Draupadi:విదేశాల్లోనూ ద్రౌపదిని ఆరాధిస్తారని తెలుసా? ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఇవే..
Draupadi: కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న దాదాపు 800 ఏళ్ల పురాతనమైన ధర్మరాయ ఆలయంలో కూడా.. ద్రౌపది పాండవులతో కలిసి పూజలందుకుంటోంది.
Draupadi
మహాభారతం అంటే అందరికీ గుర్తొచ్చేది.. కేవలం ఐదుగురు పాండవులు, వందమంది కౌరవుల యుద్ధం మాత్రమే కాదు. కానీ అదొక జీవన వేదం. వింటే భారతం వినాలి.. తింటే గారెలే తినాలనే సామెత బట్టే మహాభారతం ప్రాముఖ్యత తెలుస్తుంది.
అయితే ఆ మహాకావ్యంలో అడుగడుగునా ఆత్మగౌరవానికి, ధైర్యానికి నిలువెత్తు రూపంగా కనిపించే పాత్ర ద్రౌపది(Draupadi). రామాయణంలో సీతమ్మ వారు పవిత్రతకు నిదర్శనంగా ఎలా నిలిచారో, భారతంలో ద్రౌపది కూడా అంతటి శక్తి స్వరూపిణిగా పేరొందారు. అయితే ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న ద్రౌపది దేవికి మన దేశంలో ఆలయాలు చాలా అరుదుగా ఉన్నా అవి బాగా ప్రాచుర్యం పొందాయి.
ద్రౌపది సాధారణంగా జన్మించలేదని పురాణాలు వివరించాయి. ఆమె అగ్నికుండం నుంచి ఉద్భవించిన ‘అయోనిజ’ కాబట్టే ద్రౌపదిని యజ్ఞసేని అని పిలుస్తారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు, వ్యాస మహర్షితో పాటు ద్రౌపదిని కూడా కృష్ణ అని పిలిచేవారు.పాండవుల విజయ ప్రస్థానంలో ద్రౌపది వెన్నెముకగా నిలిచిన సంగతి తెలిసిందే.
మన దేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలోని తమిళనాడులో ఆమెను ద్రౌపది అమ్మన్ పేరుతో గ్రామ దేవతగా కొలుస్తారు. అక్కడ ఆమెను శక్తి స్వరూపిణిగా ఆరాధించే సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా వస్తోంది.
భారత దేశంలోని ముఖ్యమైన ద్రౌపది(Draupadi) ఆలయాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులోని మూలపేట ద్రౌపది ఆలయం..స్థానికంగా చాలా ప్రసిద్ధి పొందింది.
అలాగే కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న దాదాపు 800 ఏళ్ల పురాతనమైన ధర్మరాయ ఆలయంలో కూడా.. ద్రౌపది పాండవులతో కలిసి పూజలందుకుంటోంది. తమిళనాడులోని కుంభకోణంలోనూ,అలాగే వేలచేరి, ఆలందూరు వంటి ప్రాంతాలతో పాటు మహాబలిపురంలోని రథం ద్రౌపది కీర్తిని చాటి చెబుతున్నాయి.

కేవలం భారత దేశంలోనే కాదు మలేషియా, శ్రీలంక, సింగపూర్, మారిషస్ వంటి దేశాల్లో కూడా ద్రౌపది అమ్మన్ ఆలయాలు ఉండటమనేది నిజంగా ఆశ్చర్యకరమే. ఆ దేశాలలో స్థిరపడిన భారతీయులు ఏటా తిమితి’ అంటే నిప్పుల గుండం తొక్కడం వంటి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.
ఆత్మగౌరవం కోసం పోరాడే ప్రతీ మహిళకు కూడా ద్రౌపది ఒక ఆదర్శమూర్తి. కాబట్టి..ద్రౌపది అమ్మవారిని దర్శించుకుంటే తమ జీవితంలో ఎదురయ్యే అవమానాలు, కష్టాలు తొలగిపోయి ధైర్యం, ఆత్మవిశ్వాసం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
Cool Drinks :కూల్ డ్రింక్స్ , చిప్స్ కాంబినేషన్ ఇష్టమా? సమ్మర్‌లో ఈ పొరపాటు అస్సలు చేయొద్దు..





