Dengue : డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయ్..పగటిపూట తిరిగే ఆ దోమలతో తస్మాత్ జాగ్రత్త..
Dengue : సాధారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే దోమల లార్వాలు కొట్టుకుపోతాయి. కానీ,అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో నీరు అక్కడక్కడే నిలిచిపోతుండటంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
Dengue
భాగ్యనగరంలో ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి చాపకింద నీరులా మెల్లగా విస్తరిస్తోంది. గతంలో కేవలం ఒక నిర్దిష్ట రుతువులో మాత్రమే కనిపించే ఈ డెంగ్యూ(Dengue), ఇప్పుడు వాతావరణంలో వస్తున్న వివిధ మార్పుల వల్ల ఏడాది పొడవునా వేధిస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో కొద్ది రోజులు ఎండలు కాయడం, మరికొద్ది రోజులు విడతల వారీగా కురిసే తేలికపాటి జల్లుల వల్ల వాతావరణంలో వస్తున్న మార్పులు దోమల సంతానోత్పత్తికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. సాధారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే దోమల లార్వాలు కొట్టుకుపోతాయి. కానీ,అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో నీరు అక్కడక్కడే నిలిచిపోతుండటంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
అయితే డెంగ్యూ(Dengue) వైరస్ బారిన పడుతున్న వారిలో సుమారు 80 శాతం మందికి గతంలో లాగా ఎలాంటి బాహ్య లక్షణాలు కనిపించడం లేదు. దీనివల్ల తమకు ఇన్ఫెక్షన్ ఉందనే విషయం తెలీకుండానే జనాల్లో కలిసి తిరుగుతూ, వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. ఇలాంటి వ్యక్తులను కుట్టిన దోమలు మళ్లీ ఇతరులను కుట్టడం ద్వారా ఈ వ్యాధి వేగంగా అందరికీ విస్తరిస్తోంది. గతంతో పోలిస్తే ఈడిస్ ఈజిప్టి రకం మస్కిటోస్ సిటీ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడిపోయాయి. ఇవి ఇప్పుడు బయటి ఎక్కడో కాకుండా మన ఇళ్ల లోపలే సురక్షితమైన స్థావరాలను ఏర్పరచుకుంటున్నాయి.

మన ఇంట్లో ఉండే ఎయిర్ కూలర్లు, ఫ్రిజ్ వెనుక భాగంలోని వాటర్ ట్రేలు, ఏసీ పైపుల ద్వారా కారే నీరు, పూలకుండీల ట్రేలలో అడుగున ఉంటున్న నీటిలోనే ఇవి ఎక్కువగా గుడ్లు పెడుతున్నాయని నిపుణులు గుర్తించారు. ఈ దోమలు పగటిపూట మాత్రమే కుడతాయి. అందువల్ల పిల్లలు ఉండే పాఠశాలలు, ఉద్యోగులు ఉండే కార్యాలయాలు, ఇతర బహిరంగ ప్రదేశాలలో డెంగ్యూ సోకే డేంజర్ చాలా ఎక్కువగా ఉంది.
ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఇంటి పరిసరాల్లో కొంచెం కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రతి వారం ఇంట్లో ఉన్న వాటర్ కంటైనర్లను, డ్రమ్ములను ఖాళీ చేసి వాటిని బాగా రుద్ది కడగాలి. జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపించగానే డాక్టర్లను సంప్రదించి టెస్టులు చేయించుకుంటే మంచిది.
Iran : పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. అటకెక్కిన అమెరికా,ఇరాన్ శాంతి ఒప్పందం





