Vehicles Over 15 Years Old : మీ బండికి 15 ఏళ్లు నిండాయా? ఆ పని చేయకపోతే ఫైన్ తప్పదు..
Vehicles Over 15 Years Old : 15 ఏళ్లు దాటిన పాత వెహికల్స్ ఆర్సీ రెన్యువల్, గ్రీన్ ట్యాక్స్ నిబంధనలు మారాయి. తెలంగాణ , ఏపీలో బైక్, కారు రెన్యువల్ ఫీజుల వివరాలు క్లియర్‌గా చూద్దాం..
Vehicles Over 15 Years Old
మీ ఇంట్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న పాత బైక్‌ను ఇంకా నడుపుతున్నారా? లేదా ఇష్టంగా కొనుక్కున్న పాత కారు గ్యారేజ్‌లో ఉంచుకుని అప్పుడప్పుడు చిన్న డ్రైవ్‌కు వెళుతున్నారా? అయితే వెంటనే దాని రిజిస్ట్రేషన్ డేట్ ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే వెహికల్ కొని 15 ఏళ్లు దాటితే(Vehicles Over 15 Years Old) కేవలం రిపేర్లు చేయించి, పెట్రోల్ పోసి రోడ్డెక్కి నడిపిస్తామంటే ఇకపై చెల్లదు.
రవాణా శాఖ రూల్స్ ప్రకారం గ్రీన్ ట్యాక్స్ చెల్లించడం అలాగే ఆర్సీ (RC) కూడా రెన్యువల్ చేయించుకోవడం తప్పనిసరిగా మారింది. పర్సనల్, ప్రైవేటు వాహనాలకు స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ గడువు 15 ఏళ్లు కాగా, కమర్షియల్ వెహికల్స్‌కు కేవలం ఏడేళ్లు మాత్రమే ఉంటుంది. గడువు ముగిసిన బండ్లపై రోడ్డెక్కితే ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ రాకపోవడం మాట పక్కన పెడితే కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తనిఖీల్లో దొరికితే భారీ ఫైన్లతో పాటు వెహికల్‌ను స్పాట్లోనే సీజ్ చేస్తారు. ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌ను పూర్తిగా తిరస్కరిస్తాయి కాబట్టి.. ఆ నష్ట పరిహారాన్ని మీరే భరించాల్సి వస్తుంది. అంతేకాకుండా, వ్యాలిడ్ ఆర్సీ లేకుండా వెహికల్ నడిపితే చట్టపరమైన కేసులు నమోదవడంతో.. కోర్టుల చుట్టూ తిరగడమే కాదు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది.
చాలామంది గవర్నమెంట్ విధించే గ్రీన్ ట్యాక్స్ కడితే పని పూర్తయిపోయిందని అనుకుంటారు. కానీ గ్రీన్ ట్యాక్స్ అనేది పొల్యూషన్ కంట్రోల్ కోసం చెల్లించే ట్యాక్స్ మాత్రమే. దాంతో పాటు వెహికల్ ఫిట్నెస్ చెక్ చేయించి ఆర్సీ రెన్యువల్, స్మార్ట్ కార్డ్ ఫీజు, సర్వీస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
ఈ గ్రీన్ ట్యాక్స్‌ను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్ పోర్టల్‌లో వెహికల్ నెంబర్, ఛాసిస్ నెంబర్లోని చివరి ఐదు అంకెలు ఎంటర్ చేసి ఆన్లైన్లోనే ఈజీగా చెల్లించొచ్చు. కాకపోతే ఎలక్ట్రిక్ (EV), ఎల్పీజీ, సీఎన్జీ వెహికల్స్‌కు గ్రీన్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది, కానీ ఆర్సీ రెన్యువల్ మాత్రం కంపల్సరీ చేయించాలి.
15 నుంచి 20 ఏళ్ల లోపు ఉన్న బైక్‌కు ఆర్సీ రెన్యువల్, సర్వీస్, స్మార్ట్ కార్డ్, గ్రీన్ ట్యాక్స్ రూ. 2000తో కలిపి టోటల్ రూ. 3,400 ఖర్చవుతుంది. అదే ప్రైవేటు కారుకైతే గ్రీన్ ట్యాక్స్ రూ. 5000తో కలిపి మొత్తం రూ. 10,600 అవుతుంది.
ఒకవేళ వెహికల్ వయస్సు 20 ఏళ్లు దాటితే భారం మరింత పెరుగుతుంది. 20 ఏళ్లు దాటిన బైక్‌కు గ్రీన్ ట్యాక్స్ రూ. 5000తో కలిపి టోటల్ రూ. 6,400, కారుకు గ్రీన్ ట్యాక్స్ రూ. 10,000తో కలిపి మొత్తం రూ. 15,600 చెల్లించాల్సి ఉంటుంది.
ఆర్సీ రెన్యువల్ కోసం ఫామ్ 25, ఒరిజినల్ ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికేట్ (PUC), ఇన్సూరెన్స్ పేపర్లు రెడీ చేసుకుని ఆర్టీఓ ఆఫీస్‌లో వెహికల్ చెకింగ్‌కు తీసుకుని వెళ్తే ప్రాసెస్ పూర్తవుతుంది.





