Rajasthan High Court : హైకోర్టు వెబ్‌సైట్‌కే కన్నం..తండ్రిని కాపాడుకోవడానికి కెనడా నుంచి మాస్టర్ ప్లాన్..
Rajasthan High Court : డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లాల్సిన తండ్రిని కాపాడుకోవడానికి కెనడాలో ఉంటున్న కొడుకు.. రాజస్థాన్ హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి నకిలీ పేపర్స్‌ను అప్లోడ్ చేశాడు.
Rajasthan High Court
చట్టం నుంచి తన తండ్రిని కాపాడుకోవడానికి ఓ ఘనుడు ఏకంగా కోర్టు సిస్టమ్‌నే హ్యాక్ చేసేశాడు. టెక్నాలజీతో ఆడుకుంటూ ఏకంగా రాజస్థాన్ హైకోర్టు(Rajasthan High Court) వెబ్సైట్ లోకి డేరింగ్‌గా ఎంట్రీ ఇచ్చి, నకిలీ తీర్పులను అప్లోడ్ చేసేశాడు. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా టెన్షన్ పుట్టిస్తోంది.
అసలు సీన్లోకి వెళితే.. పంజాబ్‌లోని మోగాకు చెందిన కుల్విందర్ సింగ్ పనేసర్ (53) అనే వ్యక్తిపై శ్రీగంగానగర్ పరిధిలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. కుల్విందర్ సింగ్ ఏకంగా 8 కిలోల నల్లమందుతో పోలీసులకు దొరికిపోవడంతో.. అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన కుల్విందర్ సింగ్‌కు.. జూన్ 8 వరకు గడువు ఉంది. జూన్ 9న అతను మళ్లీ జైలులో లొంగిపోవాల్సి ఉంది. కానీ టర్మ్ అయిపోయినా కూడా కుల్విందర్ జైలుకు వెళ్లకుండా పరారయ్యాడు.
ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. తన తండ్రి మళ్లీ ఊచల వెనక్కి వెళ్లడం ఇష్టం లేని అతని కొడుకు మన్‌ప్రీత్ సింగ్ పనేసర్ (27) రంగంలోకి దిగాడు. ఇతను 2018 నుంచి కెనడాలో ఐటీ నిపుణుడిగా పనిచేస్తుండటంతో.. తనకున్న టెక్నికల్ బ్రెయిన్‌ను అడ్డుపెట్టుకుని రాజస్థాన్ హైకోర్టు(Rajasthan High Court)అఫీషియల్ వెబ్‌సైట్‌నే క్రిమినల్ మైండ్‌తో టార్గెట్ చేశాడు. తండ్రి బెయిల్ గడువు ముగిసినా కోర్టు రికార్డుల్లో ప్రాబ్లెమ్ రాకుండా ఉండటానికి.. 2026 అక్టోబర్ 12, 15, 26 తేదీలతో హైకోర్టు కోర్టు నెంబర్ 12కు సంబంధించిన 3 ఫేక్ క్రిమినల్ మిస్లేనియస్ బెయిల్ ఆర్డర్లను వెబ్సైట్లో ఇరికించేశాడు.
అయితే, ఆ తేదీల్లో ఆ జడ్జి ముందు అలాంటి కేసులేవీ విచారణకు రాలేదని తర్వాత గుర్తించిన హైకోర్టు అధికారులు అవాక్కయ్యారు. పైగా ఈ ఫేక్ ఆర్డర్ల కాపీలనే.. కింద కోర్టుల్లో కూడా చూపించి బెయిల్ కంటిన్యూ చేయాలని మన్‌ప్రీత్ సింగ్ ప్రయత్నించినట్లు తేలింది. నవంబర్ 3వ తేదీన ఈ గోల్మాల్ అంతా బయటపడటంతో హైకోర్టు యంత్రాంగం ఉలిక్కిపడింది.

హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ కుడి భగత్సుని నవంబర్ 4వ తేదీన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీస్ కమిషనర్ అన్షుమాన్ భోమియా పర్యవేక్షణలో స్పెషల్ టీమ్స్ సీన్లోకి దిగి టెక్నికల్ ఎవిడెన్స్‌ను సేకరించాయి. ఈ కుట్ర వెనుక మన్‌ప్రీత్ సింగ్, కుల్విందర్ సింగ్ హస్తం ఉందని పక్కాగా తేలడంతో.. నవంబర్ 10వ తేదీన లుధియానాలో వారిని అదుపులోకి తీసుకుని జోధ్‌పూర్‌కు తరలించారు.
ప్రస్తుతం నిందితులిద్దరూ పోలీసు రిమాండ్‌లో ఉన్నారు. హైకోర్టు లాగిన్ సిస్టమ్‌ను వీరెలా క్రాక్ చేశారు..టోటల్ ఈ డిజిటల్ క్రిమినల్ మైండ్ వెనుక మన్‌ప్రీత్ సింగ్ ఒకడే ఉన్నాడా? లేక దీని వెనుక వేరే వాళ్లెవరి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.





