Kanaka Durga Temple : కనకదుర్గమ్మ దసరా దర్శనాలపై సంచలన నిర్ణయం.. రూ.100, 300, 500 టికెట్లు రద్దు..
Kanaka Durga Temple : ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.వంద, రూ.3 వందలు, రూ.5 వందల దర్శన టికెట్ల విధానాన్ని దసరా ఉత్సవాల టైమ్‌లో పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు.
Kanaka Durga Temple
విజయదశమికి ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ కనకదుర్గమ్మ(Kanaka Durga Temple) దర్శనం కోసం వెళ్లాలనుకుంటున్న సామాన్య భక్తులకు ఆలయ కమిటీ శుభవార్త చెప్పింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో సామాన్యులకు ఎలాంటి ఖర్చు లేకుండా అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని కళ్లారా చూసుకోవడానికి వీలుగా నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా ఇంద్రకీలాద్రి కొండపై దర్శనం అంటే టికెట్ల గోల, వీఐపీల హడావుడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ ఈసారి దుర్గా నవరాత్రులు జరిగే ఆ తొమ్మిది రోజుల పాటు అలాంటి దృశ్యం కనిపించదు. ఎందుకంటే ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.వంద, రూ.3 వందలు, రూ.5 వందల దర్శన టికెట్ల విధానాన్ని దసరా ఉత్సవాల టైమ్‌లో పూర్తిగా పక్కన పెట్టేసి, అన్ని క్యూలైన్లలోకి ఉచితంగానే అనుమతించడానికి ఆలయ పాలకమండలి నిర్ణయించుకుంది.
ఏటా నవరాత్రి ఉత్సవాల సమయంలో లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి తిప్పలు లేకుండా క్యూలైన్లలో చకచకా అమ్మవారి దర్శనాన్ని కల్పించడానికి అధికారులు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.
మరి వీఐపీలు, సిఫార్సు లెటర్స్‌తో వచ్చే ఆఫీసర్ల కోసం భవానీ ప్రత్యేక దర్శనం పేరుతో సరికొత్తగా రూ.1000 టికెట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ రూ. 1000 ప్రవేశ పత్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవడంతో పాటు కుమ్మరిపాలెం, కాళేశ్వరరావు మార్కెట్, స్వరాజ్య మైదానం సెంటర్లలో ఉన్న కౌంటర్లలో డైరెక్ట్‌గా కూడా కొనుక్కోవచ్చు.
ఈ టికెట్ తీసుకున్న వారిని కొండపైకి ప్రత్యేక వెహికల్స్‌లో తీసుకుని వెళ్లి వేగంగా దర్శనం చేయిస్తారు. కాకపోతే ఈ వీఐపీ దర్శనం రోజంతా ఉండదు. కేవలం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో రెండేసి గంటల టైమ్ స్లాట్ ప్రాతిపదికన స్పెషల్ ట్రిప్పులుగా మాత్రమే వీరిని పంపిస్తారు.

ఇక ఇంద్రకీలాద్రిపై నవరాత్రుల సమయంలో సామాన్య భక్తుల రద్దీని తట్టుకోవడానికి గట్టి బందోబస్తుతో పాటు ఐదు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. వినాయక గుడి, కుమ్మరిపాలెం పాయింట్ల నుంచి మొదలయ్యే ఈ లైన్లు ఘాట్ రోడ్ వద్దకు వచ్చేసరికి మూడుగా మారతాయి. ఆ తర్వాత మళ్లీ టర్నింగ్ పాయింట్ దగ్గర 5 లైన్లుగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దసరా ఉత్సవాల తొమ్మిది రోజులు కూడా రద్దీ ఎంత పెరిగినా సరే.. భక్తులెవరూ ఇబ్బంది పడకుండా దుర్గమ్మ ఆశీస్సులు పొందేలా ఆలయ(Kanaka Durga Temple) యంత్రాంగం అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.





