TG SAFE Raids : రుచి సరే.. శుచి ఏది? కోట్లు కురిపించే స్టార్ హోటళ్ల కిచెన్లలో ఎలుకలు, పురుగులా?
TG SAFE Raids : కొన్ని హోటళ్లలో అయితే వంట చేసే సిబ్బంది కిచెన్లోనే పాన్, గుట్కాలు నములుతూ, సిగరెట్లు కాలుస్తూ కనిపించి అధికారులకే బీపీ తెప్పించారు.
TG SAFE Raids
జిగేల్మనే లైటింగ్స్, చూడగానే మైండ్ బ్లాక్ చేసే ఇంటీరియర్స్, రూ.కోట్లు విలువ చేసే రిచ్ కేఫ్‌లు , లగ్జరీ పబ్‌లు.. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ను చూస్తే ఎవరైనా సరే వావ్ అనా ల్సిందే. కానీ ఆ అట్రాక్ట్ చేసే నేమ్ బోర్డుల వెనుక, లోపలికి వెళ్లగానే ఫుడ్ వేలకు వేలు గుంజుతున్న అద్దాల మేడల వెనుక ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో తెలిస్తే మాత్రం ఎవరూ అటువైపు వెళ్లలేరు. అలా ఆకట్టుకునే ఆంబియన్స్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న లగ్జరీ హోటళ్ల కల్తీ ముసుగును టీజీ సేఫ్ అధికారులు(TG SAFE Raids) ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.
తాజాగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి హైఫై ప్రాంతాల్లోని సుమారు 20 ఫేమస్ హోటళ్లు, కేఫ్‌లు, పబ్‌లపై 10 ప్రత్యేక టీమ్‌లు ఒకేసారి దాడి చేయగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. కోట్లు సంపాదిస్తున్న ఈ కిచెన్లలోకి అధికారులు వెళ్లగానే అడుగడుగునా అసహ్యకరమైన, వికారం కలిగించే దృశ్యాలే దర్శనమిచ్చాయి.
కిచెన్ మూలల్లో ఎలుకల మలం, ఇష్టారాజ్యంగా తిరుగుతున్న బొద్దింకలు, బూజు పట్టిన పల్లీలు, మిరియాలలో పాకుతున్న జెర్రులు ఉన్న ఫుడ్ స్టాక్ చూసి అధికారులే షాకయ్యారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే.. వండిన ఆహారాన్ని, పచ్చి మాంసాన్ని ఒకే ఫ్రీజర్‌లో కుక్కేసిన సీన్లు అయితే అన్నింటా కామన్‌గానే కనిపించాయి.
పురుగులు పట్టిన పిండితో వంటలు చేయడం, ఎలుకలు కొరికేసిన మయోనైజ్ ప్యాకెట్లను కూడా కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు తేలింది. ఇంకొన్ని హోటళ్లలో అయితే వంట చేసే సిబ్బంది కిచెన్లోనే పాన్, గుట్కాలు నములుతూ, సిగరెట్లు కాలుస్తూ కనిపించి అధికారులకే బీపీ తెప్పించారు.
ఈ చెకింగ్లలో హైటెక్ సిటీలోని మొనాస్టరీలో కుళ్లిన గుడ్లు, బూజు పట్టిన కూరగాయలు దొరకగా.. ఇనార్బిట్ మాల్లోని అమ్ ఆహా తెలుగు కిచెన్‌లో ఎలుకలు కొరికేసిన మయోనైజ్ లభించింది. మాదాపూర్ లక్కీ మల్టీ కుసిన్, సాయి రామ్ మెస్, ప్రియాంక హాస్పిటాలిటీ, శివాని బార్లలో బ్యాడ్ స్మెల్ వస్తున్న ఫ్రీజర్లు, పురుగులు పట్టిన వంట సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోల్ స్పార్క్ మల్టీ కుసిన్లో అయితే ఏకంగా 22 కిలోల బూజు పట్టిన పల్లీలు, 25 కిలోల నాసిరకం మిరియాలను సీజ్ చేశారు.

కస్టమర్ల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఏకంగా 11 ఫేమస్ రెస్టారెంట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) లైసెన్సులను అధికారులు అక్కడికక్కడే సస్పెండ్ చేసి షట్‌డౌన్ ఆర్డర్స్ ఇచ్చారు. రామేశ్వరం కేఫ్, ఇష్టా వంటి 6 హోటళ్లకు వార్నింగ్‌తో కూడిన ఇంప్రూవ్మెంట్ నోటీసులను జారీ చేశారు. అంతేకాదు ఇలా లాభాల కోసం కక్కుర్తి పడి కుళ్లిన ఫుడ్‌ను వడ్డిస్తున్న ఈ కల్తీ రాయుళ్లపై టీజీ సేఫ్ రాబోయే(TG SAFE Raids) రోజుల్లో మరింత స్ట్రిక్ట్‌గా చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది.
Relatives : రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నారా? ఎంత ఆత్మీయులైనా సరే ఈ హద్దులు దాటకండి..





