Vijaysai Reddy : 2029 ఎన్నికలలో పీఆర్పీ కింగ్ మేకర్ అవుతుందా? అసలు విజయసాయి రెడ్డికి అంత సీన్ ఉందా?
Vijaysai Reddy : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) ఏపీ రాజకీయాలలో తన ఉనికిని చాటుకోగలదా? 2029 ఎన్నికల టార్గెట్‌గా రెండు కుటుంబాల ఆధిపత్యానికి చెక్ పెడతామని చెబుతున్న విజయసాయి రెడ్డికి అది సాధ్యమేనా?
Vijaysai Reddy
ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ గ్రౌండ్లో ఉన్నట్టుండి బాంబ్ పేలడం వరకూ బాగానే ఉంది. దశాబ్ద కాలానికి పైగా ఒక బలమైన పొలిటికల్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన విజయసాయిరెడ్డి(Vijaysai Reddy)..తాజాగా పరివర్తన రాజనీతి పార్టీ (PRP) పేరుతో జెండా ఎగరేసి సరికొత్త రాజకీయ రణరంగానికి తెరతీద్దామని మాస్టర్ ప్లాన్ వేశారు. అయితే రెండు ప్రధాన కుటుంబాల ఆధిపత్యానికి చరమగీతం పాడటమే తమ టార్గెట్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్ష శిబిరాల్లో అనుకున్నంత సంచలనాన్ని రేపలేకపోయాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.
ఇటు 2024 ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ ఎదుర్కొంటున్న వరుస కష్టాలు ఒక ఎత్తయితే, ఆ పార్టీలో నెంబర్-2 హోదా అనుభవించి నియోజకవర్గ స్థాయిలో బలమైన కేడర్ కనెక్టివిటీ ఉన్న సాయిరెడ్డి బయటకు వచ్చి ఆ పార్టీపైనే ఎదురు దాడికి దిగడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగానే కనిపిస్తోంది.
2014 ఎన్నికలలో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడానికి అధినాయకత్వపు అహంకారమే కారణమంటూ సాయిరెడ్డి డైరెక్టుగా.. జగన్‌పైనే విమర్శల బాణాలు విసురుతున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలలో అలాగే పుర ఎన్నికలు, బై పోల్‌లో టికెట్లు రాక లేదా ప్రాధాన్యత దక్కక అసంతృప్తితో రగిలిపోతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలను తమ పార్టీ వైపు ఆహ్వానిస్తున్నారు. నిజంగా ఇది వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు పెద్ద గండి కొట్టే పరిణామమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ఈ పరిణామం టీడీపీ,జనసేన,బీజేపీ కూటమికి పూర్తిగా లాభమే చేకూరుస్తుందా అంటే అది కూడా నాణేనికి ఒకవైపే అని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ ఓట్లు చీలిపోతే అధికార కూటమికి ఎన్నికల్లో విజయావకాశాలకు మెరుగవుతాయనేది నిజమే అయినా కూడా, విజయసాయిరెడ్డి ఎంచుకున్న ’66 శాతం సీట్లు యువతకే’ (Gen-Z) అనే స్ట్రాటజీ మాత్రం కూటమిపై కొంత ప్రభావాన్ని చూపిస్తుంది.
అంతేకాకుండా ప్రజా క్షేత్రంలో న్యూట్రల్ విధానాలు, రైతులకు ఫ్రీ కరెంట్, యువతకు ఉపాధి హామీలు కల్పిస్తామని చెబుతూ తటస్థ ఓటర్లను, యూత్‌ను ఆకర్షించడానికి విజయసాయి రెడ్డి వేస్తున్న పావులు కూటమి ఓటు బ్యాంకునూ కొంతమేర దెబ్బతీసే అవకాశం ఉంటుంది.
మరి విజయసాయి రెడ్డి(Vijaysai Reddy) పరివర్తన రాజనీతి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపించగలదనే ప్రశ్నే వస్తే మాత్రం.. 2029లో మొత్తం 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామని సాయిరెడ్డి కాన్పిడెంట్‌గా చెబుతున్నా కూడా.. క్షేత్రస్థాయిలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడం అది కూడా అంత తక్కువ టైములో ఆ రేంజ్లో పోటీ ఇవ్వడం అనుకున్నంత సులువేమీ కాదన్నది విశ్లేషకుల మాట.
ఎందుకంటే ఇప్పటి వరకూ విజయసాయి(Vijaysai Reddy) మార్కు రాజకీయాలను ప్రజలు చూసింది లేదు. ప్రజలలోకి దూసుకువెళ్లాలన్నా.. వారితో మమేకం కావాలన్నా కూడా 2029 ఎన్నికలకు ఉన్న సమయం కూడా తక్కువే. ఇంత తక్కువ సమయంలో ఓటర్లలో తనదైన ముద్ర వేయడం దాదాపు అసాధ్యమే అంటున్నారు. ఇంకా చెప్పాలంటే కేవలం మీడియా సమావేశాలు, ఘాటు నినాదాలకే పరిమితం అవకుండా, ప్రత్యామ్నాయ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లగలిగితేనే ఈ పార్టీకి కాస్త అయినా మనుగడ ఉంటుంది.
ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో ఈ విజయసాయి రెడ్డి పరివర్తన రాజనీతి పార్టీ సొంతంగా గెలిచే రేంజ్‌కి ఎదుగుతుందా లేదంటే కేవలం కూటమి, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల విజయావకాశాలను మాత్రమే దెబ్బతీసే ఒక బలమైన ఓట్ల చీలికదారు (Vote Splitter) గా మాత్రమే పరిమితమవుతుందా అనేది ఏపీ పాలిటిక్స్‌లో ఆసక్తికరమైన అంశంగా మారింది.





