Just LiteratureLatest News

literature : లబ్ డబ్

literature : నేనేదో యంత్రమయినట్టు మీ ఒత్తిడిలన్నీ నాపైనే..నాకేదో తంత్రమొచ్చినట్టు మీ ఆశలన్నీ నాపైనే...

Literature

నేనూ.. మీ గుండెను
విరామమెరుగని  డెందెమును..
నాకే తెలీదు
ఎన్నాళ్లు సాగిపోతానో 
ఎప్పుడు ఆగిపోతానో …
నా శబ్దం చైతన్యం 
నా నిశ్శబ్దం శూన్యం..

మీ దేహంలో నా లయ ఉన్నంతవరకే
మీ మోహాలన్నీ…
మీ బొందిలో నేను సవ్వడి చేసినంతవరకే
మీ బంధాలన్నీ..
మీ అంతర్భాగమైన నన్ను
మీ అంతరంగంగా మార్చేసారు..

ఉద్వేగంలో జ్వలనమై రగులుతాను
ఉల్లాసంలో  జలధియై పొంగుతాను
కన్నీటిధారలో  వణుకుతాను 
నవ్వుల హోరులో పరిమళిస్తాను
ప్రేమ తాకిడిలో పులకరిస్తాను
విరహ వేడిలో కలవరమవుతాను

మీ కలల బాటలో నడిపించేది నేనే
మీ కష్టాల కడలిని దాటవేసేది నేనే
రాత్రి నిద్రలో భయాన్ని కాచేది నేనే
ఉషస్సంధ్యలో ఆశలు మేల్కొల్పేది నేనే
మీ భావాలకు తగిన రాగాలను పలికేది నేనే 
మీ బంధాలను నాలో బంధించేది నేనే…

ఎద లోపల ప్రీతియైన జ్ఞాపకాలో 
ఎడతెగని ప్రతీకార జ్వాలలో
ఎన్నిటినో స్మరిస్తుంటా 
ఎన్నిటినో భరిస్తుంటా
నేనేదో యంత్రమయినట్టు
మీ ఒత్తిడిలన్నీ నాపైనే..
నాకేదో తంత్రమొచ్చినట్టు
మీ ఆశలన్నీ నాపైనే…

కొందరు తరుక్కుపోతుంది అంటే 
కొందరు మండిపోతున్నాను అంటారు 
కొందరు చెరువైపోతుంది అంటే
కొందరు బరువైపోయింది అంటారు..
జాలి గుండె, రాతి గుండె అంటూ
ఉపమానాలు నాకు తగిలించి 
మీ ఊపిరికి ఉసురు పోసుకుంటారు…

మిత్రమా …
నీవేసే ప్రతి అడుగు నా ఆరోగ్యం
కలకాలం నా అలికిడి నీ భాగ్యం…
నా శాంతం కోసం నువు చేసే ధ్యానం
కడవరకు సాగించెను మన పయనం…

— ఫణి మండల

Literature: ఎన్నాళ్లయిందో..!

Related Articles

23 Comments

  1. హృదయ ఆవేదన…..అద్దం పట్టే అక్షర గమనం….
    చైతన్యం….జాగృత…

  2. ఫణి ప్రాసలో పదాలు కూర్చి గుండెకు ప్రాణం పోశావు.

  3. చాలా వైవిధ్యం గా ఆలోచించి హృదయ ఘోషను కవితగా మలిచారు అద్భుతం. భిన్నంగా ఆలోచించే వాడే కవి పాఠకుల కు చేర్చేదే నిజమైన కవిత బాగుంది. అభినందనలు.

  4. చదువుతున్నప్పుడు కళ్ళలో నీళ్లు, కుడి చెయ్యి ఎడమ వైవు ఛాతి మీద నెమ్మదిగా నిమురుతూ నాలో ఉన్న హృదయం నీలో ఉన్న హృదయానికి హృదయపూర్వక హృదయాంజలి❤️💐🙏

  5. భళే’ గుండె ‘ లే
    మీ గుండె కవిత
    మీ గుండె నుండి
    జాలువారిన
    అనంత భావనలు
    ఆచరిస్తే …
    బా గుండె ను లే
    భవిత లో. .
    ప్రతి గుండె
    💐🤝

  6. ఫణి మండల గారు
    మీ నుండి విరచితమైన ‘లబ్ డబ్ ‘ హృదయానికి మాటలొస్తే తన (హృదయ) స్పందన ఎలా ఉంటుందో చక్కగా విదితమవుతోంది.మన గుండె తన కర్తవ్యాన్ని విస్మరించకుండా లయబద్ధంగా సాగుతూ తనను పదిలంగా చూసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉందని వ్యక్తపరిచిన తీరు వాస్తవికతకు అద్దం పడుతుంది. జన హృదయంతరాలను స్పృశించిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ …

  7. “This poem beautifully reflects the depth of the heart — so simple, yet so powerful.” ❤️

  8. గుండె ఆర్తనాదాలు గుండె భాషను చెప్పడం అద్భుతంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button