Registration:ఆ భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..ఇంటి పన్ను రశీదు ఉంటే చాలు
Registration:ఎలాంటి పాత రికార్డులు , లింక్ దస్తావేజులు లేకపోయినా సరే, చాలా ఈజీగా భూములను, ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకునే వీలు కలుగుతుంది.
Registration
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన వార్తతో పాటు తీపి కబురును అందించింది. చాలా కాలంగా నిలిచిపోయి, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఒక పెద్ద రెవెన్యూ సమస్యకు ఏపీ ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలోని గ్రామకంఠం భూములు, నివాస స్థలాల రిజిస్ట్రేషన్లకు (Registration of Gramakantam Lands) కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ కొత్త నిర్ణయం వల్ల ఇకపై ఎలాంటి పాత రికార్డులు , లింక్ దస్తావేజులు లేకపోయినా సరే, చాలా ఈజీగా భూములను, ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకునే వీలు కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు కాక, ఆస్తులు ఉన్నా కూడా వాటిని అమ్ముకోలేక, వాటిపై బ్యాంక్ లోన్లు పొందలేక సతమతమవుతున్న సామాన్యులకు ఈ నిర్ణయం కొండంత అండగా నిలవబోతోంది.
గ్రామంలో ఉండే నివాస ప్రాంతాలను, ఇళ్ల స్థలాలను గ్రామకంఠం భూములుగా పిలుస్తారు. ప్రభుత్వ అవసరాలు , సామాజిక అవసరాలకు ఉపయోగించే స్థలాలు తప్ప, మిగిలిన సాధారణ గ్రామకంఠం భూములను 22ఎ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ గతంలోనే ఒకసారి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయినా సరే , క్షేత్రస్థాయిలో భూముల సబ్ డివిజన్ (విభజన) ప్రక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల చాలా చోట్ల మొత్తం సర్వే నంబర్లన్నీ నిషేధిత జాబితాలోనే ఇంకా ఉండిపోయాయి.
పైగా ఈ స్థలాలకు సంబంధించి పాత రికార్డులు గానీ, లింక్ డాక్యుమెంట్లు గానీ ఎవరి వద్ద సరిగ్గా లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీటి రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఈ ఘోరమైన టెక్నికల్ సమస్యను గమనించిన కూటమి ప్రభుత్వం, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో సరికొత్త రిజిస్ట్రేషన్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన తాజా గైడ్లైన్స్ ప్రకారం, ఒక వ్యక్తికి సంబంధించిన భూమి , ఇంటి స్థలం అనేది అధికారిక వెబ్లాండ్ (Webland) రికార్డుల్లో గ్రామకంఠం సర్వే నంబరుగా నమోదై ఉంటే చాలు. ఆ సర్వే నంబరు నిషేధిత ఆస్తుల లిస్టులో ఉందా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా సబ్ రిజిస్ట్రార్ అధికారులు వెంటనే రిజిస్ట్రేషన్(Registration) ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ ఆ స్థలం గ్రామకంఠం పరిధిలోకి వస్తుందని నిరూపించే ఎలాంటి పాత లింక్ దస్తావేజులు లేకపోయినా కూడా టెన్షన్ చెందాల్సిన అవసరం లేదు. అలాంటి ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం స్థానిక పంచాయతీ, మున్సిపాలిటీ సంస్థలు జారీ చేసిన ఇంటి పన్ను (House Tax) రశీదును చూపిస్తే సరిపోతుంది, దానినే అధికారిక పత్రంగా అధికారులు అంగీకరిస్తారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వంశపారంపర్యంగా వస్తున్న ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్(Registration) కోసం కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. పట్టణ పరిధిలో ఉన్న వారసత్వ ఖాళీ స్థలాలకు లింక్ డాక్యుమెంట్లు , హౌస్ ట్యాక్స్ రశీదులు లేకపోతే, అక్కడ చెల్లించే ఖాళీ స్థలం పన్ను (Vacant Land Tax) రశీదును రిజిస్ట్రేషన్ అధికారులు ప్రామాణికంగా తీసుకోవాలి.
అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వంశపారంపర్య ఖాళీ స్థలాలకు లింక్ పత్రాలు కానీ, ట్యాక్స్ రశీదులు కానీ ఏవీ లేని పక్షంలో, రిజిస్ట్రేషన్ చేయించుకునే వ్యక్తి తన దస్తావేజులోనే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ (Self-Declaration) రాసి ఇస్తే సరిపోతుంది. ఆ స్థలం తమకు వారసత్వంగా వచ్చిందని, ఎలాంటి గొడవలు లేకుండా దానిని అనుభవిస్తున్నామని, అది ప్రభుత్వ నిషేధిత లిస్టులో లేదని దానిలో రాసి సంతకం పెడితే దానినే అధికారులు అంగీకరిస్తారు.

ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు కఠిన ఆదేశాలు ఇచ్చింది. డాక్యుమెంట్లు లేవనే నెపంతో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి సర్టిఫికెట్లు తీసుకురావాలని ప్రజలపై ఎలాంటి ఒత్తిడిని తీసుకురాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో 2023 ,2026 లలో రిలీజ్ చేసిన అధికారిక సర్క్యులర్ మార్గదర్శకాలను బేస్ చేసుకుని మాత్రమే ఈ రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భూ రికార్డుల నిర్వహణ మరింత పారదర్శకంగా మారడమే కాకుండా, గ్రామకంఠం స్థలాల్లో నివసిస్తున్న పేద, మధ్యతరగతి వర్గాల ఆస్తులకు చట్టబద్ధమైన రక్షణ, లీగల్ వాల్యూ లభిస్తుందని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు.





