Pani puri: ఎవరమ్మా తల్లీ నువ్వు ? పానీపూరి కోసం నడిరోడ్డుపై ధర్నా
Pani puri: 20 రూపాయలకు 6 పానీపూరీలని బండి ఓనర్ చెప్పగా.. తనకు నాలుగే వేశావంటూ గొడవకు దిగింది.

Pani puri
ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్ లో పానీపూరికి మంచి క్రేజ్ ఉంది…ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పానీపూరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఫుడ్ లవర్స్ కు ఇష్టమైనదిగా మారిపోయింది. పానీపూరీ తినేందుకు ఎంతదూరమైన వెళ్ళేవాళ్ళూ ఉన్నారు… అదే సమయంలో రోజూ సాయంత్రం టైమ్ లో ఇది తినకుండా ఉండలేని వాళ్ళూ కూడా కనిపిస్తుంటారు. ప్లేట్ మీద ప్లేట్ లాగించేస్తుంటారు. అయితే ఈ పానీపూరీ కోసం ఓ ఏరియాలో ట్రాఫిక్ మొత్తాన్నే ఒక మహిళ బ్లాక్ చేసింది. కేవలం రెండు పానీపూరీల కోసం నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. గుజరాత్ లోని వడోదరలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ మహిళ వడోదరలోని సుర్ సాగర్ సరస్సు దగ్గర ఓ పానీపూరీ (Pani puri)బండి దగ్గరకెళ్ళి తినడం మొదలుపెట్టింది. 20 రూపాయలకు 6 పానీపూరీలని బండి ఓనర్ చెప్పగా.. తనకు నాలుగే వేశావంటూ గొడవకు దిగింది. బండి ఓనర్ మాత్రం 6 వేశానని చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు మహిళ నానా హంగామా చేసింది. పెద్దగా అరుస్తూ అక్కడే నడిరోడ్డుపై బైఠాయించింది.

దీంతో ముందు ఇదేదో పెద్ద గొడవగా భావించారు. కొందరు వీడియోలు తీయడం ప్రారంభించారు. తీరా దారినపోయే వాళ్ళు , స్థానికులు ఆమెను పలకరించి విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. రోడ్డు మధ్యలో కూర్చుని నిరసన తెలపడంతో కొన్ని నిమిషాల్లోనే భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. చుట్టూ ఉన్నవాళ్ళలొ కొందరు వీడియోలు తీస్తూ ఆనందిస్తుండగా.. మరికొందరు ఆమెను పక్కకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారు. కానీ ఆ మహిళ ససేమీరా రానంటూ మొండికేసింది. తనకు మిగిలిన 2 పానీపూరీ వేస్తే తప్ప రోడ్డు మీద నుంచి తప్పుకోనంటూ రచ్చ చేసింది. లాభం లేదనుకున్న కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వచ్చినా సదరు మహిళ ఏ మాత్రం భయపడకుండా 2 పానీపూరీల (Pani puri)వేయాల్సిందేనంటూ కూర్చుంది. పోలీసులు ఆమెను బతిమాలుతూ పక్కకు రమ్మని కోరినా రాకుండా బిగ్గరగా ఏడుస్తూ హంగామా సృష్టించింది. ట్రాఫిక్ అంతకంతకూ పెరిగిపోతుండడంతో పోలీసులు బలవంతంగా మహిళను పక్కకు తీసుకెళ్ళారు. మిగిలిన 2 పానీపూరీలు ఇప్పించారో లేదో తెలియదు కానీ ఆమె వీడియోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ తెచ్చుకున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.. నీ కష్టం పగోళ్ళకు కూడా రావొద్దు అక్కా అంటున్నారు.. మరికొందరు పానీపూరీ కోసం ఈ అక్క పానిపట్టు యుద్ధమే చేసేలా ఉందిగా అంటూ సెటైర్లు వేస్తున్నారు. పానీపూరీని ఇష్టపడడం మొదలుపెడితే ఇలాగే ఉంటుందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
One Comment