఇంకా ఎలాంటి రిప్లై రాలేదు!
దీని గురించి ఇటు ప్రభుత్వం, అటు ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి కూడా ప్రచార లోపం క్లియర్‌గా కనిపిస్తోంది. పౌరులకు అవగాహన కల్పించడంలో వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయింది. నోటీసులు అందుకున్న ఓటర్లు సకాలంలో విచారణకు రాకపోవడానికి మెయిన్ రీజన్.. ఆధారాల విషయంలో ఉన్న కన్ఫ్యూజన్.. ఓటు ధ్రువీకరణకు ఎన్నికల కమిషన్ 12 రకాల డాక్యుమెంట్లను మాత్రమే అఫీషియల్‌గా అనుమతించింది.
కానీ బీఎల్ఓలు మాత్రం ఆ లిస్ట్‌లో లేని ఆధార్ కార్డ్,పాన్ కార్డ్, రేషన్ కార్డ్,బ్యాంక్ పాస్ బుక్స్,డ్రైవింగ్ లైసెన్స్ వంటివి తీసుకుని పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. అసలు ఏ డాక్యుమెంట్ ఇస్తే ఓటు హక్కు వస్తుందో తెలీక, ఈసీ ఇచ్చిన 12 ఆధారాలు చేతిలో లేక చాలామంది నిరాసక్తతతో బీఎల్వోల దగ్గరకు వెళ్లడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామసభలు సరిగ్గా నిర్వహించకపోవడంతో ఫామ్ 6, 7, 8లు ఎలా నింపాలో చాలామందికి అర్థం కావడం లేదు.
మొత్తంగా ఈ విచారణ ప్రక్రియ చాలా స్లోగా సాగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో 5.74 లక్షల మంది మాత్రమే నోటీసులు అందుకుని సరైన ప్రూఫ్స్ సమర్పించారు. దాంతో ఎన్నికల అధికారులు కేవలం 3 లక్షల మంది ఓట్లను మాత్రమే ఫైనల్ లిస్ట్ కోసం ఓకే చేయగలిగారు. సుమారు 564 అప్లికేషన్లను నిరాకరించగా , కలెక్టర్ల స్థాయిలో సుమారు 2.5 లక్షల అప్లికేషన్ల వెరిఫికేషన్ పెండింగ్‌లోనే పడిపోయింది. కొత్త ఓటు, అడ్రస్ చేంజ్ కోసం వచ్చిన 10 లక్షల దరఖాస్తుల్లో 7.5 లక్షలు మాత్రమే ప్రాసెస్ అయ్యాయి.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో పొరపాట్లు ఎవరు చేసినా కూడా, చివరికి నష్టపోయేది మాత్రం సామాన్య ఓటరే అవుతారు. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి సీఈవో ఆఫీస్ ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడ డ్రాఫ్ట్ లిస్ట్ ప్రదర్శిస్తారు. ఆ డ్రాఫ్ట్ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో(SIR Survey) చెక్ చేసుకోవచ్చు.
ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. నోటీస్ వచ్చినా లేదంటే వివరాల్లో ఏ మాత్రం తేడా ఉన్నా నోటీస్‌కు జవాబివ్వడానికి హాజరై డాక్యుమెంట్లు ఇవ్వకపోతే ఫైనల్ లిస్ట్‌లో ఓటు గల్లంతు అయిపోతుంది. అందుకే వ్యవస్థను తిట్టుకుని కూర్చోకుండా వెంటనే బీఎల్ఓని కలిసి ప్రూఫ్‌లు సబ్మిట్ చేయండి.





