Sarpanch Post Auctioned : సర్పంచ్ పదవికి బహిరంగ వేలం.. ఏకంగా రూ. 1.20 కోట్లు ఆఫర్
Sarpanch Post Auctioned : కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ పంచాయతీలో సర్పంచ్ పదవికి బహిరంగ వేలాన్ని నిర్వహించారు. రూ. 1.20 కోట్లు చెల్లించి ఓ వ్యక్తి పదవి దక్కించుకున్న ఈ వింత ఘటన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
Sarpanch Post Auctioned
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వచ్చాయంటే.. ప్రచారాలు చేయడం, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కామన్‌గా కనిపిస్తుంటాయి. కానీ కాకినాడ జిల్లాలో మాత్రం ఈ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గ్రామ సర్పంచ్ పదవి కోసం ఏకంగా బహిరంగ వేలాన్ని(Sarpanch Post Auctioned) నిర్వహించారు. రూ. కోట్లకు కోట్లు గుమ్మరించి మరీ సర్పంచ్ సీటును దక్కించుకున్న ఈ వింత రాజకీయ వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ పంచాయతీలో ఈ వింతైన ఘటన చోటు చేసుకుంది. స్థానిక శివాలయంలో నవంబర్ 11 బుధవారం రాత్రి గ్రామానికి చెందిన కొందరు పెద్దలు బహిరంగంగానే సమావేశమయి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నిజానికి ఈసారి సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. అయినా కూడా గ్రామంలోని పదవిని దక్కించుకోవడానికి కొందరు ఏకంగా వేలం పాటను మొదలుపెట్టారు.
ఈ వేలంలో ముగ్గురు వ్యక్తులు పోటీ పడ్డారు. తన భార్యకు కానీ తల్లికి కానీ సర్పంచ్ పదవి కట్టబెడితే గ్రామాభివృద్ధి కోసం రూ. 1.20 కోట్లు ఇస్తానంటూ ఓ వ్యక్తి భారీ ఆఫర్‌నే పెద్దల ముందు ఉంచాడు. అయితే పోటీలో ఉన్న మిగతావాళ్లు కూడా గట్టిగానే పోటీకి దిగడంతో గ్రామ పెద్దలు ఆ వేలాన్ని కాసేపు సీరియస్‌గా నడిపించారు. చివరకు ఆ మొదటి వ్యక్తే కోటి ఇరవై లక్షల భారీ మొత్తాన్ని చెల్లించడానికి ముందుకొచ్చి సర్పంచ్ పదవిని తన ఫ్యామిలీ అకౌంట్లో వేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ వేలం(Sarpanch Post Auctioned) ద్వారా వచ్చే నిధులను గ్రామాల్లోని ఆలయాల డెవలప్మెంట్కు ఖర్చు చేయాలని పెద్దలు తీర్మానించారట. అంతేకాదు వేలంలో నిర్ణయించిన వ్యక్తి కాకుండా బయట నుంచి ఎవరైనా ఈ ఎన్నికల్లో పోటీకి దిగినా.. అందరూ కలిసి ఎక్కువ డబ్బులతో పాట పాడేవారే గెలిచేలా చూస్తామని కండీషన్ పెట్టారు.
వార్డు మెంబర్ స్థానాలను కూడా ఎవరికీ అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవం చేయాలని, ఒకవేళ ఎలక్షన్స్ వస్తే మాత్రం కమిటీ చెప్పిన వాళ్లనే గెలిపించాలని నిర్ణయించారు. విశేషం ఏంటంటే, దుర్గాడలో ఇలా సర్పంచ్ సీటుకు వేలం పాట జరగడం కొత్తేమీ కాదని, గతంలోనూ రెండుసార్లు ఇలాగే జరిపారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈసారి మూడోసారి ఏకంగా రూ. 1.20 కోట్లకు రేటు పలకడంతో ..ప్రజాస్వామ్యంలో రాజకీయ విలువలు ఏమైపోతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది.





