Seediri Appalaraju : సొంత వ్యూహాలే బూమరాంగ్ అయ్యాయా?.. సీదిరి అప్పలరాజు భవిష్యత్తు ఏంటి?
Seediri Appalaraju : ప్రమాదం జరగడానికి కరెక్టుగా 2 రోజుల ముందే ఆరవ్ వర్మకు లెర్నర్స్ లైసెన్స్ జారీ కావడం వెనుకున్న మతలబు ఏంటనే దానిపై లోతైన దర్యాప్తు సాగుతోంది.
Seediri Appalaraju
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఇటీవల గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన దుర్ఘటన జరిగి, రోజులు గడిచిపోయినా కూడా.. ఆ కేసు సృష్టించిన రాజకీయ ప్రకంపనలు మాత్రం ఆగలేదు. తన కొడుకు ఆరవ్ వర్మ చేసిన తప్పును కప్పిపుచ్చడానికి, అతడిని చట్టం నుంచి రక్షించడానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు(Seediri Appalaraju) వేసిన అడుగులు.. ఇప్పుడు ఆయన రాజకీయ, సామాజిక మనుగడనే ప్రశ్నార్థకంలో పడేస్తున్నాయి.
ప్రమాదం జరిగిన రోజు సీదిరి అప్పలరాజు వెంటనే..తన కొడుకుకు బదులు వేరే యువకుడిని పోలీసుల ముందుకు పంపి, సీన్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టింది. టెక్నాలజీ, సీసీటీవీ ఆధారాల ముందు సీదిరి స్క్రీన్‌ప్లే నిలబడలేకపోయింది.
చివరకు ఆయన కొడుకు ఆరవ్ వర్మ జైలు పాలు కావడమే కాకుండా.. సాక్ష్యాలను తారుమారు చేయడమే కాకుండా.. పోలీసులను తప్పుదోవ పట్టించడం వంటి తీవ్రమైన ఆరోపణలతో ఇప్పుడు సీదిరి అప్పలరాజు కూడా బీఎన్‌ఎస్ చట్టం కింద బుక్ అవ్వాల్సి వచ్చింది. కొడుకును రక్షించబోయి తనే స్వయంగా చట్టపరమైన ఉచ్చులో ఇరుక్కుపోవడం ఇప్పుడు అప్పలరాజును డిఫెన్స్‌లో పడేసినట్లు అయింది.
ఈ కేసులో ప్రమాదానికి కారణమైన ఆరవ్ వర్మను మొదటి నిందితుడిగా (ఏ1), ఆరవ్ స్థానంలో తప్పును ఒప్పుకోవడానికి వచ్చిన సీదిరి అప్పలరాజు అనుచరుడు సిద్ధార్థ త్యాడిని రెండో నిందితుడిగా (ఏ2) చేర్చారు. అలాగే ఈ మొత్తం డ్రామా వెనుక ఉన్నమాజీ మంత్రి సీదిరి అప్పలరాజును మూడో నిందితుడిగా (ఏ3) చేర్చారు.
ఇప్పటికే ఆరవ్, సిద్ధార్థ ఇద్దరూ అరెస్ట్ అయి జైలు ఊచలు లెక్కపెడుతుండగా.. ఇప్పుడు ఏ3గా ఉన్న అప్పలరాజు వంతు కూడా వచ్చిందని, కొన్ని గంటల్లోనే ఆయన అరెస్ట్ ఖాయమనే చర్చ పలాస నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. దర్యాప్తు ప్రక్రియను స్పీడప్ చేసిన పోలీసులు అప్పలరాజు కదలికలపై నిఘా ఉంచారు.
ఈ కేసులో పోలీసులు మరికొన్ని సంచలన కోణాలపై కూడా దృష్టి పెట్టారు. ప్రమాదం జరగడానికి కరెక్టుగా 2 రోజుల ముందే ఆరవ్ వర్మకు లెర్నర్స్ లైసెన్స్ జారీ కావడం వెనుకున్న మతలబు ఏంటనే దానిపై లోతైన దర్యాప్తు సాగుతోంది.

మరోవైపు చట్టపరమైన చర్యల నుంచి తాను ఎలాగైనా తప్పించుకోవాలని, ఒకవేళ అరెస్ట్ తప్పనిసరి అయితే కనుక ముందస్తు బెయిల్ లేదా ఇతర లీగల్ రక్షణలు ఎలా పొందాలనే విషయంపై సీదిరి అప్పలరాజు తన లాయర్లతో అత్యవసర సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇటు అప్పలరాజు భార్య లాయర్‌తో కలిసి జిల్లా జైలుకు వెళ్లి అక్కడ ఉన్న కొడుకు ఆరవ్‌ను కలిసి మాట్లాడి వచ్చారు . అయితే ఈ మొత్తం వ్యవహారంపై, తనపై వస్తున్న ఆరోపణలపై ఇప్పటి వరకూ కూడా మాజీ మంత్రి అప్పలరాజు(Seediri Appalaraju) ఎక్కడా నోరు విప్పకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.





