just AnalysisJust NationalLatest News

National Flag : ఆగస్ట్ 15 వరకే పరిమితమైన దేశభక్తి..రోడ్డుపై నలిగిపోతున్న జాతీయ పతాకానికి జవాబిచ్చేదెవరు?

National Flag : అమెరికాలో ఇండిపెండెన్స్ డేకి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగురుతుంది. కానీ, పండుగ అయిపోయాక ఏ ఒక్క జెండా కూడా రోడ్డుపై కనిపించదు.

National Flag

ఇండిపెండెన్స్‌ డే వస్తుందనగానే మనలో చాలామందికి దేశభక్తి ఏ రేంజ్‌లో పొంగి పొర్లిపోతుందో చూస్తూనే ఉంటాం. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పక్కరలేదు. ఆగస్ట్ 15 పొద్దున్నే నిద్రలేవడం, వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో జాతీయ జెండా డీపీలుగా పెట్టేయడం, డ్రస్సుల మీద మువ్వన్నెల బ్యాడ్జీలు గుచ్చుకోవడం, బైకులకు జెండాలు కట్టుకుని రోడ్ల మీద హంగామా చేయడం..ఇలా ఆ ఒక్క రోజూ మనల్ని మించిన దేశభక్తులు ఎక్కడా ఉండరు అనేలా కనిపిస్తారు.

కానీ.. సరిగ్గా 24 గంటలు గడిచాక, ఆగస్ట్ 16 వ తేదీ మార్నింగ్ ఒక్కసారి వీధుల్లోకి వచ్చి చూస్తే షాక్ అవకుండా ఉండలేం. నిన్నటి వరకూ సగర్వంగా ఎగిరిన అదే జెండాలు..రోడ్ల మీద, చెత్తకుండీల్లో, డ్రెయిన్లలో దయనీయ పరిస్థితులలో కనిపిస్తూ ఉంటాయి. ఆగస్ట్ 15న గౌరవించాం .. ఇక తర్వాత ఏమయితే ఏంటనే నిర్లక్ష్యం నరనరాన జీర్ణించుకోయిన మనుషుల వికృత మైండ్‌సెట్‌కు సజీవ సాక్ష్యంగా మూగగా కన్నీళ్లు పెడుతుంటాయి.

నిజానికి మన దేశంలో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా మరియు జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం-1971 ఏం చెబుతున్నాయన్నది కూడా చాలామందికి తెలీదు. కేంద్ర హోంశాఖ కండీషన్ల ప్రకారం జెండాను ఎప్పుడూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే ఎగురవేయాలి . ఒకవేళ నైట్‌ పూట తగినంత వెలుతురు ఉంటే దీనికి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యంగా జెండా ఏ సమయంలో కూడా నేలకు తాకకూడదు అగౌరవంగా పక్కన పడేయకూడదు. రోడ్లపై పడేయడం చివరకు బట్టలకు అతికించుకోవడం కూడా తీవ్రమైన నేరమే. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత జెండాను చాలా జాగ్రత్తగా మడతపెట్టి భద్రపరచాలి.

ఒకవేళ జాతీయ జెండా(National Flag) చిరిగిపోయినా , పాడైపోయినా దాన్ని పడేయకూడదు. రహస్యంగా గౌరవప్రదమైన రీతిలో విసర్జనం చేయాలి. కానీ మన దగ్గర ఆగస్ట్ 15న కోట్లాది జెండాలు కొని, మరుసటి రోజుకే వాటిని రోడ్లపై చెత్తలా పారేయడమే అలవాటుగా చేసుకున్నారు.

మరి వేరే దేశాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందా అంటే.. ఆ ప్రశ్న అడిగినా పట్టుకుని చితక్కొట్టేంతగా అక్కడివారు రియాక్టవుతారు . అమెరికాలో జూలై 4న తమ ఇండిపెండెన్స్ డేని ఎంతో ఘనంగా జరుపుకొంటారు. అక్కడ ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగురుతుంది. కానీ, పండుగ అయిపోయాక ఏ ఒక్క జెండా కూడా రోడ్డుపై కనిపించదు. పాడైపోయిన జెండాలను బాగా చేసి ఇవ్వడానికి రిటైర్డ్ సైనికుల సంస్థలు ప్రత్యేకంగా గౌరవప్రదమైన అవేర్‌నెస్ కార్యక్రమాలను నిర్వహిస్తాయి.

ఇక జపాన్, యూకే వంటి దేశాల్లో కూడా జాతీయ పతాకాన్ని తమ సెల్ఫ్ రెస్పెక్ట్‌కు సమానంగా చూస్తారు. పతాకాన్ని నేలపై పడేయడం లేదా అగౌరవంగా వాడటం అక్కడ సొసైటీలో చాలా పెద్ద తప్పుగా లెక్క బెడతారు. ముఖ్యంగా ఎవరికి వారే ఇలా క్రమశిక్షణ పాటిస్తారు తప్ప అధికారుల చేత చెప్పించుకునేలా ఉండరు.

అయితే ఇండియాలో ఈ పరిస్థితి మారకపోవడానికి అవగాహన లేకపోవడం, బాధ్యతారాహిత్యం ..మెయిన్ రీజన్స్‌ అని చెప్పాలి. దేశభక్తిని కేవలం వన్ డే సంబరంగా, డీపీలు మార్చే షోఆఫ్‌గా చూస్తున్నాం తప్ప, ఆ జెండా వెనుకున్న వేలాది మంది బలిదానాలను గుర్తుంచుకోవడం లేదు.

దీనికి తోడు చట్టాలను సరిగ్గా అమలు లేకపోవడం, నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా జనాల్లో నిర్లక్ష్యం పెరిగిపోతోంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేవలం జెండాలు పంచడమే కాకుండా, వాటిని ప్రజలెలా గౌరవంగా ఎలా విసర్జించాలో చెబుతూ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలి.

National Flag
National Flag

ప్రతీ ఒక్కరూ కూడా ఫోల్డ్ ఇట్ రైట్ , హోల్డ్ ఇట్ హై (Fold it right, hold it high) అంటే జెండాను సరిగ్గా మడతపెట్టడం..అలాగే నింగికెత్తి సగర్వంగా పట్టుకోవడమనే నినాదాన్ని తలకెక్కించుకోవాలి. కేవలం ఒక్క రోజు జెండాను పట్టుకుని ఫోటోలకు ఫోజులివ్వడం కాదు. ఆ జెండా గౌరవాన్ని కాపాడటం మనందరి రెస్పాన్సిబులిటీ అని తెలుసుకోవాలి.

ఈ ఆగస్ట్ 15 నుంచి అయినా ఇలాంటివారి మైండ్‌సెట్ మారాలి. మన జెండా అంటే మన ఆత్మగౌరవం.. దాన్ని నేలపాలు కానివ్వకుండా ఉంచడమే మన దేశానికి మనమిచ్చే నిజమైన గౌరవం అని గుర్తించాలి.

Air India : ఎయిర్ ఇండియాలో ఇకపై పైలట్లకు డోప్ టెస్టులు..ఇండియాలో గంజాయి వాడకం అసలెందుకు పెరుగుతుంది?

Related Articles

Back to top button