Coffee : కాఫీ లవర్స్ కు అలర్ట్..ఖాళీ కడుపుతో తాగితే సమస్యలే
Coffee : కాఫీ మన రోజువారీ జీవితంలో కీలక భాగంగా మారింది, కానీ దాన్ని ఎప్పుడు, ఎంత మోతాదులో తాగాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం
Coffee
కాఫీ… చాలా మంది దినచర్య దీనితోనే మొదలవుతుంది. బెడ్ మీద నుంచే కాఫీ తాగేవాళ్ళు కొందరు… టిఫిన్ కంటే ముందు కాఫీ(Coffee) తాగేవారు మరికొందరు.. ఇక ఫ్రెండ్స్ తోనూ, ఆఫీస్ లోనూ ఎక్కడ చూసినా కాఫీ కప్పులతోనే అందరూ కనిపిస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే అందరికీ ఫోన్ లేకుండా ఎలా జీవితం ముందుకు సాగదో దాదాపుగా కాఫీ(Coffee) కూడా అంతే.
కాఫీ ఎనర్జీని ఇస్తుందని నమ్మి తెగతాగేవారూ ఉంటారు. వామ్మో కాఫీలో ఉండే కెఫీన్ తో ఆరోగ్యానికి ప్రమాదం అంటూ మితంగా తాగేవారు కూడా ఉన్నారు. అయితే ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యం.. అమితంగా తీసుకుంటే అనారోగ్యం… కాఫీ తాగేవారికి ఇప్పుడు చెప్పబోయే సంగతులు కాస్త ఇబ్బందిగా అనిపించేవే.
వాస్తవానికి కాఫీ వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. మనం ఎంత మోతాదులో, ఏ సమయంలో తాగుతున్నామనే దానిపైనే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ప్రముఖ వైద్యనిపుణులు ఇటీవల కాలంలో కాఫీ గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు. చాలా మంది ఖాళీ కడుపుతో కాఫీ తాగుతారు.
అయితే గ్యాస్ట్రిక్ , కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో కాఫీని అస్సలు తీసుకోకూడదుని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి గ్యాస్, ఎసిడిటీ సమస్యలు మరింత తీవ్రమవుతాయంటున్నారు.
ఈ సందర్భంగా కాఫీ తాగే సమయానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఉదయం అల్పాహారానికి 30 నిమిషాల ముందు కాఫీ తాగడానికి అత్యంత అనువైన సమయంగా చెబుతున్నారు. లేదా అల్పాహారంతో పాటు తీసుకోవచ్చు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే అల్పాహారానికి, మధ్యాహ్న భోజనానికి మధ్య ఉదయం 11 గంటల సమయంలో కాఫీ తాగితే ఆరోగ్యానికి మేలు.

ఇక కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలను చూస్తే కాఫీ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. చాలా మంది జిమ్ కు వెళ్లే ముందు తాగడానికి కారణం ఎక్సర్ సైజ్ చేసేటప్పుడు త్వరగా అలసిపోకుండా ఉంటారు. కాఫీ శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్ల స్థాయిని పెంచుతుంది. పరిమిత మోతాదులో కాఫీ తాగడం వల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుందని కూడా పలు పరిశోధనల్లో నిరూపితమైంది. అదే సమయంలో కాఫీ అతిగా తీసుకుంటే వచ్చే నష్టాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
రాత్రి పడుకునే ముందు కాఫీ తాగితే నిద్రపోవడం సమస్యగా మారుతుంది. ఇది క్రమంగా స్లీప్ డిజార్డర్ కు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. విపరీతంగా కాఫీ తాగడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది. కొందరిలో బీపీ అకస్మాత్తుగా పడిపోయే అవకాశం కూడా ఉంది. దీని ప్రకారం చూస్తే రోజుకు రెండు మూడు కప్పులకు మించి తాగొద్దని వైద్యులు సూచిస్తున్నారు.





