Street dogs: వీధి కుక్కలకూ ఒక ఇల్లు..జీహెచ్ఎంసీ సరికొత్త ప్రయోగం
Street dogs: పెంపుడు జంతువుల కొనుగోలుకు బదులుగా వాటిని దత్తత తీసుకోవాలనే సందేశాన్ని కూడా ఈ డ్రైవ్ ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే అవకాశం ఉంది.

Street dogs
హైదరాబాద్‌లో వీధి కుక్క(Street dogs)ల సమస్యకు పరిష్కారంగా జీహెచ్ఎంసీ చేపట్టిన దత్తత కార్యక్రమంపై ప్రజలు, జంతు ప్రేమికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇటీవల కాలంలో కుక్కల దాడులు ఎక్కువవడంతో, వీధి కుక్కలను తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. అయితే, వాటిని తొలగించడం కాకుండా, ప్రేమగల వాతావరణంలో పెరిగేలా దత్తత ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని జీహెచ్ఎంసీ(GHMC dog adoption) భావించడం విశేషం. ఈ తరహా దత్తత డ్రైవ్ హైదరాబాద్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి.
వీధి కుక్క(Street dogs)ల సంఖ్యను తగ్గించడంతో పాటు వాటికి కొత్త జీవితం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ నెల 17న బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కులో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక ప్రత్యేక దత్తత డ్రైవ్(dog adoption drive Hyderabad)ను నిర్వహిస్తోంది. అధికారులు ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ‘బీ ఏ హీరో, అడాప్ట్ డోంట్ షాప్’ అనే నినాదంతో ఈ దత్తత డ్రైవ్‌ను నిర్వహిస్తుండగా, దీనికి ఎలాంటి ఫీజు లేదు. దత్తత కోసం సిద్ధంగా ఉన్న కుక్కపిల్లలు ఇప్పటికే ఆరోగ్య పరీక్షలు, డివార్మింగ్, టీకాలు వేసుకుని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయి.

ఈ కార్యక్రమం వల్ల భవిష్యత్తులో వీధి కుక్కల(street dogs) సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా, పెంపుడు జంతువుల కొనుగోలుకు బదులుగా వాటిని దత్తత తీసుకోవాలనే సందేశాన్ని కూడా ఈ డ్రైవ్ ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి ఇంకా ఎలాంటి స్పందన వస్తుంది, ఎంతమంది కుక్కపిల్లలను దత్తత తీసుకుంటారనే అంశాలు త్వరలో తేలనున్నాయి. ఈ విజయం భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలకు స్ఫూర్తినిస్తుందని జీహెచ్ఎంసీ అధికారులు ఆశిస్తున్నారు.
అయితే కుక్కలను దత్తత తీసుకున్న తర్వాత వాటిని సరిగా చూసుకోకపోతే అవి మళ్లీ వీధుల్లోకి వచ్చే అవకాశం ఉంది. వాటి సంరక్షణ, ఆరోగ్యం, ఆహారం వంటి బాధ్యతలను తీసుకునేవారు ఎంతమంది ఉన్నారనేది ఒక ప్రశ్న.ఒక ఆవేశంలో దత్తత తీసుకుని, తర్వాత వాటిని వదిలేసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వాటిని నియంత్రించడానికి జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇంకా స్పష్టంగా తెలియదు.

దత్తత డ్రైవ్‌తో కుక్కల సంఖ్య కొంత తగ్గినప్పటికీ, సంతాన నియంత్రణ కార్యక్రమాలు (Animal Birth Control – ABC) వంటి ఇతర చర్యలు కూడా వేగంగా కొనసాగించకపోతే, సమస్య మళ్లీ మొదటికి వస్తుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.