Just Andhra PradeshJust TelanganaLatest News

Adulterated Food : తెలుగు రాష్ట్రాల్లో కల్తీ మాఫియా పంజా.. FSSAI ర్యాంకింగ్స్‌లో దారుణ ప్రదర్శన ఉన్నా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్?

Adulterated Food : పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు అనలాగ్ పనీర్ , మసలాలు వంటి కల్తీ ప్రొడెక్టులపై ఉక్కుపాదం మోపుతుంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం కళ్లు మూసుకుని కూర్చున్నాయి.

Adulterated Food

మనం రోజూ తినే తిండి ఎంతవరకు సురక్షితమనే ప్రశ్న వేసుకుంటే అసలేమీ తినలేని పరిస్థితులలో ఉన్నాం . పొద్దున్నే తాగే పాల నుంచి రాత్రి తినే పనీర్ వరకు అన్నీ విషపూరితమని తెలిసినా.. ఏం చేయలేని స్థితిలోకి చేరిపోయాం.

పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు అనలాగ్ పనీర్ (నకిలీ పనీర్), మసలాలు వంటి కల్తీ ప్రొడెక్టులపై ఉక్కుపాదం మోపుతూ, కఠిన నిషేధాలు విధించి జైలు శిక్షలు ఖరారు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం కళ్లు మూసుకుని కూర్చున్నాయి. వ్యాపార లాబీల ఒత్తిళ్లకు లొంగిపోయిన అధికారులు.. అమాయక ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

దేశంలోనే కల్తీ ఆహార విక్రయాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్‌లో నిలుస్తుండటం అత్యంత విచారకరమనే చెప్పాలి. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) రిలీజ్ చేసిన నాణ్యతా సూచీలో తెలంగాణ 15వ స్థానంలో నిలిస్తే, ఆంధ్రప్రదేశ్ ఏకంగా చివరి స్థానం అయిన 17వ స్థానానికి దిగజారింది.

ఇక గణాంకాల విషయానికి వస్తే ఈ పరిస్థితి మరీ భయంకరంగా మారిపోయింది. 2025-26 కాలంలో తెలంగాణలో 3,576 ఫుడ్ శాంపిల్స్‌ను పరీక్షిస్తే, దానిలో 398 శాంపిల్స్(11.1%) నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇన్ని వందల శాంపిల్స్ ఫెయిల్ అయినా కూడా ఈ బిజినెస్ చేసిన వారికి ఒక్కరికీ కూడా పెనాల్టీ పడలేదు, ఒక్క కన్విక్షన్ కూడా నమోదు కాలేదు. సున్నా శిక్షలతో అధికారులు కల్తీ రాయుళ్లకు ఏ విధంగా రెడ్ కార్పెట్ వేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

కల్తీ ఆహారానికి జనం ప్రాణాలు పోతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 2025 జూలైలో కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందగా 31 మంది హాస్పిటల్ పాలయ్యారు.

2026 ఫిబ్రవరిలో రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు ప్రాణాలు కోల్పోగా, 2026 మార్చిలో నంద్యాలలో పులిహోర తిని 50 మందికి పైగా ఫుడ్ పాయిజనింగ్‌తో విలవిలలాడారు. ఇన్ని మరణాలు, అస్వస్థత సంఘటనలు చోటుచేసుకుంటున్నా టెంపరరీ సమీక్షలతో టైం పాస్ చేయడం తప్ప కఠిన చట్టాలను ఎందుకు తీసుకురావడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Adulterated Food
Adulterated Food

ఇతర రాష్ట్రాలు కల్తీకి పాల్పడితే ఆరు నెలల జైలు, రూ. లక్ష జరీమానాతో పాటు మరణాలు సంభవిస్తే యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 10 లక్షల ఫైన్ విధించేలా చట్టాలు తెచ్చాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నమూనాలు ఫెయిల్ అయినా, మరణాలు సంభవిస్తున్నా పట్టించుకునే నాథుడే ఉండటం లేదు.

అధికారులు ఆకస్మిక చెకింగులు నిలిపివేయడం, ల్యాబ్ సౌకర్యాల కొరత, కన్విక్షన్ రేటు సున్నాగా ఉండడం వల్లే కల్తీ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా దూసుకుపోతున్నాయి. సురక్షితమైన ఆహారాన్ని అందించడం గవర్నమెంట్‌ కనీస బాధ్యత. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి అనలాగ్ పనీర్‌, మసాలాలు, ఇతర కల్తీ ఆహారాలపై బ్యాన్ విధించడంతో పాటు, కల్తీదారులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయకపోతే.. ప్రజల ఆరోగ్య భద్రత ప్రశ్నార్థకమే అవుతుంది.

Bilibili : ఫస్ట్ వీడియోకే చేతికి డబ్బులు..యూట్యూబ్‌కి పోటీగా గ్లోబల్ రేసులోకి కొత్త యాప్ బిలిబిలి..

Related Articles

Back to top button