Just NationalLatest News

Bihar:మూడు దశల్లో బిహార్ పోలింగ్..అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో నోటిఫికేషన్

Bihar: ప్రస్తుత బిహార్ ప్రభుత్వ పదవీ కాలం నవంబర్ 22న ముగియనుండగా.. ఈ లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.

Bihar

దేశంలో మళ్లీ ఎన్నికల హడావుడి రాబోతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిహార్ అసెంబ్లీ పోల్స్ కు కౌంట్ డౌన్ మొదలైంది. వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బిహార్ పోలింగ్ ఈ సారి కూడా మూడు దశల్లో నిర్వహించనున్నారు. బిహార్(Bihar) లో ప్రఖ్యాతగాంచిన ఛట్‌పూజ తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముందని సమాచారం. చట్‌పూజ అక్టోబర్ 28న జరగనుండగా.. నవంబర్ 5 నుంచి 15 మధ్య ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రస్తుత బిహార్ ప్రభుత్వ పదవీ కాలం నవంబర్ 22న ముగియనుండగా.. ఈ లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ జాబితా అవకతవకలపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఓట్ చోరీ అంటూ ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాతే షెడ్యూల్ ను ప్రకటించనున్నట్టు భావిస్తున్నారు.

Bihar
Bihar

ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఈ ఓట్ చోరీ వ్యవహారంపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. తమపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలను తిప్పికొట్టింది. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతుండగానే ఓటర్ల తుది జాబితాను ఈ నెలాఖరు లోపు ప్రకటించనున్నారు. అదే సమయంలో వచ్చే వారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ బిహార్(Bihar) పర్యటనకు వెళ్లి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్టు తెలుస్తోంది.

బిహార్(Bihar) లో సమస్యాత్మక ప్రాంతాలే ఎక్కువగా ఉండడంతో పోలింగ్ నిర్వహించడం ఈసీకీ పెద్ద సవాల్.. అందుకే 2020 తరహాలోనూ అత్యంత పకడ్బందీగా మూడు దశల్లో పోలింగ్ నిర్వహించేలా ఈసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మూడు దశల తేదీలపై కసరత్తు ఇప్పటికే కొలిక్కి వచ్చినట్టు సమాచారం. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ తొలి రెండు దశల్లోనే పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే బిహార్ అసెంబ్లీలో 243 సభ్యుల ఉండగా.. ప్రస్తుత ఎన్డీఎ ప్రభుత్వానికి 131 మంది సభ్యుల బలముంది. బీజేపీ సొంతంగా 80 మంది ఎమ్మెల్యేలతో, జనతా దళ (యునైటెడ్) 45, హిందుస్థాని అవామ్ మోర్చా 4, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో గత ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇక రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), సీపీఐలతో కలిసి ఏర్పడిన ఇండియా కూటమికి 111 మంది ఎమ్మెల్యేల బలముంది. బిజేపీ ప్రధాన పార్టీగా ఉన్న ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతుండగా…ఓట్ చోరీ అంశాన్ని మరింత బలంగా బిహార్ ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ సారి విజయం సాధించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది.

కాగా బిహార్ తో పాటే దేశంలో ఖాళీ అయిన పలు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికలు జరగనున్నాయి. వీటిలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా ఆ సమయంలోనే పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ స్థానానికి ఉపఎన్నిక అవసరం పడింది.

OG Trailer: ఓజీ ట్రైలర్ వచ్చేసింది పవన్ ఫ్యాన్స్ కు యాక్షన్ మీల్స్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button