Kalachi: ఆకస్మిక నిద్రలోకి జారిపోయే వింత గ్రామం..ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న మిస్టరీ
Kalachi: కలచిలో నివసించే ప్రజలు, ఏ పని చేస్తున్నా, నడుస్తూ ఉన్నా, లేదా వాహనం నడుపుతున్నా సరే, ఒక్కసారిగా తీవ్రమైన నిద్రలోకి జారిపోతారు.

Kalachi
ప్రపంచంలో కొన్ని అంతుచిక్కని రహస్యాలు, వింత ఘటనలు జరుగుతుంటాయి. కజకిస్థాన్‌లోని కలచి (Kalachi) అనే చిన్న గ్రామం అలాంటి ఒక ఆశ్చర్యకరమైన కేసుగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ గ్రామాన్ని “స్లీపింగ్ సిక్నెస్” గ్రామం అని పిలుస్తారు. ఇక్కడ (Kalachi)నివసించే ప్రజలు, ఏ పని చేస్తున్నా, నడుస్తూ ఉన్నా, లేదా వాహనం నడుపుతున్నా సరే, ఒక్కసారిగా తీవ్రమైన నిద్రలోకి జారిపోతారు.
ఈ విచిత్రమైన వ్యాధి 2013లో మొదలైంది. ఈ నిద్ర ఎందుకు వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. బాధితులు కొన్ని రోజులు గాఢ నిద్రలో ఉండి, మేల్కొన్న తర్వాత తాము ఎక్కడ ఉన్నామో, ఎందుకు నిద్రపోయారో పూర్తిగా మర్చిపోతారు. కలచి(Kalachi) గ్రామం మాత్రమే కాదు, దాని పక్కనే ఉన్న క్రాస్నోగోర్స్క్ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఈ రెండు గ్రామాల్లోని దాదాపు 20% జనాభా ఈ వింత వ్యాధితో బాధపడింది.
ఈ వ్యాధికి కారణాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు సంవత్సరాల తరబడి పరిశోధనలు చేశారు. వారి పరిశోధనల్లో బయటపడిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ గ్రామాలకు దగ్గరలో సోవియట్ కాలం నాటి ఒక పురాతన యూరేనియం గని ఉంది. ఆ గనిని మూసివేసినప్పటికీ, దాని లోపల చిక్కుకున్న కార్బన్ మోనాక్సైడ్ (CO) , ఇతర హైడ్రోకార్బన్ వాయువులు భూమి నుంచి బయటకు లీక్ అవుతున్నాయి.
ఈ విషపూరిత వాయువులు గాలిలో కలిసి, ప్రజలు పీల్చడం వల్ల మెదడుకు చేరే ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. దీనివల్ల మెదడు పనితీరులో మార్పులు వచ్చి, ప్రజలు అకస్మాత్తుగా గాఢ నిద్రలోకి జారిపోతున్నారని కజఖ్ నేషనల్ న్యూక్లియర్ సెంటర్ మరియు టామ్స్క్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ పరిశోధనలు సూచించాయి. ముఖ్యంగా, వాతావరణం పొడిగా ఉన్నప్పుడు , చలికాలం, వేసవి కాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ నిద్ర వ్యాధికి మరొక కారణం గురించి కూడా ఒక పరిశోధన జరిగింది. ఈ గ్రామ ప్రజలు ఒకే దగ్గరి నుంచి నీటిని తీసుకునేవారని, ఆ నీటిలో రసాయన కాలుష్యం ఉండవచ్చని కొందరు శాస్త్రవేత్తలు అనుమానించారు. అయితే, ఆ నీరు తాగని జంతువులకు ఈ వ్యాధి రాకపోవడంతో, నీటి కాలుష్యం కారణం కాకపోవచ్చని మరికొందరు విశ్లేషించారు. ఇంకా, యూరేనియం గని దగ్గరగా ఉన్నా కూడా.. అక్కడి రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని, అలాగే వైద్య పరీక్షల్లో ఇది ఒక సామూహిక మానసిక వ్యాధి (మాస్ సైకోసిస్) కాదని నిర్ధారించారు.

ఈ వింత వ్యాధి లక్షణాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ప్రజలు ఏ పనిలో ఉన్నా సరే, ఎక్కడి నుంచి పడితే అక్కడ నిద్రలోకి జారిపోతారు. ఈ నిద్ర కొన్ని రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కూడా కొనసాగుతుంది. మేల్కొన్న తర్వాత వారికి తీవ్రమైన తలనొప్పి, అలసట, జ్ఞాపకశక్తి కోల్పోవడం, బలహీనత, మరియు భ్రమలు (హాలూసినేషన్స్) వంటి లక్షణాలు కనిపించాయి. ఒక్కసారి వ్యాధి బారిన పడిన వ్యక్తికి మళ్ళీ, మళ్ళీ ఈ సమస్య తలెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి.
2013-2015 మధ్య కాలంలో సుమారు 150 మందికి పైగా గ్రామస్థులు ఈ వ్యాధితో బాధపడినట్లు అధికారిక నివేదికలు పేర్కొన్నాయి. ఈ గ్రామంలో కేవలం 580 నుంచి 680 మంది మాత్రమే నివసించేవారు. దీంతో దాదాపు ప్రతి ఇంట్లో ఈ వ్యాధి కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితి వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
చివరకు, 2016లో కజకిస్థాన్ ప్రభుత్వం కలచి, క్రాస్నోగోర్స్క్ గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించి, ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించింది. ఈ విచిత్రమైన సమస్యకు శాస్త్రీయంగా ఒకే ఒక స్పష్టమైన సమాధానం ఇంకా లభించలేదు. కానీ, మూసివేసిన గని నుంచి వెలువడిన విష వాయువులే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఇలాంటి “స్లీపింగ్ సిక్నెస్” కేసు ప్రపంచంలో మరెక్కడా నమోదు కాలేదు. ఇది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ ఒక అంతుచిక్కని, అధ్యయనం చేయాల్సిన అంశంగా మిగిలిపోయింది.