Just Literature

Literature : స్వతంత్రమింకా రాలేదు

Literature :బ్రతికే స్వతంత్రం ఇచ్చిందెవడు ? స్వతంత్రమొచ్చిందని చెప్పిందెవడు? నాకింకా స్వాతంత్య్రం రాలేదు....

Literature

నాకింకా స్వాతంత్య్రం రాలేదు…
నింగిని, నేలను నమ్ముకొంటూ
మట్టిలో మొలకలు మొలిపించుటకు
పసిడి పంటలు పండించుటకు
మూడు పొద్దులూ దుక్కిటెద్దులా
కాయం నిండని బట్టలతో
కాలం ఎరుగక పరిశ్రమిస్తే
పండిన పంటకు ధర ఎంత?
వడలిన ఒడలు విలువెంత?
ఖరీదు కట్టే దళారీ వాడు
గిట్టే ధరలు పెట్టేదెవడు..?
కర్షక వీరుల కష్ట ఫలానికి
స్వతంత్రమొచ్చిందని చెప్పిందెవడు?
నాకింకా స్వాతంత్య్రం రాలేదు….

నాకింకా స్వాతంత్య్రం రాలేదు…
అమ్మా నాన్నల ఆశల తోటి
పిచ్చి ప్రపంచపు పోటి లోని
మూడో ఏడు గడవక ముందే
మూటను వీపున భారం పెట్టి
కొత్త ప్రపంచపు కార్ఖానాల్లోకి
ఏడుపు మోముతో మేమెళుతుంటే
ఆనందించే అమాయకత్వపు
అమ్మా నాన్నల మెదళ్ల దోచే
ఆరో తరగతి ఐఐటీలు….
విద్యయ్యిందీ వ్యాపారం
పిల్లాడి నెత్తిన పెనుభారం..
అందరిని ఒక తాటికి కట్టి
పోటీ అంటూ రేసులో పెట్టి
స్వతంత్రమొచ్చిందని చెప్పిందెవడు?
నాకింకా స్వాతంత్య్రం రాలేదు….

పట్టా పుచ్చుకు బయటకు వస్తే
ఉద్యోగమన్నా ఊసే లేదు
ఉపాధి దొరికే పత్తా లేదు…
నిరుద్యోగం నిప్పులు చెరిగితే
అమ్మా నాన్నల అప్పులు పెరిగితే
చిన్నో పెద్దో నౌకరి కోసం
పట్టణాలలో చాకిరి చేస్తూ
బతుకులు మారే రోజుల కోసం
ఎదురుచూపులు తప్పటలేదు…
కూడు పెట్టని చదువులుంటే
స్వతంత్రమొచ్చిందని చెప్పిందెవడు?
నాకింకా స్వాతంత్య్రం రాలేదు….

.
సుస్తీ చేస్తే చికిత్స కోసం
ప్రభుత్వాసుపత్రికి పరుగులు తీస్తే
అందే వైద్యం గాల్లో దీపం
పేద ప్రాణం ఎంతో పాపం..
దవాఖానాలో వసతులు దైన్యం
కష్టం వస్తే అంతా శూన్యం..
కాసులు కొద్దీ కార్పొరేట్ సేవ
ప్రాణానికి లేదిక్కడ విలువ..
అందే వైద్యం అందలమెక్కితే
బ్రతికే స్వతంత్రం ఇచ్చిందెవడు ?
స్వతంత్రమొచ్చిందని చెప్పిందెవడు?
నాకింకా స్వాతంత్య్రం రాలేదు….

దండిగా నీకు ధనమే ఉంటే
నేరం కూడా ఘోరం కాదు …
పేదోడివైతే వెంటనే శిక్ష
పెద్దోడివైతే వాయిదాలే రక్ష..
పూచీకత్తుకి సొమ్ములు ఉంటే
బెయిల్లు ఇచ్చే మనుషులు ఉంటే
హత్య కేసయినా దేశం దాటు
ఏళ్లకు ఏళ్లు తీర్పులు లేటు..
లంచం కేసుకు వెంటనే ఖైదు
ఆర్థికనేరం రుజువే లేదు..
చట్టం న్యాయం సమానమన్నది
కాగితాలికే పరిమితమైతే
స్వతంత్రమొచ్చిందని చెప్పిందెవడు?
నాకింకా స్వాతంత్య్రం రాలేదు…

స్వతంత్రం అంటే జెండా ఎగరడం కాదు,
మనసు ఎగరడం, జీవితం వెలగడం…
వెలిగే దీపం చీకటి తరుమును
వాస్తవ స్వేచ్ఛ మనసులో వెలుగును..
అప్పుడే నిజమైన స్వాతంత్య్రం..
అప్పుడే నిజమైన స్వాతంత్య్రం

___ ఫణి మండల

Also Read: Literature

Related Articles

20 Comments

  1. స్వాతంత్ర్యం అనేది వచ్చింది కొంతమందికే..
    బానిసత్వం, వ్యక్తి పూజ పోలేనంత వరకూ స్వాతంత్ర్యం గురించి ఆలోచన వ్యర్ధం..
    Nice literature

  2. బాగా చెప్పారు ఫని గారు….
    జైహింద్

  3. పిచ్చి ప్రపంచపు పోటీ లోని
    మూడో ఏడు గడవకముందే
    Lines superb keep it up 🪴🪴🪴🪴🪴🙏🙏🙏

  4. అల్లుడు గారు చాలా చక్కగా చెప్పారు వాస్తవం

  5. తెలియకుండానే ప్రైవేట్ రంగం విషవలయం లోకి నెట్టబడుతున్న మధ్యతరగతి ప్రజల బ్రతుకు చిత్రం ఈ కవిత. ప్రైవేటు గొప్ప అని బ్రమింపజేసే మాయాజాలం కడకు మానవ జీవితం లో పొందవలసిన కనీస అనుభూతులను దూరం చేయడం మనకు సాదృశ్యమయ్యే కవిత. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని దుర్భర బ్రతుకు నిజ చిత్రం ఈ కవిత. ఫణి కలం పడును పెరుగుతున్న రుజువు ఈ కవిత. చిన్న పదాలతో బ్రతుకును విశదీకరించి విధాన అద్భుతం.

  6. స్వాతంత్రం వచ్చింది ప్రజలకు కాదు విదేశీ తెల్ల దొరలు నుంచి స్వదేశీ నల్ల దొరలకు బానిసత్వం అప్పడు ఇప్పుడు సేమ్ టూ సేమ్ రాజ్యాధికారం మాత్రమే change అయింది అంతే

  7. ఫణి మండల గారు,
    ప్రతి సంవత్సరం
    స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.కానీ మనం ఇంకా నిజమైన స్వాతంత్ర్యానికి బహు దూరంలోనే ఉన్నామని మీ కవిత ద్వారా సోదాహరణంగా బహుచక్కగా వివరించారు.రైతు పడ్డ కష్టానికి ముఖ్యముగా పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడు,ప్రజలు చక్కటి విద్యను అభ్యసించగలిగినప్పుడు, ఆస్పత్రులలో మంచి వైద్యం చేకూరినప్పుడు, నిరుద్యోగం సమస్య అంతమైనప్పుడు, ధనిక పేదలకు సమన్యాయం జరిగినప్పుడు మాత్రమే మనము నిజమైన స్వతంత్రులమవుతాము అనే యదార్థ సత్యాన్ని బహిర్గతపరచిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ..

  8. అవును. స్వతంత్రం ఇంకా మనకి రాలేదు….. చాలా బాగా రాసారు సార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button