Bedtime Snack:వెయిట్ తగ్గాలనుకునేవారికి బెడ్ టైం స్నాక్ ..తయారీ కూడా చాలా సింపుల్
Bedtime Snack: వెయిట్ తగ్గాలనుకునే వారే కాదు కాస్త ఆరోగ్యంగా డిన్నర్ చేయాలనుకున్నవారు ఎవరైనా సరే ధైర్యంగా ఈ స్నాక్ తీసుకోవచ్చు.
Bedtime Snack
వెయిట్ తగ్గాలని డైటింగ్ చేసే వారికి రాత్రిపూట ఏమైనా తినాలని అన్పించే క్రేవింగ్స్ ఒక పెద్ద సమస్య అనే చెప్పాలి . పగలు ఎంత కష్టపడి కంట్రోల్‌లో ఉన్నా, రాత్రి(Bedtime Snack )పడుకునే ముందు ఏదైనా స్వీట్, స్నాక్స్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు తినే జంక్ ఫుడ్ వల్ల ఆ రోజంతా కష్టపడి ఆకలిని, మనసును కంట్రోల్ చేసుకున్న కష్టం అంతా క్షణాల్లో వృధా అయినట్లే అవుతుంది.
అందుకే ఇలాంటివారి కోసం ఒక అద్భుతమైన లో- కేలరీ డెజర్ట్ రెసిపీ తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనం తినే పండ్ల కస్టర్డ్‌లో చక్కెర, కస్టర్డ్ పౌడర్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ స్పెషల్ రెసిపీలో షుగర్, కస్టర్డ్ పౌడర్‌ని పూర్తిగా తీసేసి, కేవలం 230 కేలరీలతో, 9 గ్రాముల ప్రోటీన్ అందేలా ప్లాన్ చేశారు. ఇది మన పొట్టను నింపడమే కాకుండా, తీపి తినాలనే కోరికను కూడా తీరుస్తుంది.
దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక . కేవలం ఐదు నుంచి ఏడు నిమిషాల్లో ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. దీనికోసం మనకు పావు కప్పు మఖానా (తామర గింజలు), ఒక చెంచా డ్రై ఫ్రూట్స్ పొడి, చిటికెడు కుంకుమపువ్వు , కొద్దిగా తక్కువ కొవ్వు ఉన్న పాలు కావాలి.
ముందుగా మఖానా, డ్రై ఫ్రూట్స్ పొడిని వేడి పాలలో నానబెట్టాలి. అవి మెత్తబడ్డాక, కొంచెం తేనె కలిపి మెత్తని పేస్టులా గ్రైండ్ చేయాలి. దీంతో మన హెల్తీ కస్టర్డ్ బేస్ రెడీ చేసుకున్నట్లు అన్నమాట. ఆ తర్వాత ఆపిల్, కివి, దానిమ్మ, అరటిపండు , నల్ల ద్రాక్ష వంటి పండ్లను చిన్న ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ పండ్ల ముక్కలపై ముందు తయారు చేసుకున్న మఖానా ప్యూరీని పోసి, మెల్లగా కలిపి ఒక 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లబడిన తర్వాత తింటే, అది ఐస్ క్రీమ్ లాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.

ఈ రెసిపీలో మఖానా వాడటం వల్ల బాడీకి మంచి ప్రోటీన్ అందుతుంది, పండ్ల వల్ల కొన్ని రకాల విటమిన్లు లభిస్తాయి. పంచదార వాడకపోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఏ మాత్రం పెరగవు. వెయిట్ తగ్గాలనుకునే వారే కాదు కాస్త ఆరోగ్యంగా డిన్నర్ చేయాలనుకున్నవారు ఎవరైనా సరే ధైర్యంగా ఈ స్నాక్ తీసుకోవచ్చు.
ఎందుకంటే ఈ రెసిపీ కేవలం వెయిట్ తగ్గడానికే కాదు, మన బాడీకి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. అంతేకాదు పిల్లలకు, పెద్దవాళ్లకు కూడా బయట దొరికే ఐస్ క్రీమ్స్ బదులు ఇలాంటివి స్వయంగా తయారు చేసి పెడితే వారికి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చిన వాళ్లం అవుతాం.





