Just Andhra PradeshJust TelanganaLatest News

Yellow Alert : తెలుగు రాష్ట్రాలకు అల్పపీడన ముప్పు..ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు ఇవే..

Yellow Alert : వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన బలమైన అల్పపీడనం అలాగే దానికి తోడుగా ఉన్న గాలుల మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది.

Yellow Alert

తెలంగాణలో కాస్త వరుణుడు కరుణిస్తూ వస్తున్నా .. ఏపీలో కొద్దిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు మాత్రం వాతావరణం సడన్‌గా బిగ్ రిలీఫ్ ఇచ్చింది. రెండు రాష్ట్రాలలో ఆకాశంలో మబ్బులు కమ్మేసి వర్షాలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి.

వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన బలమైన అల్పపీడనం అలాగే దానికి తోడుగా ఉన్న గాలుల మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోని తీరప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరిగింది. ఈ మార్పుల వల్ల రాబోయే రెండు మూడు రోజులు రెండు రాష్ట్రాల్లో వానల హోరు ఎక్కువగానే ఉండబోతోందని వాతావరణ శాఖ చెబుతోంది.

తెలంగాణలో నమోదైన వర్షపాతం వివరాలను ఒకసారి చూస్తే.. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో ఏకంగా 6.5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం రికార్డవగా.. కామారెడ్డి జిల్లా పిట్లం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలలో 5.1 సెంటీమీటర్ల చొప్పున భారీ వాన దంచికొట్టింది.

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 4.7 సెంటీమీటర్లు, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌తో పాటు , ముత్తారంలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా.. సంగారెడ్డి జిల్లా కల్హేర్, మెదక్ జిల్లా టేక్మల్‌లలో 4.2 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 3.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.

వీటితో పాటు యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిశాయి. అయితే ఈ భారీ వానల వల్ల హైదరాబాద్‌లో ఆర్బీఐ రోడ్డుపై రవీంద్రభారతి దగ్గర తెల్లవారుజామున భారీ చెట్టు కూలిపోయింది. దాంతో చెట్టు కింద ఉన్న కరెంట్ స్తంభం విరిగిపడి ఒక ఆటో పూర్తిగా ధ్వంసమైంది. అయితే చెట్టు కూలే సమయంలో అలర్ట్ అయిన ఆటో డ్రైవర్ .. కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది.

సోమవారం తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, కామారెడ్డి, కరీంనగర్,మహబూబాబాద్, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఇక కరీంనగర్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఆయా జిల్లాల యంత్రాంగం పూర్తి అలర్ట్‌తో ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

Yellow Alert
Yellow Alert

మరోవైపు బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసింది. తీరం పొడవునా గంటకు 40 – 60 కిలోమీటర్ల వేగంతో విపరీతమైన ఈదురుగాలులు విరుచుకుపడే అవకాశం ఉంది.

సముద్రంలో అలలు రాకాసిగా ఎగసిపడే ప్రమాదం ఉండటంతో మంగళవారం వరకు కూడా మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ గాలుల దాటికి చెట్లు, పెద్ద పెద్ద హోర్డింగ్‌లు కూలే డేంజర్ పొంచి ఉంది కాబట్టి వాటి కింద నిలబడకుండా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Olive Oil : ఆలివ్ ఆయిల్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..ఖర్చు తగ్గించే హోమ్‌మేడ్ చిట్కా..

Related Articles

Back to top button